ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టు

8 Sep, 2016 02:47 IST|Sakshi
ప్రజా సమస్యలపై సభలో చర్చకు పట్టు

వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం నిర్ణయం
ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లు కేసు ప్రస్తావన
అసెంబ్లీని 15 రోజులపాటు నిర్వహించాలని విజ్ఞప్తి 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయిన ‘ఓటుకు కోట్లు’ కేసుతోపాటు పలు ప్రజా ప్రాధాన్యం గల సమస్యలపై శాసనసభలో చర్చకు పట్టు పట్టాలని వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం నిర్ణయించింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు రోజులే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండడంపై  ఈ భేటీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. కరువు, నిరుద్యోగం, సంక్షేమ పథకాలు కుంటుపడటం వంటి ఎన్నో కీలక అంశాలపై చర్చించాల్సి ఉండగా మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించడ ం ఎంతమాత్రం సరికాదని పార్టీ అభిప్రాయపడింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సవివరంగా చర్చించారు.

 36 అంశాలపై చర్చకు పట్టు: రఘుపతి
ప్రత్యేక హోదా, ఓటుకు కోట్లుతోపాటు 36 అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుపడతామని ఎమ్మెల్యే కోన రఘుపతి తెలిపారు. శాసనసభాపక్షం సమావేశం వివరాలను ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన వెల్లడించారు. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపైనా చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ కోరుకుంటోందన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు పేరు చార్జిషీట్‌లో 33 సార్లు ప్రస్తావనకు వచ్చినా విచారణ జరగకుండా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని విమర్శించారు. దీన్ని తాము సభలో గట్టిగా లేవనెత్తుతామన్నారు. పుష్కరాల్లో చోటుచేసుకున్న అవినీతి గురించి కూడా ప్రస్తావిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలను 15 రోజులపాటు నిర్వహించాలని కోరినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు.

 ఆ స్వరం తనది కాదని చంద్రబాబు చెప్పాలి: కోటంరెడ్డి
‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ..’ అనే స్వరం తనది కాదని చంద్రబాబు చెప్పాలని, దేశంలోని ఏ ఫోరెన్సిక్ ల్యాబ్‌లోనైనా ఆ గొంతు తనదేనని రుజువైతే రాజీనామా చేస్తానని స్పష్టం చేయాలని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నిజంగా తప్పు చేయక పోతే స్టే కోసం కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. దేనికైనా సై అంటూ చిన్న విషయాలకే సవాళ్లు విసిరే చంద్రబాబు ఓటుకు కోట్లు వ్యవహారంలో బయటపడిన ఆడియోలోని గొంతు తనది కాదని ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు విచారణకు సిద్ధపడటం లేదు? ప్రతి అంశంపైనా ట్వీట్లు చేసే నారా లోకేశ్ ఆ స్వరం తన తండ్రిది కాదని ఎందుకు ట్వీట్ చేయలేదు? అని శ్రీధర్‌రెడ్డి నిలదీశారు.

చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు, ఆయనను జైలుకు పంపి తీరుతామన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటుకు కోట్లు కేసులో ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారు? చంద్రబాబుతో కుదుర్చుకున్న ప్యాకేజీ ఏమిటి? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎంత, రాకుంటే ఎంత, తనకు మాత్రం ముఖ్యమంత్రి పదవి వచ్చింది చాలనుకుంటున్న చంద్రబాబు వైఖరిని అసెంబ్లీలో ఎండగడతామన్నారు.

పాదయాత్రగా అసెంబ్లీకి
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజున వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఉదయం 8.15 గంటలకు ప్రకాశం పంతులు విగ్రహం వద్ద కలుసుకొని, అక్కడి నుంచి వైఎస్ జగన్ నేతృత్వంలో కాలినడకన అసెంబ్లీకి బయల్దేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు