వాపోయిన యువరాజ్‌ సింగ్‌!

3 May, 2017 15:40 IST|Sakshi
వాపోయిన యువరాజ్‌ సింగ్‌!
  • చెత్త బౌలింగ్‌, ఫీల్డింగ్‌ వల్లే ఓడామని నిర్వేదం!
  • పవర్‌ ప్లేలో చెత్త బౌలింగ్‌, నిర్లక్ష్యంతో కూడిన ఫీల్డింగ్‌ వల్ల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఓడిపోయిందని ఆ జట్టు ఆటగాడు యువరాజ్‌సింగ్‌ వాపోయాడు. మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు ఎట్టకేలకు అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువీ అద్భుతంగా రాణించి.. 41 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. దీంతో  మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 185 పరుగులు చేసింది. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మెన్‌ తమ వంతుగా రాణించడంతో భారీ లక్ష్యాన్ని అధిగమించగలిగింది. తమ ప్లే ఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.

    మ్యాచ్‌ అనంతరం యువీ మాట్లాడుతూ బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కారణంగానే ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని చెప్పాడు. జట్టు ప్రధాన బౌలర్‌ ఆశిష్‌ నెహ్రా లేకపోవడం కూడా దెబ్బతీసిందని, అతను తిరిగి వస్తే జట్టు బౌలింగ్‌ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మొదటి ఆరు ఓవర్లలో మేం చాలా పరుగులు ఇచ్చాం. కీలకమైన కరుణ్‌ నాయర్‌ క్యాచ్‌ను వదిలేశాం. ఆరంభంలోనే మేం వికెట్లు తీసుకొని ఉంటే మ్యాచ్‌పై అదుపు సాధించి ఉండేవాళ్లం. మా బౌలర్లు గొప్ప ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. మిడిల్‌ ఓవర్లలోనూ మేం వికెట్లు తీసుకోలేకపోయాం. వచ్చిన ప్రతి ఢిల్లీ ఆటగాడు 30-40 పరుగులు చేశాడు' అని యువీ అన్నాడు. ప్రస్తుతానికి భువీ (భువనేశ్వర్‌కుమార్‌, రషీద్‌ (ఖాన్‌)పై ఎక్కువగా ఆధారపడుతున్నామని, నెహ్రా వస్తే బౌలింగ్‌ లైనప్‌ మరింత స్ట్రాంగ్‌ అయ్యే అవకాశముందని చెప్పాడు.

>
మరిన్ని వార్తలు