∙అమృతాహారం చిన్న రైతుల ‘సహజ ఆహారం’!

27 Jun, 2017 02:11 IST|Sakshi
∙అమృతాహారం చిన్న రైతుల ‘సహజ ఆహారం’!

30 సేంద్రియ రైతుల సహకార సంఘాల భాగస్వామ్యంతో
హైదరాబాద్, విశాఖపట్నంలో 10 ‘సహజ ఆహారం’ ఫుడ్‌ స్టోర్లు
వ్యవసాయేతర ఆస్థులుంటేనే రైతుల సహకార సంఘాలకు రుణాలు

ఆపైన 30% ఆదాయపు పన్ను విధింపు.. పేద రైతుల సొసైటీలకన్నా మినహాయింపునివ్వాలంటున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం
రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులు, వినియోగదారులు కలిసి ఏర్పాటు చేసుకున్న సహకార సంఘాల సమాఖ్య ‘సహజ ఆహారం ప్రొడ్యూసర్‌ కంపెనీ’.

వివిధ రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయ వ్యాప్తికి కృషి చేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్‌.ఎ.) ఈ సంస్థను ప్రమోట్‌ చేస్తోంది. స్థానిక వనరులతో సేంద్రియ వ్యవసాయం చేయడంతోనే చిన్న, సన్నకారు రైతుల జీవితాలు మారిపోవని.. రసాయనిక అవశేషాల్లేని తమ ఆహారోత్పత్తులను తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు నేరుగా వినియోగదారులకు అమ్ముకోగలిగినప్పుడే వారి నికరాదాయం పెరుగుతుందని సుస్థిర వ్యవసాయ కేంద్రం అనుభవపూర్వకంగా గ్రహించింది. ఆ తర్వాతే ‘సహజాహారం’ ఫుడ్‌ స్టోర్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని 12 జిల్లాలకు చెందిన 30 సేంద్రియ రైతుల సహకార సంఘాలకు ఇందులో భాగస్వామ్యం ఉంది. వీటిలో మహిళా రైతుల సంఘాలు 2, ఆదివాసీ రైతుల సహకార సంఘాలు 2 ఉన్నాయి. అంతేకాదు.. వినియోగదారుల సహకార సంఘం కూడా ఒకటుంది. కనీసం నాలుగేళ్లుగా 882 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్న 496 మంది సర్టిఫైడ్‌ సేంద్రియ రైతులతో సహజ ఆహారం ప్రొడ్యూసర్‌ కంపెనీ 2014లో ప్రారంభమైంది.


200 రకాల సేంద్రియ ఆహారోత్పత్తులు..
రైతులు సేంద్రియ పద్ధతుల్లో పండించిన ధాన్యాలు, పప్పులు, కూరగాయలు తదితర ఉత్పత్తులను శుద్ధి చేసి, ప్యాక్‌చేసి ‘సహజ ఆహారం’ బ్రాండ్‌తో విక్రయించడం విశేషం. బియ్యం, పప్పులు, గానుగ వంట నూనెలు, సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు, పండ్లు, శుద్ధిచేసి ప్యాక్‌ చేసిన ఆహారోత్పత్తులు, సౌందర్య సాధనాలు మొత్తం 200 రకాల సేంద్రియ ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి అందుబాటులోకి తెస్తున్నారు. ఇందుకోసం విజయనగరం జిల్లా బొద్దాం, కర్నూలు జిల్లా నాగులదిన్నె, జనగామ జిల్లా కల్లెం, మహారాష్ట్ర వార్దా జిల్లా డోర్లీలో ప్రోసెసింగ్‌ హబ్‌లను ‘సహజ ఆహారం’ కంపెనీ నెలకొల్పింది. ఈ సేంద్రియ ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలలో 10 సహజ ఆహారం స్టోర్ల ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మరో 15 స్టోర్లు త్వరలో తెరవనున్నారు.

గరిష్ట ధరలో కనీసం 50% రైతుకు అందుతుంది
సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలను అప్పటికప్పుడు మార్కెట్లో అమ్ముకోవడం కన్నా.. నిల్వ చేసి, ప్రోసెస్‌ చేసి వివిధ ఆహారోత్పత్తులుగా తయారు చేసి, ఒకే బ్రాండ్‌ పేరుతో విక్రయించడం ద్వారా అధిక నికరాదాయాన్ని పొందడానికి రైతులకు సహకార సంఘాలు, ప్రొడ్యూసర్‌ కంపెనీలు ఉపకరిస్తాయి. సాధారణంగా మార్కెట్లో అమ్మకానికి పెట్టే ఆహారోత్పత్తుల గరిష్ట విలువలో 22 నుంచి 25% మాత్రమే వాటిని పండించిన రైతులకు చేరుతున్నదని అంచనా. అయితే, ‘సహజ ఆహారం’ స్టోర్లలో సేంద్రియ ఆహారోత్పత్తులకు వినియోగదారులు చెల్లించే గరిష్ట ధరలో కనీసం 50% సొమ్మును పండించిన రైతుకు అందిస్తున్నామని డా. రామాంజనేయులు చెప్పారు.

30% ఆదాయపు పన్ను పోటా?
రైతులు తమ ఉత్పత్తులను తమకు తామే నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటే ఆదాయపు పన్ను చెల్లించనక్కరలేదు. కానీ, కంపెనీల చట్టం ప్రకారం ఏర్పాటైన ప్రొడ్యూసర్‌ కంపెనీ ద్వారా అమ్మితే వచ్చిన లాభంపై 30% ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తున్నది. సేంద్రియ/ సహజ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించి, నికరాదాయాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసే చిన్న, సన్నకారు రైతులకు వెన్నుదన్నుగా ఉండాలంటే ఆదాయపు పన్నును వీరి సహకార సంఘాలకైనా మినహాయించాలని డా. రామాంజనేయులు కోరుతున్నారు. సంఘ సభ్యుల వ్యవసాయ భూములు లేదా సంఘం కొని దాచిన వ్యవసాయోత్పత్తుల విలువపై రుణపరపతి కల్పించడం అవసరం. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హితమైన సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించే రైతుల సహకార సంఘాలను ప్రొత్సహించినట్టవుతుంది. తద్వారా భూమి ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడినట్టవుతుంది. అన్నిటికీ మించి గ్రామీణ చిన్న, సన్నకారు రైతుల నికరాదాయాన్ని పెంపొందించడానికి దోహదపడినట్టవుతుంది.
(వివరాలకు.. జ్టి్టp://ట్చజ్చ్జి్చ్చజ్చిట్చఝ.జీn  085007 83300)
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

వ్యవసాయేతర ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి?
ఆర్థిక వనరులు లేని రైతులు, వినియోగదారుల సహకార సంఘాలు, ప్రొడ్యూసర్‌ కంపెనీలకు ఉదారంగా బ్యాంకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం మూడేళ్లు బ్యాలన్స్‌ షీట్‌తోపాటు వ్యవసాయేతర ఆస్తులను పూచీకత్తుగా పెట్టాలని బ్యాంకులు కోరడం అనుచితం. వనరులు తక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులు సంఘాలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడాన్ని ప్రోత్సహించడానికి క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలి. ఇవి నిలదొక్కుకోవడానికి శైశవ దశలో తొలి మూడేళ్లలోనే ప్రభుత్వ మద్దతు అవసరం. అంతగా అయితే తొలి మూడేళ్లు పరిమితంగానే బ్యాంకు రుణాలు ఇవ్వాలి.

  వ్యవసాయేతర ఆస్థులు తనఖా పెట్టాలంటే పేద రైతులు ఎక్కడి నుంచి తేగలుగుతారన్న ఆలోచన పాలకులకు లేదా? అసంబద్ధమైన ఈ నిబంధనల కారణంగా పట్టణాలు, నగరాల్లో మోతుబరుల సహకార సంఘాలే బ్యాంకు రుణాలను ఎక్కువగా పొందగలుగుతున్నాయి. గ్రామీణ పేద రైతుల సహకార సంఘాలు మాత్రం బ్యాంకు రుణం పొందలేకపోతున్నాయి. బ్యాంకు రుణం దొరికితే 11–12% వార్షిక వడ్డీతో సరిపోతుంది.  బ్యాంకు రుణం దొరక్కపోవడంతో మైక్రోఫైనాన్స్‌ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఈ సంస్థల నుంచి రుణం తీసుకుంటే 13.5% వడ్డీ సహా 3 నెలల్లోనే అసలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సి వస్తున్నది. చిన్న, సన్నకారు రైతుల సహకార సంఘాలను సరిగ్గా నడుపుకోగలిగేలా ప్రభుత్వం వసతులు కల్పించడం ఎంతైనా అవసరం.  
– డా. జీ వీ రామాంజనేయులు (ట్చఝౌౌఃఛిట్చజీnఛీజ్చీ.ౌటజ), డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, తార్నాక, సికింద్రాబాద్‌

మరిన్ని వార్తలు