తేజ్ పాల్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

23 Nov, 2013 04:32 IST|Sakshi
తేజ్ పాల్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

పణజి/న్యూఢిల్లీ: సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. గోవా పోలీసులు తేజ్‌పాల్‌పై సుమోటోగా అత్యాచార కేసు నమోదు చేయడంతో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 376 (2) (అధికార హోదాను అడ్డంపెట్టుకొని ఓ మహిళను అధీనంలోకి తెచ్చుకొని అత్యాచారం చేయడం), 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించడం) కింద తేజ్‌పాల్‌పై కేసు నమోదు చేసిన గోవా క్రైం బ్రాంచి పోలీసులు ఆయన్ను ప్రశ్నించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఢిల్లీ పంపనున్నారు. ఆపై ఆయన్ను అరెస్టు చేసే అంశాన్ని కూడా తోసిపుచ్చడంలేదు.
 
 ఇటువంటి హైప్రొఫైల్ నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోమని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు కోరినా తెహెల్కా యాజమాన్యం ఇంకా స్పందించలేదని విమర్శించారు. ఈ కేసుకు సంబంధించి నివేదికను సమర్పించాల్సిందిగా గోవా ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్. సింగ్ తెలిపారు. మరోవైపు ఈ కేసులో పోలీసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని తేజ్‌పాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. లైంగిక దాడి జరిగినట్లు బాధితురాలు చెబుతున్న గోవాలోని హోటల్‌లో సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించి వాటిని విడుదల చేయాలన్నారు.
 
 పోలీసులను ఆశ్రయించం: షోమా
 లైంగిక దాడి ఉదంతాన్ని అంతర్గత వ్యవహారంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు ఇప్పటికే విమర్శలపాలైన తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌధురి శుక్రవారం కూడా అదే ధోరణిలో స్పందించారు. ఈ వ్యవహారంలో తమకు తాముగా పోలీసులను ఆశ్రయించబోమని...దీనిపై బాధితురాలే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మీడియాకు చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందిస్తూ తాను నిలదీయడం వల్లే తేజ్‌పాల్ బాధితురాలికి క్షమాపణ చెప్పడంతోపాటు ఎడిటర్ పదవి నుంచి తప్పుకున్నారని గుర్తుచేశారు. ఈ ఘటనపై అంతర్గత విచారణకు తేజ్‌పాల్‌కు స్నేహితురాలైన ప్రముఖ ప్రచురణకర్త ఊర్వశి బుటాలియా నేతృత్వంలో కమిటీ వేయడంపై ప్రశ్నించగా మీడియా ముందుగానే తీర్పు ఇచ్చేస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు