రూ.2వేల నోటుతో అంధులకు చిక్కు..

20 Apr, 2017 17:38 IST|Sakshi
రూ.2వేల నోటుతో అంధులకు చిక్కు..
ముంబై: ఆర్‌బీఐ కొత్తగా విడుదల చేసిన రూ.2వేల నోటును గుర్తించటంలో అంధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రద్దయిన రూ.500, రూ1,000 నోట్లపై ఎంబోజింగ్‌, ఎన్‌గ్రేవింగ్‌ అక్షరాలు ఉండటంతో అంధులు తేలిగ్గా గుర్తు పట్టే వీలుండేది. గత నవంబరులో వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వీటి స్థానంలో రూ.2,000 నోటును కొత్త ఫీచర్లతో విడుదల చేసింది. ఈ నోటుపై ఎంబోజింగ్‌, ఎన్‌గ్రేవింగ్‌ అక్షరాలేవీ లేకపోవటంతో చేతి వేళ్లతో తాకి గుర్తు పట్టటం కష్టంగా మారింది. ఇదే విషయాన్ని తాము కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పామని ముంబైకి చెందిన నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది బ్లైండ్‌(ఎన్‌ఏబీ) చెబుతోంది.

నోట్ల రద్దు విషయం తెలిసిన సమయంలో తమ సంఘం తరఫున కేంద్ర అధికారులను కలిసి ఎంబోజింగ్‌, ఎన్‌గ్రేవింగ్‌ విధానంతో  దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 80 లక్షల మంది అంధులకు లాభిస్తుందని తెలిపామని సంఘం జాతీయ కార్యదర్శి జోక్విం రాపోస్‌ తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ప్రయాణ సమయంలో ముఖ్యంగా ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లేటప్పుడు తమ వద్ద ఉన్న రూ.2వేల నోటును ఎలా ఇవ్వాలో తెలియక ఇబ్బంది ఎదురవుతోందని అన్నారు.
 
మరిన్ని వార్తలు