జలయజ్ఞానికి గండి కొట్టారు : వై.ఎస్.విజయమ్మ

22 Aug, 2013 02:34 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరందించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేసి రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరియాలని పరితపించిన వైఎస్సార్ ఆలోచనలకు కాంగ్రెస్ గండి కొట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు విభజన నిర్ణయంతో సాగునీటి ప్రాజెక్టులను వివాదాల్లోకి లాగి నిర్లక్ష్యం ముంపులోకి నెట్టి రైతులపై కక్ష సాధిస్తోందని ఆమె ధ్వజమెత్తారు. కోస్తా ప్రాంతంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా, ఫ్లోరైడ్ పీడిత, కరువుతాడిత జిల్లాగా పేరొందిన ప్రకాశం జిల్లాను కాంగ్రెస్ నిలువునా ముంచుతోందని మండిపడ్డారు. 2004లో అధికారంలోకి రాగానే వై.ఎస్.రాజశేఖరరెడ్డి గుండ్లకమ్మ పనుల్ని వేగవంతం చేసి పూల సుబ్బయ్య వెలిగొండ భారీ సాగునీటి పథకంతో పాటు పాలేరు ప్రాజెక్టు, కొరిసిపాడు ఎత్తిపోతల పథకం, శ్రీరామతీర్థం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయాన్ని విజయమ్మ గుర్తుచేశారు.
 
 ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 14.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. కానీ.. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేసి రైతుల్ని ఏటా నిండా ముంచుతోందని ఆమె మండిపడ్డారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఈ పాటికి పూర్తయి ఉంటే అత్యధిక గ్రామాల ప్రజలు కరువు, ఫ్లోరైడ్ బారి నుంచి బయటపడేవారని విజయమ్మ పేర్కొన్నారు. కృష్ణానదిలో మిగులు, వరద నీటిని మళ్ళించే విధంగా వెలిగొండ ప్రాజెక్టు చేపట్టాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైఎస్ అధికారం చేపట్టగానే 14 టీఎంసీల నీటిని మొదటి దశలో వినియోగించుకునేలా పనులు చేపట్టారని.. రూ. 4,785 కోట్ల పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసి ఏడు ప్యాకేజీల కింద పనులు చేపట్టారని గుర్తుచేశారు. మొత్తం 44 టీఎంసీల కృష్ణా వరద నీటిని వాడుకోవటం ద్వారా ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకురావాలని వైఎస్ భావించారని, కానీ ప్రకాశం జిల్లాకు జీవనాధారమైన వెలిగొండ ప్రాజెక్టు నిర్లక్ష్యం ముంపులో మునిగిపోయిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
 
 నీరు వృథాగా పోతోంది.. ఆయకట్టు ఎండుతోంది
 వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఎదురవుతున్న అవాంతరాల్ని అధిగమించటానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపటం లేదని విజయమ్మ తప్పుపట్టారు. టన్నెల్ నుంచి నీరు ఫీడర్ చానల్‌లోకి వస్తుండటంతో చానళ్ల నిర్మాణం సాగటం లేదని, ఫీడర్ చానెల్ నిర్మాణానికి మట్టి లభించకపోవటంతో స్ట్రక్చర్ల నిర్మాణం నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రతి ఏటా కృష్ణానదిలో శ్రీశైలం నుంచి వరద నీరు వృథాగా కిందకు ప్రవహిస్తున్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరందించలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 కొరిసిపాడు ఎత్తిపోతల పథకానికి గ్రహణం
 ఎర్రం చినపోలిరెడ్డి కొరిసిపాడు ఎత్తిపోతల పథకాన్ని రూ. 177 కోట్లతో వైఎస్ మంజూరు చేసినా ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించటానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం శ్రద్ధ చూపటం లేదని విజయమ్మ ఎండగట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1.33 టీఎంసీల నీటిని వినియోగించుకోవటం ద్వారా 20 వేల ఎకరాల ఆయకట్టు అభివృద్ధిలోకి వస్తుందని చెప్పారు. ఈ పథకానికి భూ సేకరణ ప్రధాన అవరోధంగా పరిణమించిందని.. తూర్పుపాలెం గ్రామం లో ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాన్ని అమలు చేయాలని అక్కడి గ్రామస్తులు కోరుతున్నా పట్టించుకోవటం లేదని.. దీంతో కొరిసిపాడు జలాశయంలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు.
 
 ప్రస్తుత రాష్ట్ర పరిస్థితికిఆ రెండు పార్టీలే కారణం : కొడాలి నాని ధ్వజం
 గుంటూరు, న్యూస్‌లైన్: రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం కాంగ్రెస్, దాని తోక పార్టీ టీడీపీలేనని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. జననేత జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చేయటానికి  రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయని ధ్వజమెత్తారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో చంద్రబాబునాయుడు ప్రజల ముందుకు వస్తే అంతిమయాత్ర చేసి హైదరాబాదు పంపాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర టీడీపీ నాయకులకు సిగ్గు ఎగ్గు ఉంటే 2008లో టీడీపీ ప్రణబ్‌ముఖర్జీకి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకునే వరకు చంద్రబాబు ఇంటి వద్ద ధర్నా చేయాలని డిమాండ్ చేశారు.
 
 ఆ ఇద్దరినీ ప్రజలు క్షమించరు: వంగవీటి రాధా
 టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలను ప్రజలు క్షమించరని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు. చంద్రబాబుకు దమ్ము, దైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ వెనకాల తిరగటం మానాలని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో లేఖ ఇచ్చి నేడు సీమాంధ్రకు ఐదు లక్షల ప్యాకేజీ ఇవ్వాలని కోరటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలో చరిత్ర హీనుడిగా మిగులుతారన్నారు.

మరిన్ని వార్తలు