లోక్‌సభలో ‘అనూహ్య’ కేసు: వైఎస్ జగన్

14 Feb, 2014 01:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితులను త్వరితగతిన పట్టుకునేలా ముంబై పోలీసులను ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. గురువారం వైఎస్ జగన్ 377 నిబంధన కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు.
 
 అనూహ్య హత్యకు సంబంధించిన వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినా ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడంపై ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ‘అనూహ్య హత్య కేసు దర్యాప్తులో ముంబై పోలీసుల తీరు బాధాకరం. సరైన రీతిలో కేసు విచారణ చేపట్టలేదు. దీనిపై విచారణ చేపట్టి నిందితులను పట్టుకోవాలని స్వయంగా వారి కుంటుంబసభ్యులు కేంద్ర హోంశాఖను కోరినా వారు పట్టించుకోలేదు. కేసు విచారణలో వారితీరు బాధాకరం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అనూహ్య కుటుంబ సభ్యులు కనుగొనేంత వరకు ముంబై పోలీసులు శవాన్ని కూడా కనుక్కోలేకపోయారు. దీన్నిబట్టి మహారాష్ట్ర పోలీసులు విచారణలో ఎంత శ్రద్ధ పెట్టారో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ దృష్ట్యా ఇప్పటికైనా హత్య కేసు నిందితులను త్వరగా పట్టుకునేలా ముంబై పోలీసులను ఆదేశించాలి. అనూహ్య కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా