శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో వైఎస్ జగన్ భేటీ

25 Nov, 2013 20:17 IST|Sakshi
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో వైఎస్ జగన్ భేటీ

ముంబై:  రాష్ట్ర విభజన ప్రక్రియను స్తంభింపచేసేలా మద్దతు ఇచ్చేందుకు శివసేన చీఫ్ ఉద్ధవ్‌ థాకరే అంగీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.  కొత్త రాష్ట్రాలు ఏర్పడితే గతంలో అసెంబ్లీలో తీర్మానాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ రోజు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను, ఉద్ధవ్‌ ఠాక్రేను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్-3ని సవరించడానికి ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. లోక్‌సభలో 270 మంది మద్దతున్న ఏ పార్టీ అయినా వాళ్ల వాళ్ల ప్రయోజనాల కోసం ఏ రాష్ట్రాన్నైనా విభజిస్తారని తెలిపారు. అందుకనే ఆర్టికల్‌ -3ని సవరించాలని తాము ఒత్తిడి తెస్తున్నామన్నారు. మొదటిసారిగా దేశంలో ఎప్పుడూ సంభవించనిది ఇప్పుడు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో తొలిసారిగా ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్‌పార్టీ విభజనకు పాల్పడుతోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్ధవ్‌ సహా అందరి సహకారం కోరుతున్నామన్నారు.


రేపు మహారాష్ట్ర, ఎల్లుండి కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడునూ విభజిస్తారని మండిపడ్డారు. 2/3 మెజార్టీతో అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించడం తప్పనిసరి అవుతుందని జగన్ తెలిపారు. అధికారంలోకి రామని తెలిస్తే ఏ పార్టీ అయినా విభజనకు దిగడానికి పూనుకుంటుందని, ప్రాంతీయంగా ఉన్న భావోద్వేగాలతో ముడిపెట్టి ఇలాంటి ఆట ఆడటానికి ప్రతీ పార్టీ సిద్ధపడుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు