సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్

31 Aug, 2016 14:01 IST|Sakshi
సోనీ పిక్చర్స్ చేతికి టెన్ స్పోర్ట్స్
జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన టెన్ స్పోర్ట్స్ ను సోనీ పిక్చర్స్ సొంతంచేసుకుంది. రూ.2600 కోట్లకు స్పోర్ట్ బ్రాండ్కాస్టింగ్ బిజినెస్లను సోనీ పిక్చర్స్కు విక్రయించేందుకు టెలివిజన్ దిగ్గజం సుభాష్ చంద్ర ఆధ్వర్యంలోని జీ ఎంటర్టైన్మెంట్ ఆమోదించింది. సోనీతో కుదుర్చుకున్న ఈ డీల్ మొత్తం నగదు రూపంలోనే ఉండనుంది. 2006లో దుబాయ్ టాటా గ్రూపునకు చెందిన అబ్దుల్ రెహ్మాన్ బుఖాతిర్ నుంచి టెన్ స్పోర్ట్స్ను సుభాష చంద్ర కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీన్ని సోనీ పిక్చర్స్కు విక్రయించారు. మరో నాలుగు, ఐదు నెలల్లో ఈ డీల్ పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ డీల్తో 21వ సెంచరీ ఫాక్స్ సొంతమైన స్టార్ ఇండియా, జపనీస్ దిగ్గజం సోనీ కార్ప్ సొంతమైన సోనీ పిక్చర్స్ భారత్లో స్పోర్ట్స్ ప్రసార విభాగాల్లో ఏకాధిపత్యం సాధించినట్టేనని వెల్లడవుతోంది.
 
గత కొంతకాలంగా టెన్ స్పోర్ట్స్ను విక్రయించాలని జీ ఎంటర్టైన్మెంట్ పావులు కదిపిందని, నష్టాల్లో కొనసాగుతున్న స్పోర్ట్స్ వ్యాపారాలను వదిలించుకోవడానికి ప్రయత్నించిందని జీ ఎంటర్టైన్మెంట్కు చెందిన ఓ అధికారి తెలిపారు. సోనీ, స్టార్ రెండు భారత్లో తిరుగులేని ఛానల్స్ అని, ఈ డీల్ సోనీకి ఎంతో సహకరించనుందని డఫ్, ఫిల్స్స్ వాల్యుయేషన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ గుప్తా తెలిపారు. ఈ డీల్ అటు జీ ఎంటర్టైన్మెంట్కి, ఇటు సోనీకి లబ్ది చేకూరుస్తుందని స్పోర్ట్స్ బ్రాండ్కాస్టింగ్కు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. మల్టీ స్క్రీన్ మీడియా (ఎంఎస్ఎం ) గా పేరుపొందిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ భాషల్లో అనేక చానల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్, హిందీ చానల్స్ ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, మ్యూజిక్, పిల్లల విభాగాల్లో తనదైన హవాను చాటుకుంటూ సోనీ కోట్ల రూపాయల ఆదాయాలను ఆర్జిస్తోంది. 
మరిన్ని వార్తలు