సమైక్యాంధ్ర కోసం సడలని

18 Oct, 2013 04:30 IST|Sakshi
సమైక్యాంధ్ర కోసం సడలని వైఎస్సార్ సీపీ ఉద్యమం

సాక్షి నెట్‌వర్క్: సమైక్యరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర జిల్లాల్లో గురువారం ఆటోలతో భారీ ర్యాలీలు నిర్వహించింది. కడపలో వైఎస్సార్ టీయూసీ ఆధ్వర్యంలో ఆటోలు, ట్రాలీలు, అంబులెన్స్‌లతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేశ్‌బాబు, పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు శెట్టిపల్లిరఘురామిరెడ్డి పాల్గొన్నారు. జమ్మలమడుగులో చేపట్టిన ఆటోర్యాలీలో ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి పాల్గొన్నారు. పులివెందులలో పార్టీ యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి జెండాఊపి ర్యాలీ ప్రారంభించారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ప్రొద్దుటూరులో సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఆటో ర్యాలీలు నిర్వహించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆపి రాష్ట్ర విభజనను చిత్తశుద్ధితో అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా తుంగభద్ర బ్రిడ్జి వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
 
 పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో నంద్యాలలో భారీ ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో పార్టీ నేతలు జలీల్‌ఖాన్, గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలలో భారీ ఆటోర్యాలీలు జరిగాయి.  శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన ఆటో ర్యాలీలో పార్టీ నేత తమ్మినేని సీతారాం తదితరులు పాల్గొన్నారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో ఆటోల ర్యాలీలో పాల్గొన్నారు. ఏలూరులో తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆధ్వర్యంలో నగరంలో భారీ ఆటో, మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి గండేపల్లి వరకు వందలాది ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. జడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆధ్వర్యంలో కాకినాడలో ఆటోలహారం ఏర్పాటు చేశారు. విశాఖ నగర కన్వీనర్ వంశీకృష్ణ వందలాది ఆటోలతో ర్యాలీ నిర్వహించారు.  

కేంద్ర కార్యాలయాల ముట్టడి
 పురందేశ్వరి దౌత్యంపై ఆగ్రహం
 సాక్షి నెట్‌వర్క్: సీమాంధ్రలో గురువారం ఏపీఎన్జీవోలు కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. బ్యాంకులు, బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా, ఎల్‌ఐసీ తదితర కార్యాలయాల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఏటీఎంలూ పనిచేయలేదు. విశాఖలోని జగదాంబసెంటర్‌లో న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించిన రైతులు అనంతరం రైతుగర్జన సభ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోటలో రైతు గర్జన నిర్వహించగా, తణుకులో ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీ మానవహారం చేపట్టారు. విజయనగరం జిల్లా బెలగాంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించారు.
 
చీపురుపల్లి నుంచి విజయనగరం వరకు దాదాపు మూడు వందల మంది మహిళలు చీపుర్లతో నిర్వహించిన ర్యాలీని గుర్లలో పోలీసులు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో విద్యార్థులు మోటార్ బైక్ ర్యాలీ తీశారు. కర్నూలులో జడ్పీ కార్యాలయం ఎదుట ఉద్యోగులు మానవహారం ఏర్పాటుచేశారు. అనంతపురంలో జేఎన్టీయూ ఉద్యోగులు కుర్చీలను తలపై పెట్టుకుని నిరసన ర్యాలీ తీశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో జేఏసీ నేతలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీతో కలిసి ధర్నా నిర్వహించారు. మైదుకూరులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం చేపట్టారు. విభజన తర్వాత సీమాంధ్ర అభివృద్ధికి రూట్‌మ్యాప్ అంటూ కేంద్రమంత్రి పురందేశ్వరి విజయవాడలో జరిపిన దౌత్యం సమైక్యవాదుల్లో ఆగ్రహాన్ని పెంచింది. కలిదిండిలో డ్వాక్రా మహిళలు ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో వైద్యులు అపరిచితుడు అనే లఘునాటికను ప్రదర్శించారు. వెంకటగిరి పట్టణంలోని జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం బ్యాంకులను మూయించారు.
 
సమ్మె కొనసాగింపునకే మెడికల్ జేఏసీ మొగ్గు
విశాఖపట్నం : సీమాంధ్ర మెడికల్ జేఏసీ సమ్మె కొనసాగింపునకే మొగ్గు చూపింది. 13 జిల్లాల్లో శుక్రవారం నుంచి కేవలం అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరుకానున్నట్టు జేఏసీ నాయకులు, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి. రామ్మోహన్, పి. శ్యాంసుందర్ గురువారం రాత్రి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రాష్ట్ర విభజన విరమణపై సానుకూల నిర్ణయం వచ్చేవరకూ సీమాంధ్ర జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ వైద్య సేవలతో పాటు ఆపరేషన్లను బహిష్కరిస్తామని వారు చెప్పారు. సీఎం హామీని తాము నమ్మలేమని తెలిపారు.
 
విభజన భయంతో ముగ్గురు మృతి
సాక్షి నెట్‌వర్క్: సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ముగ్గురు విభజన భయంతో గుండెపోటు వచ్చి మృతిచెందారు. వైఎస్సార్ జిల్లా కడప శంకరాపురానికి చెందిన ఉపాధ్యాయురాలు డి.శివమాధవి(44) రిలే దీక్షలో రెండ్రోజులుగా పాల్గొన్నారు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతూ, రాష్ట్ర విభజనపై ఇరుగుపొగువారితో ఆవేశంగా చర్చిస్తుండగానే గుండెపోటువచ్చి  తుదిశ్వాస విడిచారు.  చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నెన్నూరుకు చెందిన కాంట్రాక్టర్ రోశిరెడ్డి(55), కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన దస్తగిరి (60) ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవారు. బుధవారం రాత్రి టీవీలో విభజన వార్తలు చూస్తూ గుండెపోటు వచ్చి మృతిచెందారు.

 

మరిన్ని వార్తలు