బాబు ముఖం చాటేస్తున్నారెందుకు?

1 Aug, 2015 03:40 IST|Sakshi
బాబు ముఖం చాటేస్తున్నారెందుకు?

రిషితేశ్వరి మరణంపై రోజా ప్రశ్న
మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో ఆదుకుంటామన్నారుగా..
ఇపుడు నోరెందుకు మెదపలేదు?

 
హైదరాబాద్: ప్రతిదానికీ మీడియా ముందుకొచ్చి ప్రచారంకోసం తాపత్రయపడే ఏపీ సీఎం చంద్రబాబు నాగార్జున వర్సిటీలో ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి విషయంలో ఎందుకు ముఖం చాటేస్తున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా నిలదీ శారు. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థిని ఆత్మహత్య కేసును నీరుగార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడాల్సిందిపోయి నిందితులైన విద్యార్థులకు అధికారపక్షం అండగా ఉందన్నారు. మహిళలను వేధిస్తే 3 నిమిషాల్లో వచ్చి ఆదుకుంటామని ఎన్నికల ముందు బాబు విపరీతంగా ప్రచారం చేసుకున్నారని, అలాంటిదిపుడు నోరెందుకు మెదపలేదని ప్రశ్నిం చారు. రిషితేశ్వరి కేసులో నిందితుల్ని శిక్షించేలా చర్యలు తీసుకునేలా కోరడానికి ఆమె తల్లిదండ్రులు ఏపీ సీఎం వద్దకు వెళితే ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. న్యాయం చేయాలని కోరుతూ క్యాంపు కార్యాలయంలో సీఎంను కలవడానికి వెళ్లిన విద్యార్థులపై లాఠీచార్జి చేయించడం దారుణమన్నారు.

అసలిలాంటి విద్యా మంత్రి, సీఎం రాష్ట్రంలో ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వర్సిటీకి వెళ్లిన విచారణ కమిటీ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడిస్తున్నారని ఆమె తప్పుపట్టారు. అక్కడ వ్యవహారమంతా కులాల కుంపటిగా చేశారని దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయిని నిందితులుగా చేశారని, వాస్తవానికి వర్సిటీ వైస్‌చాన్సలర్‌ను తొలి ముద్దాయిగా, ప్రిన్సిపల్‌ను రెండో ముద్దాయిగా చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోరాడుతున్న మహిళాసంఘాలు, విద్యార్థులపై టీడీపీ మద్దతుదారులు దాడులు చేసి ఉద్రిక్తతలకు కారణమైనందునే ఆ పార్టీ ప్రమేయముందని తాము చెబుతున్నామన్నారు. ర్యాగింగ్‌ను నివారించడానికి 2009, మే 8న సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసిందని, వాటిని వర్సిటీ అధికారులు పాటించలేదన్నారు. నిజనిర్ధారణ చేసి రిషితేశ్వరి కుటుంబం తరఫున పోరాడేందుకు వైఎస్సార్‌సీపీ మహిళా, విద్యార్థి విభాగం, ఎమ్మెల్యేలు ఆగస్టు 6న నాగార్జున వర్సిటీకి వెళుతున్నామని వెల్లడించారు.

జర్నలిజానికే మచ్చ..: పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన అనని మాటల్ని అన్నట్లుగా ఓ పత్రిక రాయడం జర్నలిజానికే మచ్చని రోజా దుయ్యబట్టారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ఏపీకి ప్రత్యేక హోదాపై కార్యాచరణ వంటి అంశాల్ని చర్చించాంగానీ ఆ పత్రికలో రాసినట్లుగా మరే చర్చా జరగలేదన్నారు.

 రిషితేశ్వరి ఆత్మహత్యపై వైఎస్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ
 హైదరాబాద్: నాగార్జున వర్సిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై నిగ్గు తేల్చడానికి వైఎస్సార్‌సీపీ ఆరుగురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కె.పార్థసారథి, లేళ్ల అప్పిరెడ్డి, ఆర్.కె.రోజా, మేరుగు నాగార్జున, వంగవీటి రాధాకృష్ణ, గొట్టిపాటి రవికుమార్ ఇందులో ఉన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య, ప్రిన్సిపల్, ఇతర నిందితుల ప్రమేయం, కులవివక్ష, దర్యాప్తులో ప్రభుత్వ వైఫల్యం, వర్సిటీలో బోధన సిబ్బంది కొరత తదితర అంశాలపై ఈ కమిటీ పరిశీలన జరిపి పార్టీ అధ్యక్షునికి నివేదిక సమర్పిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
 
 

మరిన్ని వార్తలు