రేపు పాట్నా వెళ్లనున్న వైఎస్ జగన్

12 Dec, 2013 20:02 IST|Sakshi
రేపు పాట్నా వెళ్లనున్న వైఎస్ జగన్

న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రేపు పాట్నా వెళ్లనున్నారు. ఆయనను బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ప్రభుత్వ అతిథిగా ఆహ్వానించారు. నితీష్‌కుమార్‌తో జగన్ భేటీ కానున్నారు. సమైక్యాంధ్ర కోసం నితీష్‌ సహకారాన్ని ఆయన కోరనున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా విభజించాలన్న కాంగ్రెస్ నిర్ణయం.. ఆర్టికల్-3 దుర్వినియోగమవుతున్న తీరును.. ఆ అధికరణను సవరించాల్సిన ఆవశ్యకతను.. జగన్ గత కొద్ది రోజులుగా ఆయా పార్టీలను కలసి వివరించి ఈ విషయంలో కీలక విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చిన విషయం తెలిసిందే.

నవంబర్ 16న ఢిల్లీలో సీపీఎం, సీపీఐ ముఖ్యనేతలను జగన్ కలిశారు. నవంబర్ 17న బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అదే నెల 20న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమయ్యారు. నవంబర్ 23న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన ఆవశ్యకతను జగన్ వివరించారు. అలాగే నవంబర్ 23 సాయంత్రం జేడీయూ అధినేత శరద్‌యాదవ్‌ను కలిసి మద్దతు కోరారు. 24న భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ను కలుసుకొని సమస్యను వివరించారు. మరుసటి రోజు 25న ముంబై వెళ్లి ఎన్‌సీపీ అధినేత, కేంద్రమంత్రి శరద్‌పవార్, శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రేలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.

మళ్లీ డిసెంబర్ 4న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి, ఆయన తనయుడు స్టాలిన్, కరుణానిధి కుమార్తె కనిమొళిలను కలిసి ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయాన్ని వివరించారు. 6వ తేదీన లక్నో వెళ్లి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌తో సమావేశమై విభజనను అడ్డుకోవాల్సిందిగా మద్దతుకోరారు. తర్వాత ఢిల్లీలో ఎస్‌పీ అధినేత ములాయంసింగ్‌యాదవ్, జేడీఎస్ అధినేత దేవేగౌడలను కలిసి మద్దతు కోరారు.
 
 

మరిన్ని వార్తలు