అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ చిత్రపటం తొలగింపు

28 Jul, 2015 04:00 IST|Sakshi
అసెంబ్లీ లాంజ్‌లో వైఎస్ చిత్రపటం తొలగింపు

సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే..
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాంజ్‌లో.. కొన్ని సంవత్సరాలుగా చిరునవ్వు చిందిస్తూ అక్కడికి వచ్చిన వారిని పలకరిస్తున్నట్లుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిలువెత్తు ఫొటోను తొలగించారు. ఇటీవల శాసనసభ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ దగ్గరుండి మరీ సిబ్బందితో అక్కడి నుంచి ఆ చిత్రపటాన్ని  తీయించి వేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆదేశాల మేరకు వైఎస్ ఫొటోను తొలగిస్తున్నామని ఈ సందర్భంగా సిబ్బందికి సత్యనారాయణ చెప్పినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వైఎస్ నిలువెత్తు ఫొటో ఉన్న లాంజ్ ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ పలుమార్లు తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ సమావే శాలు జరిగే సమయంలో హాజరైన ఎమ్మెల్యేలకు వైఎస్ చిత్రపటం కనిపించకుండా ముసుగు వేసేవారు. ఇప్పుడు ఏకంగా అక్కడి నుంచి చిత్రపటాన్ని తొలగించారు.

వైఎస్ చిత్రపటాన్ని అక్కడి నుంచి తొలగించాలని, లేదంటే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చిత్రపటాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు శాసనసభ జరిగే సమయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ చెప్పారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని లాంజ్‌లో ఏర్పాటు చేయటం ఇష్టం లేని చంద్రబాబు ఆదేశాలతోనే వైఎస్ చిత్రపటాన్ని అక్కడి నుంచి తొలగించినట్లు సమాచారం.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు ని ర్వర్తిస్తూ మరణించిన తొలి నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. దీంతో అప్పటి స్పీకర్‌తోపాటు ప్రభుత్వ నిర్ణయం మేరకు శాసనసభ ఆవరణలో వైఎస్ నిలువెత్తు చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ వర్ధంతి, జయంతి సమయంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు లాంజ్‌లోని ఆ చిత్రపటం వద్దే నివాళులు అర్పించేవారు.

మరిన్ని వార్తలు