సేంద్రియ ఇంటిపంటల సాగుపై యువతకు 3 రోజుల ఉపాధి శిక్షణ

18 Jul, 2017 03:44 IST|Sakshi
సేంద్రియ ఇంటిపంటల సాగుపై యువతకు 3 రోజుల ఉపాధి శిక్షణ

రసాయన రహిత ఆహారోత్పత్తులపై ప్రజాచైతన్యం పెరుగుతున్న కొద్దీ సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటల సాగు నానాటికీ విస్తృతమవుతోంది. హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం సుమారు 30 వేల మంది కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లు ఇంటి పెరట్లో లేదా టెర్రస్‌ మీద కుండీలు, మడుల్లో పండించుకుంటున్నారని అంచనా.

ఆరోగ్యదాయకమైన ఈ వ్యాపకంపై మరెందరో ఆసక్తితో ఉన్నా, వారికి టెర్రస్‌ ఇంటిపంటలను కుండీలు, మడుల్లో ఏర్పాటు చేసి, అడపా దడపా మంచిచెడ్డలు చూసిపెట్టే నైపుణ్యం కలిగిన సర్వీసు ప్రొవైడర్ల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు చేయడం, వాటిని క్రమం తప్పకుండా నిర్వహించడం వంటి అంశాలపై ఆసక్తి కలిగిన యువతీ యువకులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు నెలకొల్పిన ‘గ్రీన్‌ దునియా’ సంస్థ శిక్షణ ఇవ్వనుంది.

సుస్థిర వ్యవసాయ కేంద్రం, సహజ ఆహారం, అప్నా బీజ్‌ సహకారంతో హైదరాబాద్‌లో ఈ నెలాఖరులో 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. తరగతి గది శిక్షణతోపాటు ప్రాక్టికల్‌గా కిచెన్‌ గార్డెన్‌ను ఏర్పాటు చేయడంపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వారికి పార్ట్‌టైమ్‌ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్‌ గడ్డం రాజశేఖర్‌ తెలిపారు. వచ్చే నెల నుంచి హైదరాబాద్‌ నగరంలో సేంద్రియ ఇంటిపంటలకు సంబంధించి సేవలందించే మొబైల్‌ బృందాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. కనీస విద్యార్హత 10వ తరగతి. ఈ నెల 25లోగా పేర్లు నమోదు చేయించుకోవాలి. రుసుము రూ. 1,000. ఇతర వివరాలకు 90000 05840, 83329 45368 నంబర్లలో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు