అర్నాబ్ గోస్వామిపై రూ.500 కోట్ల దావా

30 Jul, 2016 15:50 IST|Sakshi
అర్నాబ్ గోస్వామిపై రూ.500 కోట్ల దావా

న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మతబోధకుడు జకీర్ నాయక్ మరో సంచలనానికి తెరలేపారు. పగతో కూడిన ప్రచారంతో తన ప్రతిష్ఠకు భంగం కల్గిస్తున్నారని ఆరోపిస్తూ ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామిపై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న జకీర్ నాయక్.. ముంబైలోని తన న్యాయవాది ద్వారా శుక్రవారం అర్నాబ్ కు నోటీసులు పంపారు. ఈ సందర్భంగా జకీర్.. అర్నాబ్ పై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.

టైమ్స్ నౌ చానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన అర్నాబ్ గోస్వామి వ్యక్తులపై మీడియా విచారణ(మీడియా ట్రయల్) జరుపుతున్నారని, ఆ క్రమంలో మత విశ్వాసాలను కించపరుస్తూ, విద్వేషాలనున్ని రెచ్చగొడుతున్నారని జకీర్ నాయక్ విమర్శించారు. సత్యదూరమైన ప్రసారాలతో తన ప్రతిష్టకు భంగం కలిగించారని, అందుకే రూ.500 కోట్ల పరువునష్టం దావా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

గత నెలలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బీభత్సం సృష్టించి 22 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల్లో ఒకడు 'జకీర్ నాయక్ ప్రసంగాల స్పూర్తితోనే తుపాకి పట్టాన'ని  వెల్లడించడంతో మత గురువు వ్యవహార శైలిపై వివాదం మొదలైంది. ముంబై కేంద్రంగా 'పీస్ టీవీ' చానెల్ ద్వారా బోధనలు చేసే జకీర్ నాయక్.. ఆత్మాహుతి దాడులను ఇస్లాం సమర్థిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలు వెలుగులోకి రావడం అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియా వెళ్లిపోయిన జకీర్ నాయక్  నైస్ (ఫ్రాన్స్) దాడుల అనంతరం స్కైప్ ద్వారా భారతీయ మీడియాతో మాట్లాడారు. అప్పుడుకూడా కొన్ని చానెళ్ల తీరును ఆక్షేపించిన ఆయన ఇప్పుడు ఏకంగా ఎడిటర్ ఇన్ చీఫ్ పై రూ.500 కోట్ల పరువునష్టం దావా వేశారు.

>
మరిన్ని వార్తలు