మిశ్రా అరెస్ట్, విడుదల

28 Oct, 2015 02:11 IST|Sakshi
మిశ్రా అరెస్ట్, విడుదల

* మూడు గంటల విచారణ   
* వివరాలు తెలుసుకుంటున్నాం: బీసీసీఐ
సాక్షి, బెంగళూరు: తన స్నేహితురాలు, బాలీవుడ్ నిర్మాత వందనా జైన్‌పై దాడి చేశాడన్న కారణంతో భారత క్రికెటర్ అమిత్ మిశ్రాను బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మూడు గంటల విచారణ అనంతరం ‘స్టేషన్ బెయిల్’పై విడుదల చేశారు. ‘మిశ్రా వాదనను విన్నాం. సంఘటనకు సంబంధించి అతని నుంచి కొన్ని విషయాలను సేకరించాం.

విచారణ పూర్తి చేసి త్వరలోనే చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేస్తాం. తర్వాత కోర్టు సమన్లు జారీ చేసి కేసును విచారిస్తుంది’ అని సిటీ సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు. అనుమతి లేకుండా క్రికెటర్ల గదిలోకి రాకూడదనే నిబంధన ఉన్న నేపథ్యంలో తాను వందనా జైన్‌ను మందలించానే తప్ప ఆమెపై దాడికి పాల్పడలేదని విచారణలో మిశ్రా పేర్కొన్నట్లు సమాచారం.

విచారణ అనంతరం మంగళవారం మధ్యాహ్నం మిశ్రా అరెస్ట్‌ను చూపారు. అనంతరం మిశ్రా, వందనాల స్నేహితుడైన రాఘవన్ బెయిల్ ష్యూరిటీ ఇవ్వడంతో విడుదల చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 325, 354 (ఎ) ప్రకారం పోలీసులు మిశ్రాపై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువైతే ఆరు నుంచి ఏడేళ్లు శిక్ష పడే అవకాశముందని పాటిల్ తెలిపారు.

సెప్టెంబర్ 25న శిక్షణ కోసం బెంగళూరుకు వచ్చిన తనను కలిసేందుకు హోటల్ రూమ్‌కు వచ్చిన వందనపై మిశ్రా దాడి చేశాడని సమాచారం. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడికి పాల్పడినట్లు సెప్టెంబర్ 27న అశోక్ నగర్ పోలీసు స్టేషన్‌లో వందన ఫిర్యాదు చేసింది. దీన్ని విచారించిన పోలీసులు ఈనెల 20న విచారణకు హాజరుకావాలని క్రికెటర్‌కు నోటీసులు జారీ చేశారు.
 

మరోవైపు క్రికెటర్‌పై పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ‘కేసు విషయం బీసీసీఐ దృష్టికి వచ్చింది. అన్ని అంశాలను తెలుసుకుంటున్నాం. విషయాలు పూర్తిగా తెలిశాకే దాని గురించి మాట్లాడుతాం. పోలీసులు వాళ్ల పని చేస్తున్నారు. నేరంతో క్రికెటర్‌కు సంబంధం ఉందో లేదో మేం తెలుసుకుంటున్నాం. కచ్చితమైన విషయాలు తెలిసిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం’ అని శుక్లా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు