చిల్లర వ్యాపారానికి చిల్లు!

15 Nov, 2013 02:05 IST|Sakshi
చిల్లర వ్యాపారానికి చిల్లు!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి... రిటైల్ రంగాన్ని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తోంది. ఉత్పత్తిదారులకు పంపిణీదారుల నుంచి డిమాండ్ లేకపోవటం నుంచి మొదలుపెడితే... పంపిణీదార్లకు డీలర్ల నుంచి సరైన సమయంలో డబ్బు రాకపోవటం... ఖర్చుకు వెనకాడుతున్న వినియోగదారులు... ఇలా వ్యాపార చక్రం అన్ని దశల్లోనూ తీవ్రంగా దెబ్బతింటోంది. మూడు నాలుగేళ్లుగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతూ ఉండటంతో వ్యాపారం ఏకంగా 50 శాతం వరకూ పడిపోయిందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ స్థితిపై ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనమిది...
 
రాష్ట్రంలో రిటైల్ రంగానికి ప్రధాన మార్కెట్ హైదరాబాదే. అందుకని రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికే వచ్చి షాపింగ్ చేసేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయని క్లాసిక్ పోలో బ్రాండ్ దుస్తుల పంపిణీదారు జి.శ్రీకాంత్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి చెప్పారు. ‘‘రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కస్టమర్లు హైదరాబాద్‌కు రావడం బాగా తగ్గింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం తన ప్రాభవాన్ని కోల్పోతుండడంతో ఆ ప్రభావం రిటైల్‌పై కూడా పడుతోంది’’ అన్నారాయన. భాగ్యనగరంలో పెట్టుబడి పెట్టేందుకు వ్యాపారులు సైతం వెనకాడుతున్నారని ప్రముఖ రిటైల్ చైన్ యజమాని ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘జనం దగ్గర ఖర్చు చేసే శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఏడాదికి రూ.300 కోట్ల వ్యాపారం చేశాం.
 
 ఈ ఏడాది రూ.120 కోట్లు వచ్చే పరిస్థితి కూడా కనిపించటం లేదు’’ అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పెద్ద పెద్ద ఔట్‌లెట్లలోనే 40% వ్యాపారం పడిందంటే, చిన్న దుకాణాల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అద్దెలు, జీతాలు, విద్యుత్తు తదితర ఖర్చులు పెరిగిపోవటంతో చిన్న వ్యాపారులు ఇతర ఆదాయ మార్గాలకు మళ్లుతున్నారని ఆయన చెప్పారు. ‘‘రోజువారీ ఇంటి ఖర్చులు పెరిగాయి. ఆ స్థాయిలో ఉద్యోగుల జీతాలు పెరగడం లేదు. అందుకనే వారి కొనుగోలు శక్తి తగ్గుతోంది’’ అని సీఎంఆర్ గ్రూప్ ఎండీ మావూరి వెంకట రమణ చెప్పారు. గతంలో ఎక్కువగా ఖర్చు చేసినవారిలో తొలిస్థానం సాఫ్ట్‌వేర్ ఉద్యోగులదే. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ బూమ్ లేకపోవడం రిటైల్ కష్టాలను మరింత ఎగదోస్తోంది.
 
 చేతులెత్తేస్తున్నారు...
 ప్రధానంగా వస్త్ర వ్యాపారం దెబ్బతింటోంది. ఎందుకంటే గిరాకీ లేక వస్త్ర డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ‘‘గతంలో డీలర్లు 45 రోజుల్లోపే బాకీ చెల్లించేవారు. ఇప్పుడు కనీసం 90 రోజుల గడువు తీసుకుంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఆరు నెలల సమయం అడుగుతున్నారు. మరోవంక సమయానికి బాకీ చెల్లించాలంటూ కంపెనీల నుంచి మాపై ఒత్తిడి పెరుగుతోంది’’ అని పలు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు పంపిణీదారుగా వ్యవహరిస్తున్న తొడుపునూరి నాగేష్ చెప్పారు. వ్యాపారం లేక ఎగవేతదారుల సంఖ్య పెరుగుతోందని మరో వ్యాపారి చెప్పారు. ఎగవేతదారుల సంఖ్య గతంలో 1 శాతముంటే, ఇప్పుడు 10 శాతానికి చేరిందని తెలియజేశారాయన.
 
2008-09 సంవత్సరంలో 480 మంది డీలర్లతో వ్యాపారం చేసిన ఒక పంపిణీదారు ప్రస్తుతం డీలర్ల సంఖ్యను 260కు కుదించారు. దీనికి కారణం వారి వద్ద నుంచి బాకీలు సక్రమంగా రాకపోవడమే. భాగ్యనగరంలో మధ్యతరగతికి అనువైన వస్త్ర దుకాణంగా పేరొందిన ఒక రిటైల్ చైన్ నుంచి నెలకు రూ.45 లక్షల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు ఇది రూ.8 లక్షలకు చేరిందని అంతర్జాతీయ బ్రాండ్ పంపిణీదారు ఒకరు తెలిపారు. లాభాలు కుచించుకుపోయాయన్నారు. గతంలో 10 శాతం లాభం ఉంటే, ఇప్పుడు 4 శాతంతోనే సర్దుకుపోతున్నట్టు చెప్పారాయన. దుస్తులు అమ్ముడవ్వాలంటే డీలరుకు ఎక్కువ మార్జిన్ ఆఫర్ చేస్తున్నామని, దానివల్ల తమ లాభం తగ్గుతోందని తెలిపారు.

మరిన్ని వార్తలు