చంద్రబాబు నిరంకుశ పాలనపై సమరశంఖం

6 Jul, 2017 11:43 IST|Sakshi

► 3వ జాతీయ ప్లీనరీ వేదికగా సమాయత్తమవుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
►  8, 9 తేదీల్లో నాగార్జున వర్సిటీ ఎదురుగా సమావేశాలు
► ముమ్మరంగా ఏర్పాట్లు.. నేటి సాయంత్రానికల్లా పూర్తి
► 300 మంది ప్రతినిధులు ఉండేందుకు వీలుగా ప్రధాన వేదిక
► ప్లీనరీకి ప్రత్యేక అలంకరణలు.. భారీ ఎల్‌ఈడీ తెర ఏర్పాటు
►మరోవైపు తీర్మానాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో కసరత్తు
► 8న అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ 




హైదరాబాద్‌/అమరావతి: జాతీయ ప్లీనరీ వేదికగా చంద్రబాబు మూడేళ్ల నిరంకుశ పాలనపై సమరశంఖం పూరించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనున్న పార్టీ 3వ జాతీయ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. గురువారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవనున్నాయి.

పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలనుంచి వేలాదిమంది ప్రతినిధులు హాజరవు తున్నారు. అందుకు తగినట్లుగా ప్లీనరీ ప్రాంగణాన్ని తీర్చిదిద్దు తున్నారు. అదే సమయంలో చంద్రబాబు దుష్టపాలనపై సమరశంఖం పూరించేందుకు అనుగుణంగా సమావేశాల్లో ప్రతి పాదించే తీర్మానాలు, కార్యక్రమాలపై హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చురుగ్గా కసరత్తు జరుగుతోంది.

విభజనకుగురై దారుణంగా నష్టపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి లభించిన హామీల్లో ఒక్కటీ నెరవేరకపోవడం, అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని నీరుగార్చడం వంటి అంశాలతోపాటుగా ఇప్పటివరకు చంద్రబాబు సాగించిన నిరంకుశ పాలనపై పలు తీర్మానాల్ని రూపొందిస్తున్నారు. ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముసాయిదా తీర్మానాలు సిద్ధమవుతున్నాయి.

పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి గత కొద్దిరోజుల్లో పార్టీ నేతలతోపాటు పలుమార్లు సంప్రదింపుల్లో పాల్గొని ముసాయిదా తీర్మానాల్ని నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయా రంగాలు, అంశాలపై రూపొందుతున్న తీర్మానాలపై జోక్యం చేసుకుని అదనంగా చేర్చాల్సిన అంశాల్ని వివరించారు. గురువారం ఉదయానికి ముసాయిదా తీర్మానాలన్నీ సిద్ధమవుతాయని పార్టీవర్గాలు తెలిపాయి. మిగిలిపోయిన అంశాలేవైనా ఉంటే వాటినీ ప్లీనరీ ప్రారంభమయ్యే చివరి నిమిషందాకా చేర్చే వీలుందని చెబుతున్నారు.

టీడీపీ పాలనలో అన్నీ వైఫల్యాలే...
2014లో చంద్రబాబు సీఎం పగ్గాలు చేపట్టినప్పటినుంచీ రాష్ట్రంలో అన్నీ వైఫల్యాలేనని వైఎస్సార్‌సీపీ విశ్వసిస్తోంది. ఇవే అంశాల్ని తీర్మానాల రూపంలో ప్లీనరీ వేదికగా పార్టీ శ్రేణులముందు పెట్టడంతోపాటుగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు ఇలా... ఏ వర్గంవారు చూసినా సంతోషంగా లేరు. చంద్రబాబు ఎన్నికలప్పుడు వీరందరికీ ఏదో ఒక హామీ ఇచ్చారు. రైతులు, మహిళలకు రుణమాఫీని షరతుల్లేకుండా చేస్తానన్నారు. ‘బాబొస్తే జాబొస్తుంది’ అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

ఉద్యోగమివ్వకపోతే ఇంటికి రూ.2,000 చొప్పున నిరుద్యోగభృతి ఇస్తామని నమ్మబలికారు. ఇవన్నీ ఎంతవరకు అమలయ్యాయో... కళ్లముందే సాక్షాత్కరిస్తోంది. మరోవైపు విభజన సందర్భంలో మనకు లభించిన ప్రత్యేకహోదా హామీకోసం రాష ్ట్రప్రభుత్వం పట్టుపట్టని పరిస్థితి. విశాఖపట్నంలో రైల్వేజోన్‌తోపాటు అనేక సంస్థల్ని నెలకొల్పుతామని ఇచ్చిన హామీలూ నీటిమూటలయ్యాయి. ఈ వైఫల్యాలన్నింటినీ 20 తీర్మానాల్లో పొందుపరుస్తున్నారు.



8న అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌
పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ను ప్లీనరీలో తొలిరోజైన 8న జారీ చేస్తారు. రెండోరోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. అధ్యక్ష ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారు. కాగా, ప్లీనరీ ప్రారంభానికి ముందుగా పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశంలో ముసాయిదా తీర్మానాలకు ఆమోదముద్ర వేస్తారు. తరువాత ప్లీనరీలో సాధారణ ప్రతినిధులసభ ప్రారంభమవుతుంది.

ప్లీనరీ ప్రారంభమవుతున్న 8వ తేదీ దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిరోజు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ 7న హైదరాబాద్‌ నుంచి ఇడుపులపాయకు బయల్దేరి వెళతారు. 8వ తేదీ ఉదయాన్నే వైఎస్‌ సమాధి వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులందరితో కలసి పాల్గొంటారు. ఆ తరువాత హెలికాప్టర్‌లో బయల్దేరి విజయవాడకు వచ్చి ప్లీనరీలో పాల్గొంటారు.

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ ఏర్పాట్లు ఇలా..
ప్లీనరీకి సంబంధించి బుధవారం వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. గురువారం సాయంత్రానికి అన్నిఏర్పాట్లు పూర్తవనున్నాయి. 300 మంది ప్రతినిధులు ఆశీనులయ్యేం దుకు వీలుగా ప్రధాన వేదిక రూపొందించారు. 80 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పు, ఆరడుగుల ఎత్తులో మూడు స్టెప్‌లుగా అతి పెద్ద వేదికను నిర్మించడం విశేషం. వేదిక ఎడమవైపున పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికోసం ప్రత్యేకంగా గదిని నిర్మించారు. వేదిక కుడివైపున 60 మంది పార్టీ ప్రతినిధులు సమావేశ మయ్యేందుకు వీలుగా ప్రత్యేకంగా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు.

ప్లీనరీకోసం వచ్చిన ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా 500 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పుతో ప్రాంగణ నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు భోజనం చేసేందుకు వీలుగా విడిగా డైనింగ్‌హాలు, వంటశాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్లీనరీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఫొటోగ్యాలరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదికపై 60 అడుగుల భారీ ఎల్‌ఈడీ తెరను సిద్ధం చేశారు.

600 అడుగుల దూరంలో కూర్చున్నవారు సైతం పార్టీ అధినేతతోపాటు కార్యక్రమాల్ని స్పష్టంగా వీక్షించేలా ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో మరో ఆరు పెద్ద ఎల్‌ఈడీలనూ ఏర్పాటు చేస్తున్నారు. అలంకరణ కమిటీ చైర్మన్‌ అయిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బుధవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. కోయంబత్తూరు నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణులు అలంకరణ పనుల్లో నిమగ్నమయ్యారు.