పది మందిలో పాము..

22 Nov, 2015 16:28 IST|Sakshi
పది మందిలో పాము..

పది మందిలో పాము చావదన్న సామెత తమ పార్టీకి సరిగ్గా అన్వయించవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. సీఎం పదవి తనకంటే తనకంటూ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అనంతరం పలువురు నేతలు పోటీపడటంతో రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని వాపోతున్నారు. సీఎంగా పార్టీ నేత ఎవరైనా ఉండి ఉంటే ఎన్నికల ఫలితాలు ఇంత నిరాశాజనకంగా వచ్చి ఉండేవి కావంటున్నారు.

అయితే ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చిందని తలలు పట్టుకుంటున్నారట. తెలంగాణ కోసం సీఎం పదవిని తాను వదిలేశానంటే... తాను వదిలేశానని సీనియర్ నేతలు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి వంటి వారు సీఎం కేసీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అంటూ ప్రకటన లు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. మరో నేత దామోదర రాజనర్సింహ తాను సీఎం కాకుండా అగ్రకుల నేతలు అడ్డుకున్నారని ఇప్పటికీ వాపోతున్నారని వారు గుర్తుచేస్తున్నారట. ఎవరో ఒకరు సీఎం పదవిని తీసుకుంటే పార్టీకి ఈ పరిస్థితి దాపురించేది కాదంటున్నారు.

అయితే సమస్యంతా.. ఇప్పటికీ ఈ నేతల తీరు మారకపోవడమేనని నాయకులు అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగానే ఉన్నా.. మళ్లీ తామే సీఎం అభ్యర్థి అంటూ దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహా, సర్వే సత్యనారాయణ, వివేక్, భట్టి విక్రమార్క, రెడ్డి సామాజిక వర్గం నుంచి జై పాల్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి,  బీసీ వర్గాల నుంచి పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలు పోటీపడుతుండడంతో ఏమీ చేయాలో తెలియక హైకమాండ్‌కు సైతం జుట్టుపీక్కునే పరిస్థితి ఏర్పడిందట!

>
మరిన్ని వార్తలు