బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో..

20 Apr, 2017 20:41 IST|Sakshi
బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో..
ముంబై: ఒక మనిషి ప్రాణం కాపాడటానికి రక్తం చాలా అవసరం. కొన్ని సందర్భంలో రక్తం లభించక చికిత్స పొందుతూ చనిపోయినవారు  ఉన్నారు. అలాంటిది  బీఎంసీకి చెందిన భగవతి ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది నిర్వాకంతో 2,446 బ్లడ్‌ బ్యాగులు (856 లీటర్ల రక్తం) ఎందుకు పనికిరాకుండా పోయాయి. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని గ్రూపుల వారీగా విభజించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తోంది. నగరంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో సేకరించిన వేలాది లీటర్ల రక్తాన్ని బ్యాగుల్లో పోగుచేసి భగవతి ఆస్పత్రిలోని బ్లడ్‌ బ్యాంక్‌లో నిల్వచేస్తారు. ఈ రక్తానికి  సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారు.

అందులో హెచ్‌ఐవీ, మలేరియా, కామెర్లు, ఇతర అంటువ్యాధులున్న గ్రూపు రక్తాన్ని వేరుచేసి ఉపయోగ పడే రక్తాన్ని నిల్వచేస్తారు. అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. కానీ, అస్పత్రి సిబ్బంది గ్రూపుల వారీగా విభజించకుండా బ్లడ్‌ బ్యాంకులో నిల్వచేశారు. ప్రస్తుతం ఆ రక్తం ఎందుకు పనిరాకుండా పోయింది. రక్తం బ్యాగులను బయట పాడేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై భగవతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రదీప్‌ జాదవ్‌ మాట్లాడుతూ.. ఇందులో వాస్తవం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 
 
 
>
మరిన్ని వార్తలు