ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు

9 Aug, 2015 02:16 IST|Sakshi
ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు

వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించాల్సిన తెలుగుదేశం పార్టీ రోజుకోతీరున మాట్లాడుతూ గందరగోళం సృష్టిస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. ఢిల్లీలో సోమవారం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి ప్రత్యేకహోదా డిమాండ్‌తో ధర్నా చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాస్థలిని పరిశీలించిన పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తీరును తప్పుపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో ఆనాటి ప్రధాని చేసిన వాగ్దానం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని మొదటి నుంచీ కోరుతున్నామన్నారు. దాదాపుగా 15 మాసాలుగా దీనిపై ఏమీ తేల్చకుండా ఉండడం వల్ల తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారని తెలిపారు.

పోరాటం చేసి సాధించుకుందాం: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
యువకుడి ఆత్మహత్యపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా మన హక్కన్నారు.   ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ఉందనీ ధైర్యం కోల్పోవద్దనీ, పోరాడి సాధించుకుందామని చెప్పారు.
 
సీతారాం ఏచూరితో వైఎస్సార్‌సీపీ ఎంపీల భేటీ: వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు శనివారం ఢిల్లీలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలో సోమవారం తమ పార్టీ అధినేత జగన్ నిర్వహించనున్న ధర్నాకు సంఘీభావం తెలపాల్సిందిగా వారు ఏచూరిని కోరారు. ఈ విషయమై ఏచూరి సానుకూలంగా స్పందించారని వైఎస్సార్‌సీపీ వర్గాలు వెల్లడించాయి.
 
 

మరిన్ని వార్తలు