సినీ నిర్మాత అదృశ్యం

12 Jul, 2014 01:55 IST|Sakshi
  •     సూసైడ్ నోట్ రాసి వెళ్లిపోయిన పూర్ణరాజ్
  •      సినిమా నిర్మాణంలో  విభేదాలే కారణం!
  • బంజారాహిల్స్:  అనుమానాస్పదస్థితిలో ఓ సినీ నిర్మాత అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా కేంద్రానికి చెందిన నాగుల పూర్ణరాజ్(27) బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని బంజారా భవన్ అపార్ట్‌మెంట్స్‌లో తన తమ్ముడు ఎన్.పృథ్వీరాజ్‌తో కలిసి ఉంటున్నారు. ఇటీవల గుంటూరుకు చెందిన ఉప్పుటూరి మహేశ్ దర్శకత్వంలో ‘జగమే మాయ’ అనే సినిమాను నిర్మించారు.

    సినీ నిర్మాణంలో మహేశ్‌తో విభేదాలు పొడచూపాయి. కొంత కాలంగా దర్శకుడు మహేశ్, ఆయన సోదరుడు ప్రసాద్ కలిసి పూర్ణరాజ్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. నిర్మాతగా తప్పుకోవాలని, అందుకు రూ.15 లక్షలు ఇస్తామని బలవంతంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డబ్బు చెల్లించడంలో మహేశ్, ప్రసాద్ ముఖం చాటేశారు. తరచూ అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ విషయమై పూర్ణరాజ్ గురువారం వీరిని నిలదీశారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర మనస్తాపానికి గురైన పూర్ణరాజ్ తన గదికి వచ్చారు.

    శుక్రవారం తెల్లవారుజామున తన సోదరుడికి చెప్పకుండానే సూసైడ్ నోట్ రాసి అదృశ్యమయ్యారు. గదిలో తన సోద రుడి సూసైడ్ నోట్ చదివిన పృథ్వీ తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన జీవితం నాశనం కావడానికి మహేశ్, ప్రసాద్ కారణమని, తనను సినిమాల్లో ఎదగకుండా అంతం చేశారని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. సినిమాల్లో మంచి జీవితాన్ని గడుపుదామని కష్టపడ్డానని, ఇక్కడ తెలంగాణ  వారికి చోటులేదని అందులో పేర్కొన్నారు.

    అందుకే చచ్చిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తనలాగా ఎవరూ మోసపోవద్దని, ఇలాంటి మోసకారులను కఠినంగా శిక్షించాలంటూ తెలంగాణ  ప్రభుత్వాన్ని కోరారు. బాధితుడి సోదరుడు పృథ్వీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
     

>
మరిన్ని వార్తలు