రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ?: విజయమ్మ

30 Oct, 2013 01:08 IST|Sakshi
రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ?: విజయమ్మ

* భారీ వర్షాలు, వరదలతో రైతులు అల్లాడుతున్నా పట్టించుకోరా?: విజయమ్మ
* వరుస విపత్తులతో అన్ని వర్గాల ప్రజలూ నష్టపోయారు
ప్రభుత్వం వారిని ఏనాడూ పట్టించుకోలేదు
* రైతులను ఆదుకోవాలంటూ ప్రధానిని, కేంద్ర వ్యవ సాయశాఖ మంత్రిని కలుస్తాం
* జగన్ అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటాడని భరోసా
 
 సాక్షి, కాకినాడ/విశాఖపట్నం: ‘‘గత నాలుగేళ్లుగా వరుస తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలూ చితికిపోయారు. ప్రభుత్వం ఏనాడూ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రాష్ర్టంలో అసలు ప్రభుత్వం ఉందో.. లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాల వల్ల సంభవించిన నష్టంపై ప్రధాన మంత్రికి, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌కు నివేదికలు అందజేస్తామని, రైతుల రుణమాఫీ కోసం ఒత్తిడి తెస్తామని చెప్పారు. రైతులను ఆదుకునేంతవరకూ వారి తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని భరోసానిచ్చారు. జగన్ అధికారంలోకి వస్తే పోలవరంతో పాటు డెల్టా ఆధునికీకరణ పనులూ పూర్తి చేస్తారని, రైతులను అన్నివిధాలా ఆదుకుంటారని చెప్పారు. ఇటీవల భారీ వర్షాలతో నష్టపోయిన తూర్పుగోదావరి, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల్లో విజయమ్మ మంగళవారం పర్యటించారు. రైతులు, బాధితులను పరామర్శించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
 
  మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే.. రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. తూర్పుగోదావరిలో పర్యటన అనంతరం కాకినాడలో తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘మూడు రోజులుగా వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాను. రాష్ర్టంలో 42 మంది చనిపోయారు. పై-లీన్ తుపాను సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంవల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భారీ వర్షాల విషయంలో కూడా ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఇళ్లు కూలిపోయినవారికి ఇప్పటివరకూ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని చెప్పడం కానీ, తక్షణ సాయం అందించడం కానీ చేయలేదు’’ అని అన్నారు. ఏడు రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నా ఒక్క అధికారి కూడా బాధితుల వద్దకు వెళ్లలేదని, ముఖ్యమంత్రి రావడానికే ఏడు రోజులు పట్టిందని దుయ్యబట్టారు.
 
 చేనేత మగ్గాల్లోకి నీళ్లు చేరి నేత కార్మికులు, వలలు, బోట్లు కొట్టుకుపోయి మత్స్యకార్మికులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘రైతులను పరామర్శించినప్పుడు ఎకరాకు రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖర్చు పెట్టామని చెప్పారు. వీరంతా కౌలు రైతులు. పూర్తిగా నష్టపోయిన వీరిని తక్షణమే ఆదుకోవాలి. కానీ అలా జరగడం లేదు. నీలం తుపాను పరిహారం కూడా రైతులకు అందలేదు. ఏ తుపాను వచ్చినా, కరువు వచ్చినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. డెల్టా ఆధునీకరణకు రాజశేఖరరెడ్డి వందల కోట్లు కేటాయించారు. డెల్టా, డ్రెయిన్ల ఆధునీకరణ పూర్తయి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఎకరాకు రూ.10 వేల వ రకు నష్టపరిహారం ఇవ్వాలి. దీనితోపాటు పెట్టుబడికి తగ్గట్టుగా వారికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ, విత్తనాలు ఇవ్వాలి. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరి తాము కబుర్లు చెప్పబోమని, ప్రధానిని, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసి రైతులను ఆదుకోవాలని కోరతామని చెప్పారు.

మరిన్ని వార్తలు