విజయమ్మ సమర దీక్షకు సంఘీభావం

22 Aug, 2013 01:13 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్: అడ్డగోలు విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో చేపట్టిన ఆమరణదీక్షకు సీమాంధ్ర జిల్లాల్లో సంఘీభావం వెల్లువెత్తుతోంది. సమరదీక్షకు మద్దతుగా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో  నిరవధిక నిరాహార దీక్షలతో పాటు రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు పోటెత్తుతున్నాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, కర్నూలులో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌వీ మోహన్‌రెడ్డి, వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, అంజాద్‌బాష, నాగిరెడ్డి, అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, పుట్టపర్తిలో పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణలు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు బుధవారంతో మూడురోజులు పూర్తి చేసుకుని గురువారంతో నాలుగోరోజుకు చేరాయి.
 
 అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో వైఎస్సార్ సీపీ నేతలు పెయ్యల చిట్టిబాబు, మిండి గోవిందరావు, పోలిశేట్టి నాగేశ్వరరావు, కాట్రు అప్పారావు, కోరుకొండలో మాజీ ఎంపీటీసీ జ్యోతుల లక్ష్మీ నారాయణ, యువజన విభాగం కన్వీనర్ గంగాధర్, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీనేతలు ఆదివిష్ణు,   చింతలపూడిలో కర్రా రాజారావులు చేపట్టిన దీక్షలు మూడురోజులుగా కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కంభం మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ సయ్యద్‌మాబు, సూరా పాండురంగారెడ్డిలు చేపట్టిన ఆమరణ దీక్ష రెండోరోజుకు చేరింది. శ్రీకాకుళంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, అనంతపురం జిల్లా కదిరిలో పార్టీ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్ బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.

మరిన్ని వార్తలు