నూరు శాతం మాదే విజయం: శిల్పా మోహన్‌రెడ్డి

24 Aug, 2017 01:47 IST|Sakshi

- టీడీపీ కుట్రలకు ఓటుతో బదులిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు
- అన్ని వర్గాల ఓటర్లూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు
- ఓటమి ఫ్ట్రస్ట్రేషన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బరితెగించారు

 



నంద్యాల:
అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగిన తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, నూటికి నూరు శాతం గెలుపు వైఎస్సార్‌సీపీదేనని, భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బుధవారం ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘ముందుగా నంద్యాల ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా బెదిరిపోకుండా సామరస్యాన్ని ప్రదర్శించిన ఓటర్లకు ధన్యవాదాలు. రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున బారులుతీరి ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. ఎన్నికలు రద్దయ్యేలా పన్నాగాలు పన్నారు. కానీ, వాటిని వైఎస్సార్‌సీపీ సమర్థవంతంగా అడ్డుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, కార్యకర్తలు, మా కుటుంబసభ్యులు అందరం సహకరించాం. మా తమ్ముడు చక్రపాణిరెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేయడానికి పోలీసులు పలుమార్లు ప్రయత్నించారు. కానీ ఈసీ లెటర్‌ లేనిదే మేం లొంగిపోమని బదులిచ్చాం. చివరిదాకా వాళ్లు ఆ లేఖను తేలేకపోయారు’’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు.

ఆ ఘటనలు బాధించాయి: ‘‘భూమా మౌనిక రెడ్డి.. పోలింగ్‌ స్టేషన్‌లో మా పార్టీ ఏజెంట్‌ బాషాను బయటికి పంపేందుకు యత్నించడం, టీడీపీ నేతల జోలికి పోకుండా మమ్మల్ని మాత్రమే పోలీసులు పలు మార్లు అడ్డుకోవడం, పోలింగ్‌ ముగుస్తున్న సమయంలో మైనారిటీలపై టీడీపీవాళ్లు దాడులు చేయడం లాంటి ఘటనను నన్ను తీవ్రంగా బాధించాయి. నంద్యాలకు సంబంధంలేని టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, జనార్థన్‌రెడ్డి, అఖిలప్రియ, ఎంపీ టీజీ వెంకటేశ్‌ ఇంకా చాలా మంది ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించారు. గొడవలు సృష్టించి పోలింగ్‌ను నిలిపేసేలా కుట్రలు చేశారు. ఫరూఖ్‌ నగర్‌లో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్‌, ఇతర మైనారిటీ నేతలపై దాడిచేసి, చంపుతామని బెదిరించారు. ఓటమి ఖాయం కావడంతోనే టీడీపీ ఫ్ట్రస్ట్రేషన్‌కి లోనైంది’’ అని శిల్పా పేర్కొన్నారు.

ఇప్పటికైనా ఆ 20 మంది రాజీనామా చేయండి: ‘‘ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పదవిలో కొనసాగే వీలున్నా, పార్టీ మారినందుకుగానూ నైతిక విలువలకు కట్టుబడి కేవలం 91 రోజుల్లోనే నా తమ్ముడు శిల్పా చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేశారు. నంద్యాల ఉప ఎన్నికను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇప్పటికైనా టీడీపీలోకి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. ప్రజల మద్దతుతో మాత్రమే పదవుల్లో కొనసాగాలి. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నాతో కలిసి పనిచేసిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని శిల్పా మోహన్‌రెడ్డి ముగించారు.