'స్పందించేది జగన్ ఒక్కడేనని తెలుసు'

25 Jul, 2015 12:51 IST|Sakshi
'స్పందించేది జగన్ ఒక్కడేనని తెలుసు'

అనంతపురం : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా స్పందించేది జగన్ ఒక్కడేనన్న విషయం ప్రజలందరికీ తెలుసునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసా యాత్ర ఐదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పి.కొత్తపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదని, సు:ఖశాంతులతో ఉన్నారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

'పి.కొత్తపల్లి గ్రామంలో రైతు లక్ష్మన్న మరణించి ఏడాది అవుతుంది. ఇప్పటివరకూ ఏ ఒక్కరూ పరామర్శించలేదు. ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. లక్ష్మన్నకు రూ.1.19 లక్షల అప్పుంది. రూ.19 వేలు మాఫీ అయింది. రూ.20 వేల వడ్డీ భారం పడింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సాయం లక్ష్మన్న కుటుంబానికి ఎందుకు ఇవ్వలేదు. వడ్డీకి సైతం సరిపోని విధంగా రుణమాఫీ అమలు చేస్తున్నారు. రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులపై 14 శాతం అపరాధ రుసుం పడుతోంది. రైతులు తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉంది.

ఇక హంద్రీ-నీవా ప్రాజెక్టులో చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 85 శాతం పనులు పూర్తయ్యాయి. హంద్రీ-నీవా ప్రాజెక్టు తానే పూర్తి చేశానంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను వంచించారు. ఒక్క కొత్త ఇళ్లు కట్టలేదు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదు. కరవు తట్టుకోలేక అనంత రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బెంగళూరుకు వలస వెళ్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ వచ్చినచోట మాత్రమే పరిహారం చెల్లిస్తారు. రాహుల్ గాంధీ ఎప్పుడు దేశంలో ఉంటారో...ఎప్పుడు విదేశాల్లో ఉంటారో తెలియదు' అని అన్నారు.
 

మరిన్ని వార్తలు