వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన

19 Jul, 2016 21:51 IST|Sakshi
వైఎస్సార్సీపీ ఎంపీలకు వెంకయ్య అభ్యర్థన

న్యూఢిల్లీ: తాను ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న జీఎస్టీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం విపక్షాలతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం వైఎస్సార్ సీపీ ఎంపీలతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దీనికి వైఎస్సార్ సీపీ ఎంపీలు కూడా సానుకూలంగా స్పందించారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బరెడ్డిలు వెంకయ్యతో మాట్లాడిన విషయాన్ని మీడియాకు తెలిపారు. జీఎస్టీ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఎంపీలు 20న పార్లమెంట్ ముందుకు రానున్న ప్రైవేట్ బిల్లుకు కూడా బేషరతుగా మద్దతు పలకుతామన్నారు. తాము కూడా పలు మార్లు హోదా అంశాన్ని లేవనెత్తామని, 20న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇస్తామని, బిల్లు ఎవరు పెట్టారనేదానికంటే హోదా రావడమే తమకు ముఖ్యమని ఎంపీలు మేకపాటి, వైవీ సుబ్బారెడ్డిలు తెలిపారు.

మరిన్ని వార్తలు