జనం పిట్టల్లా రాలుతున్నా పట్టించుకోరా?

5 Aug, 2015 02:49 IST|Sakshi
కృష్ణా జిల్లా కొత్తమాజేరులో మాట్లాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

* వారం రోజుల్లో ఏపీ సర్కార్ స్పందించకపోతే కలెక్టరేట్ వద్ద బాధిత కుటుంబాలతో ధర్నా చేస్తా
* కృష్ణాజిల్లా కొత్తమాజేరులో మృతుల కుటుంబాలకు, జ్వర పీడితులకు జగన్ పరామర్శ

 
 సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘జ్వరాలతో జనం పిట్టల్లా రాలుతుంటే ఈ  ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు. రెండున్నర నెలల్లో ఏకంగా 18 మంది చనిపోతే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గాని కన్నెత్తి చూడలేదు. చంద్రబాబుకు వారం టైమిస్తున్నా. ఈలోపు స్పందించకపోతే 18 మంది మృతుల కుటుంబాల తరపున నేను పోరాడతా. వారితో కలిసి బందరు కలెక్టరేట్ దగ్గర నేనే ధర్నా చేస్తాను’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు.
 
 కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో ఈ ఏడాది మే 11 నుంచి జూలై 21 వరకు 18 మంది జ్వరాల బారిన పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న ప్రతిపక్ష నేత జగన్ మంగళవారం గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు, అధికారులతో మాట్లాడారు. ఆ విషయాలు ప్రతిపక్షనేత మాటల్లోనే...
 
గ్రామంలో 70 రోజులుగా జ్వరాలతో బాధపడుతుంటే ఆసుపత్రిలో చేర్పించే దిక్కులేదు. ఊళ్లో మనుషులు పిట్టల్లా రాలిపోతుంటే కనీసం అధికారులు స్పందించలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గ్రామంలో ధర్నా చేసి, తీవ్రతను కలెక్టర్, డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకుని వెళ్తే అప్పుడు కాస్తోకూస్తో కదలిక వచ్చింది. హెల్త్ క్యాంపులు పెట్టారు. 15రోజులు మెడికల్ క్యాంపులు పెట్టి మందులు ఇచ్చినా జ్వరాలు అదుపులోకి రాలేదు. విజయవాడ, మచిలీపట్నం వెళ్లి వేలాదిరూపాయలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకున్నా చాలా మంది ప్రాణాలు దక్కలేదు. సరైన వైద్యం అందించలేని ప్రభుత్వం జ్వర పీడితులకు రూపాయి కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు నేను వస్తున్నానని హడావుడిగా చెరువు బాగు చేయించి, మెడికల్ క్యాంపులో డాక్టర్‌ను పెట్టారు. అసలు చనిపోయిన వారు జ్వరాలతో చనిపోలేదనే ధోరణితో వారి మృతికి వేరే అనారోగ్య కారణాలు అని చూపించే దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?
 
  గ్రామంలో వాటర్ ట్యాంకు బాగు చేసేందుకు ఉండే ఇనుప నిచ్చెన విరిగిపోయింది. 15 రోజులకు ఒకసారి ట్యాంకు క్లీన్ చేయించాల్సి ఉండగా క్లీన్ చేసి ఐదేళ్లవుతోందని గ్రామస్తులే చెబుతున్నారు. దాన్ని ఇప్పుడు హడావుడిగా రిపేరు చేయించారు. ట్యాంకులో కోతుల కళేబరాలు కుళ్లిపోయి ఉన్నాయంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. మంచినీటి చెరువును ఏడాదికొకసారి క్లీన్ చేసి, బ్లీచింగ్ చేయించాల్సి ఉండగా క్లీన్‌చేసి ఐదేళ్లకు పైనే అయింది. 18 మంది చనిపోయాక వచ్చి
 క్లీన్ చేశారు.
 
  మే నెలలో కేవలం నాలుగు రోజుల్లో ఐదుగురు జ్వరాలకు చనిపోయినప్పుడే ప్రభుత్వం మేల్కొని ఉంటే ఇంతమంది చనిపోకుండా కాపాడి ఉండవచ్చు. కంటితుడుపు చర్యగా మెడికల్ క్యాంపు పెట్టి వదిలేశారు. మందులు తింటున్నా ప్రజలు చనిపోతున్నారు. ఇంత తీవ్రమైన విషజ్వరాలు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నామనే కనీస స్పృహ కూడా ప్రభుత్వానికి లేదు. పుష్కరాల్లో చాలా కష్టపడిపోయాను అనుకున్న చంద్రబాబు నాయుడు పుష్కరాల తరువాత సెలవు తీసుకుని విదేశాలకు వెళ్లిపోయారు. ఈ జిల్లాకే చెందిన ఆరోగ్య మంత్రి కూడా ఈ రోజు వరకూ గ్రామానికి రాలేదు.
 
  కొత్త మాజేరు గ్రామంలో జరిగే జ్వరాల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఈ గ్రామానికి ఏదో సూదుల డాక్టర్‌ను కాకుండా స్పెషలిస్ట్‌లను పంపాలి. జ్వర పీడితులకు విజయవాడ, మచిలీపట్నంలలో ప్రత్యేకంగా ఉచిత వైద్యం చేయించాలి. గ్రామం అంతటా జ్వరాలు అదుపులోకి వచ్చేలా ప్రజల ఆరోగ్య పరిస్థితి నార్మల్‌గా ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలి. అయ్యా... చంద్రబాబు నాయుడూ... ఇప్పటికైనా కళ్లు తెరవండి. లేకుంటే వారం రోజులు చూస్తాం. మేమే బాధిత కుటుంబాలతో కలెక్టరేట్ దగ్గర ధర్నాకు దిగుతాం.
 
 దారిపొడవునా అపూర్వ స్వాగతం..
 కొత్తమాజేరులో జ్వర మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దారిపొడవునా జనం అపూర్వ స్వాగతం పలికారు.  జగన్ వెంట పార్టీ రాష్ట్ర నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకటరమణ, తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు కొడాలి నాని, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, మేకా ప్రతాప్ అప్పారావు, జలీల్‌ఖాన్, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి.గౌతంరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రాము తదితర నేతలు ఉన్నారు.
 
 కదిలిస్తే కన్నీరే...
 సాక్షి, విజయవాడ బ్యూరో: జ్వరంతో వణికిపోతున్న కొత్తమాజేరు గ్రామ పరిస్థితి తెలుసుకున్న వైఎస్ జగన్ గ్రామానికి కదలి వెళ్లారు. ఆదుకోవాల్సిన ఏపీ  సర్కారు అలక్ష్యం చేయడంతో వేలకు వేలు ఖర్చుపెట్టినా తమ వారి ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయామంటూ కన్నీరు మున్నీరైన బాధిత కుటుంబాల దయనీయ స్థితి చూసి ఆయన చలించిపోయారు. రెండున్నర నెలల్లో 18మందిని కోల్పోయిన గ్రామస్తులను ఓదార్చారు. ఒక్కొక్కరూ ఎలా మృతిచెం దారో కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
 
 వారికి న్యాయం జరిగేవరకూ పోరాడతానంటూ కొండంత భరోసా ఇచ్చారు. గ్రామంలో మామూలు పరిస్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. గ్రామంలో మంచినీటి ట్యాంకు, చెరువు వద్ద తహసీల్దార్ స్వర్ణమేరి, ఎంపీడీవో జానకీదేవి, డీఎల్‌పీవో సత్యనారాయణ, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్, ఎంపీటీసీ రూపా శిరీషలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో మృతుల కుటుంబాలతో ఆయన మాట్లాడి కొండంత ధైర్యం చెప్పారు. జ్వరాలతో తమ వాళ్లను కోల్పోయామంటూ మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించాయి.
 

మరిన్ని వార్తలు