మీ వెంటే మేముంటాం

23 Sep, 2015 03:05 IST|Sakshi
మీ వెంటే మేముంటాం

‘ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు’... అది సాధించుకునేంత వరకూ మీ వెంటే ఉంటాం... ఈ ఉద్యమంలో ఏ పిలుపు ఇచ్చినా సైన్యంలా ఉరుకుతాం... ఉప్పెనలా కదులుతాం.. మడమ తిప్పని పోరాటం చేస్తాం’ అంటూ విద్యార్థిలోకం నినదించింది. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో మంగళవారం జరిగిన యువభేరిలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత  జగన్‌తో ఏర్పాటు చేసిన ముఖాముఖిలో పలువురు విద్యార్థులు తమ మనోభావాలను పంచుకున్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు  జగన్ సమాధానాలిస్తూ దిశానిర్దేశం చేశారు. ఆ ముఖాముఖి ఇలా జరిగింది...    - సాక్షి, విశాఖపట్నం
 
హోదా కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధం
పోరాటంలో మీకు అండగా ఉంటాం
ఉద్యోగాలొస్తాయని బాబుకు ఓటేశాం
ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు
జగన్‌తో ముఖాముఖిలో విద్యార్థులు
హోదా ఆవశ్యకత వివరించిన విపక్ష నేత


మా తరఫున మీరు ప్రశ్నించండి...
రాజేష్: వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా నేను డిప్లొమా ఇన్ మెకానికల్ పూర్తి చేసి మూడు సంవత్సరాలవుతోంది.టెన్త్‌లో 92 శాతం, డిప్లొ మాలో  86 శాతం మార్కులొచ్చాయి. ఇప్పటి వరకూ జాబ్ లేదు సార్. రెండు వేల రూపాయల నిరుద్యోగ భృతి అని చెబితే గుడ్డిగా నమ్మి తెలుగుదేశానికి ఓటేశాను. ఈ రోజుకూ రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మా నాన్న  చనిపోయారు. మా అమ్మ ఇంట్లో టిఫిన్ బడ్డీ నడిపిస్తున్నారు. నా సోదరుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తన చదువుకూ చేస్తున్న పనికీ సంబంధం లేదు.
 
వైఎస్ జగన్: ఎన్నికల సమయంలో ‘జాబు రావాలంటే బాబు రావాలి’ అంటూ తెలుగుదేశం వారు టీవీల్లో పదేపదే చెప్పించారు. ఆ మోసపూరిత మాటలతో ఓట్లేయించుకుని ఉద్యోగాలపై ఆశలను పెట్టుకున్నవారిని బాబు గాలికి వదిలేశాడు. రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తాననే  హామీ కూడా ఇచ్చాడు. ఉద్యోగమూ ఇవ్వడు, భృతి కూడా ఇవ్వడు.
 
రాజేష్:  రూ.రెండు వేలు అక్కర్లేదు. నెలకు రెండొందలు ఇచ్చినా మాకు ఆనందమే. మా తరఫున ప్రశ్నించండి సార్...
 
జగన్: ప్రత్యేక హోదా నిజంగానే సంజీవని రాజేష్. ప్రత్యేక హోదా వస్తే నో వేకెన్సీ బోర్డు మనకు కన్పించదు. లెక్కలేనన్ని అవకాశాలు మన ముంగిట ఉంటాయి. కాబట్టీ ప్రత్యేక హోదా కోసం అందరం పోరాడదాం.
 
మేం రాజకీయాల్లోకి రావొచ్చంటారా?
ప్రశాంత్: నేను ఆంధ్రా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది. అయితే అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా వంటివారి మాటలు వింటుంటే...కౌరవసభే గుర్తొస్తోంది సార్. ఇలాంటప్పుడు రాజకీయాల్లోకి రావొచ్చంటారా?
 
జగన్: మనం ఈ తరం వాళ్లం. రాజకీయాల్లోని కుళ్లూకుతంత్రాలను పూర్తిగా కడిగేసే శక్తి ఉన్నవాళ్లం. రాజకీయాల్లోకి మంచివాళ్లు రావాలి. నీలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది. సిగ్గుమాలిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
 
సామిరెడ్డి లక్ష్మణనాయుడు: వైన్‌షాపులో గుమాస్తాగా పనిచేస్తూ డిగ్రీ చదువుతున్నా. ఆ పని కూడా లేకుండా చేశారు. వైన్‌షాపులు కూడా మేమే నడుపుతాం, రోడ్డు మీద చెత్త కూడా మా ఎమ్మెల్యేలు, ఎంపీలే ఊడ్చేసుకొంటారన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. హోదా కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు మా ముందు ఉండి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. కేంద్రంలో కొనసాగుతున్న సిగ్గుమాలిన మంత్రులు రాజీనామా చేయాలి.
 
జగన్: మనం ఒత్తిడి తీసుకొస్తే కచ్చితంగా బాబు దిగిరాక తప్పదు. తన కేంద్రమంత్రులను ఉపసంహరించక తప్పదు. అదే జరిగితే బీజేపీ కూడా దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుంది.
 
మీరు సీఎం అయ్యి మరింత మంచి చేయాలి...
అమ్నాఖాన్, ఏక్యూజే కాలేజ్ విద్యార్థిని: ప్రత్యేక హోదా వల్ల మహిళా సాధికారతకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ వైఎస్సార్ వల్ల వచ్చింది. దాని వల్ల వారి జీవనగతులు మారాయి. భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అయ్యి పేద, వెనుకబడిన వారికి మంచి కార్యక్రమాలను చేపడతారని ఆశిస్తున్నాం.
 
జగన్: ఒక వర్గం అని కాదు... ప్రత్యేక హోదా వస్తే రాష్ర్టమంతా బాగుపడుతుంది.
 
ఓసీలకు లబ్ధి చేకూరుస్తుందా?
వరలక్ష్మి: ఓసీల్లో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు. ప్రత్యేకహోదా వల్ల వారికి ఏమైనా లబ్ధికలుగుతుందా?
 
జగన్: ప్రత్యేక హోదాతో రాష్ట్రంలో అందరికీ మేలు జరుగుతుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.   
 
పోరాటానికి సిద్ధం
కరుణాంజలి: ఇంతగా పోరాడుతున్నా హోదా వస్తుందంటారా? హోదా కోసం మమ్మల్ని ఏం చేయమంటారు?
జగన్: చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.. దేశంలోని అధికార, ప్రతిపక్షాలు ఒక్కటై రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజనతో మనకు అన్యాయం చేస్తున్నామని తెలిసి ప్రత్యేక హోదా ఇస్తామని మాట చెప్పిన తర్వాత రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇప్పుడు ఆ విషయంలో మోసం చేస్తున్నారు. దీనిపై కేంద్రాన్ని అడగాల్సిన మన ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకురావడం లేదు. మనమంతా ఆయనపై ఒత్తిడి పెంచాలి.. అప్పుడు ఆయన కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటే బీజేపీపై కూడా ఒత్తిడి పెరిగి ప్రత్యేక హోదా వస్తుంది. అందుకోసం పోరాడదాం.
 
ఇక్కడి సివిల్ ఇంజనీర్లపై బాబుకు చిన్నచూపు ఎందుకు?
సుబ్బారెడ్డి: నేను సివిల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. రాజధాని అమరావతి నిర్మాణంలో మన స్టేట్ సివిల్ ఇంజనీర్లను కాదని.. జపాన్, సింగపూర్, మలేిసియా సివిల్ ఇంజనీర్ల వెంటపడుతున్నారు. అంటే స్టేట్ సివిల్ ఇంజనీర్లు ఎందుకూ పనికిరారా? ఇక్కడ చదవద్దని చెబుతున్నారా?

జగన్: చంద్రబాబు ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తే గట్టిగా అడగండి. అదే మాట గట్టిగా నిలదీయండి.
 
బాబుకు మా మేలు పట్టదా?
తేజ: హుద్‌హుద్ తుపాన్ బాధితులకు అన్నీ చేశారని బాబు చెబుతున్నాడు.. ఏం చేశాడో మాకు తెలియదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి దయ వల్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో మా తమ్ముడు కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఈ రోజు విప్రోలో పనిచేస్తున్నాడు. మా అమ్మకు రెండుసార్లు ఒక్క రూపాయి కూడా లేకుండా కిడ్నీ ఆపరేషన్ జరిగింది. ఇలా ప్రతీ ఒక్క కుటుంబానికి మేలు జరగాలంటే నువ్వు సీఎం కావాలన్నా.
 
జగన్: మోసపూరిత మాటలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరి. సాఫ్ట్‌వేర్ నేనే తీసుకొచ్చా. సెల్‌ఫోన్‌లు నేనే తీసుకొచ్చా.. హైదరాబాద్ నేనే కట్టా... అంటూ చెబుతుంటాడు. అసెంబ్లీలో కూర్చోబెట్టి మరీ ఈ సోదేస్తాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు సాఫ్ట్‌వేర్ రంగంలో మన రాష్ర్టం ఐదో స్థానంలో ఉండేది. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన 2003-04 నాటికి ఆ స్థానం మెరుగయ్యింది లేదు.. అదే స్థానంలో ఉంది. సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం... రాజశేఖర రెడ్డి గారు మరణించిన 2009-10 సంవత్సరానికి ఐటీలో మూడో స్థానానికి ఎగబాకాం.

చంద్రబాబు హయాంలో భారతదేశ సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో ఏపీ వాటా 8.66 శాతం ఉంటే, రాజశేఖరరెడ్డి హయాంలో అది 14.93 శాతానికి ఎగబాకింది. చంద్రబాబు దిగే నాటికి 909 కంపెనీలుంటే.. రాజశేఖరరెడ్డి చనిపోయే ముందు 1,584 కంపెనీలున్నాయి. ఐటీ ఉద్యోగుల విషయానికి వస్తే చంద్రబాబు దిగే నాటికి 85,945 మంది, రాజశేఖరరెడ్డి హయాంలో 2,64,375 మంది ఏపీ యువతీయువకులకు ఉద్యోగాలొచ్చినట్టుగా సర్వే చెబుతోంది. ఈ వాస్తవాలను పక్కనపెట్టి, చంద్రబాబు మాత్రం ప్రజల జ్ఞాపకశక్తి తక్కువ అనే భ్రమలో గోబెల్స్ ప్రచారం చేస్తాడు.

మరిన్ని వార్తలు