ప్రకృతి సేద్య పతాక రెపరెపలు!

12 Sep, 2016 23:51 IST|Sakshi
ప్రకృతి సేద్య పతాక రెపరెపలు!

- వరి సాగులో మూడేళ్లుగా ఏటేటా పెరుగుతున్న దిగుబడి

- బియ్యం విక్రయంతో ఎకరాకు రూ. 65 వేల నికరాదాయం

- పెరుమాళ్లు ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు శ్రీకారం

- చెరకులో తొలి ఏడాదే ఎకరాకు 45 టన్నుల దిగుబడి

- నెల్లూరు రైతు లింగారెడ్డి విజయగాథ


 రసాయనిక ఎరువుల వాడకంతో నిస్సారమైన భూమిలో మూడేళ్ల క్రితం ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన లింగారెడ్డి దీక్షగా కొనసాగిస్తున్నారు. ఏటేటా దిగుబడులు పెంచుకుంటూ.. అధిక నికరాదాయాన్ని పొందుతున్నారు.  చెరకులో తొలి ఏడాదే రసాయన సేద్యంలోకన్నా ఎక్కువ దిగుబడి తీశారు. వరిలో మూడేళ్లకు తోటి రైతులతో సమానంగా దిగుబడి తీస్తున్నారు. వరిని తక్కువ నీటితో సాగు చేయడం అవసరమని భావించి.. పెరుమాళ్లు ఆరుతడి పద్ధతిలో వరి సాగుకు ఈ ఏడాది శ్రీకారం చుట్టారు.. రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

 

 పొలంలో వానపాముల సంతతి పెరిగితే చాలు అవే  వ్యవసాయం చేస్తాయంటున్నారు ఆదర్శ ప్రకృతి వ్యవసాయదారుడు అల్లూరు లింగారెడ్డి. నెల్లూరు రూరల్ మండలం పెద్ద చెరుకూరు ఆయన స్వగ్రామం. 2013 నుంచి వరి, చెరకు, అరటి తదితర పంటలను ప్రకృతి సేద్య పద్ధతిలో సాగు చేస్తూ ముందడుగు వేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంపై 2007లో తిరుపతిలో పాలేకర్ నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో లింగారెడ్డి పాల్గొన్నారు. అప్పట్లో రొయ్యలు సాగు చేస్తుండటంతో ఆసక్తి ఉన్నా దృష్టి పెట్టలేదు. అయితే  భూముల ధరలు పెర గటంతో చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించారు. వచ్చిన సొమ్ముతో కొడవలూరు మండలం బసవాయపాళెంలో 2013లో 26 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రకృతి సేద్యం ప్రారంభించారు. ప్రస్తుతం లింగారెడ్డి 15 ఎకరాల్లో వరి, 6 ఎకరాల్లో చెరకు, 2 ఎకరాల్లో అరటి  పంటలను బోరు నీటితో సాగు చేస్తున్నారు.
 

 చెరకు తొలి ఏడాదే 45 టన్నుల దిగుబడి..

 గతేడాది ఫిబ్రవరిలో చెరకు చేనులో 200 కిలోల ఘన జీవామృతం వేశారు. 15 రోజులకోసారి నీటి ద్వారా ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని పారించేవారు. దీంతోపాటు, చెరకును నాటిన మొదటి ఐదు నెలలు నెలకోసారి పైరుపై జీవామృతాన్ని పిచికారీ చేసేవారు. మొదటి నెల 100 లీటర్ల నీటికి 10 లీటర్ల జీవామృతం, రెండో నెలలో 200 లీటర్ల నీటికి 10 లీటర్ల జీవామృతం చొప్పున చల్లారు. చెరకును ఆశించిన మొవ్వు తెగులును నివారించేందుకు దశపత్ర కషాయం, నీమాస్త్రాన్ని 60 రోజుల దశలో పిచికారీ చేశారు.

 చెరకు సాగులో ఎకరాకు విత్తనానికి రూ. 15 వేలు, కలుపు తీతకు 20 వేలు, ఇతర ఖర్చులు రూ. 5 వే లు కలిపి మొత్తం రూ. 40 వేల ఖర్చయ్యింది. కూలీలతోనే కలుపు తీయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చెరకు పంట చేతికొచ్చింది. రసాయన సేద్యంలో ఎకరాకు 30 టన్నుల దిగుబడి వస్తుండగా.. లింగారెడ్డి ప్రకృతి సేద్యంలో తొలి ఏడాదే  45 టన్నుల దిగుబడి సాధించటం విశేషం. టన్నుకు రూ. 1,500 చొప్పున ఎకరాకు రూ. 67 వేల ఆదాయం లభించింది. ఖర్చులు పోను ఎకరాకు 25 వేలకు పైగా నికరాదాయం లభించింది.

 చెరకు ఆకు ఆచ్ఛాదనతో ప్రయోజనాలు..

 చెరకు కోత పూర్తయ్యాక ఆకులు తదితర వ్యర్థాలను తగులబెట్టకుండా రెండో పంటలో ఆచ్ఛాదనగా వాడి.. కలుపును సమర్థవంతంగా అరికట్టారు. దీనివల్ల రెండో ఏడాది కలుపు తీత ఖర్చు మిగిలింది. పైగా ఆచ్ఛాదన వల్ల భూమిలో వానపాముల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దీంతో భూమి సారవంతమైంది. రెండో ఏడాది ఎకరాకు 65 టన్నులకు తగ్గకుండా చెరకు దిగుబడి వస్తుందని లింగారెడ్డి భావిస్తున్నారు. ఎకరా చెరకు సాగు ఖర్చు రూ. 10 వేలకు తగ్గిందన్నారు. ప్రకృతి సేద్యంలో చెరకు సాగుపై దృష్టి పెట్టి.. మంచి నికరాదాయం పొందాలని ఆయన తోటి రైతులను కోరుతున్నారు.
 

 ఎకరా వరిలో రూ. 65 వేల నికరాదాయం!

 లింగారెడ్డి గత మూడేళ్లుగా 15 ఎకరాల్లో ప్రకృతి సేద్య పద్ధతిలో వరి సాగు చేస్తున్నారు. నెల్లూరు మొలగొలుకులు, బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకాలను సాగు చేస్తున్నారు. దమ్ములో ఎకరాకు 200 కిలోల ఘన జీవామృతం వేస్తున్నారు. 20 రోజులకోసారి కాలువ నీటితోపాటు ఎకరాకు 200 లీటర్ల జీవామృతం అందిస్తున్నారు. భూమిలో సారం లేకపోవటంతో మొదటి రెండేళ్లు ధాన్యం దిగుబడులు ఆశించిన మేర రాకున్నా.. లింగారెడ్డి తన కృషిని కొనసాగించారు. తొలి ఏడాది ఎకరాకు 16 బస్తాల (బస్తా 75 కిలోలు) దిగుబడి రావడంతో తోటి రైతులు లింగారెడ్డిని ఎగతాళి చేశారు. అయినా నిరుత్సాహపడకుండా ప్రకృతి సేద్యాన్ని కొనసాగించారు. రెండో ఏడాది 22 బస్తాల దిగుబడి వచ్చింది. మూడో ఏడాది రసాయన సేద్యం చేసిన తోటి రైతులతో సమానంగా ఎకరాకు 30 బస్తాల ధాన్యం దిగుబడిని సాధించారు.

 లింగారెడ్డి తాను పండించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి.. నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. రసాయనిక అవశేషాల్లేకపోవడం, రుచి బాగుండటంతో బంధువులు, పరిచయస్తులు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎకరాలో ధాన్యాన్ని మరపట్టిస్తే 15 క్వింటాళ్ల బియ్యం వస్తున్నాయి. రూ. 80 వేల ఆదాయం వస్తోంది. ప్రకృతి సేద్యంలో ఎకరా వరి సాగుకు రూ. 15 వేలు ఖర్చవుతుండగా.. ఎకరాకు రూ. 65 వేల నికరాదాయం లభిస్తోందని లింగారెడ్డి తెలిపారు. తన పొలం పరిసరాల్లోని ఇతర రైతులకు రసాయన సేద్యంలో ఎకరా వరిలో 20-30 బస్తాల దిగుబడి వస్తోందన్నారు. సాగుకు రూ. 20-25 వేల ఖర్చు పెడుతున్నారు. ధాన్యాన్ని అమ్ముకోవటం వల్ల లాభం అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఈ ఏడాది పెరుమాళ్లు పద్ధతిలో ప్రయోగాత్మకంగా 50 సెం.మీ. దూరంలో వరి నారు నాటారు. నీటిని నిల్వగట్టకుండా ఆరుతడి పద్ధతిని పాటిస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరుగుతోందని లింగారెడ్డి తెలిపారు.
 

 రెండెకరాల్లో అరటి..

 గతే డాది రెండెకరాల్లో అరటిని ప్రకృతి సేద్య విధానంలో సాగు చేస్తున్నారు. తొలిపంటలో ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చినట్టు లింగారెడ్డి తెలిపారు. కొన్ని కూరగాయ పంటలను సైతం పండిస్తున్నారు. తనలాగానే మరింత మంది రైతులు ప్రకృతి సేద్యం చేపట్టి.. ఏటికేడు రసాయనిక అవశేషాల్లేని మేలైన దిగుబడులు సాధించాలని లింగారెడ్డి ఆకాంక్షిస్తున్నారు.
- బిల్లుపాటి నాగేశ్వరరావు, సాక్షి, నెల్లూరు రూరల్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

 

 ప్రకృతి సేద్యంతో రైతుకు మేలు..

 ఒకప్పుడు 50 కిలోలు యూరియా వేసే పొలానికి ఇప్పుడు 500 కిలోలు వేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల సాగు భూములు, ప్రజల ఆరోగ్యం పాడవుతోందనే విషయాన్ని రైతులందరూ గుర్తించాలి. ప్రకృతి సేద్యంలోకి మారితే తొలి రెండేళ్లు దిగుబడి తగ్గినా నష్టం ఉండదు. మూడేళ్లు ఓపిక పడితే.. ప్రకృతి సేద్యంలో మంచి దిగుబడులు పొందవచ్చని స్వానుభవంలో నాకెరుకైంది. భూసారం పెంపొందుతుంది. రైతుకు ఖర్చు తగి,్గ నికరాదాయం పెరుగుతుంది. వినియోగదారుల ఆరోగ్యమూ బాగుపడుతుంది. 
- అల్లూరు లింగారెడ్డి (94939 49389), పెద్ద చెరుకూరు, నెల్లూరు రూరల్ మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

 

 23, 24 తేదీల్లో ‘పల్లె సృజన’ శోధాయాత్ర!

 ‘పల్లె సృజన’, హనీబీ నెట్‌వర్క్, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ నెల 23 - 24 తేదీల్లో అనంతపురం జిల్లాలో చిన్న శోధాయాత్రను నిర్వహించనున్నాయి. హనిమిరెడ్డి పల్లి నుంచి కంబాల పల్లి వరకు వివిధ గ్రామాల్లో కాలి నడకన వెళ్లి గ్రామాల్లో సృజనశీలురను కలుసుకొని వారి సంప్రదాయ విజ్ఞానాన్ని నమోదు చేస్తారు. పాల్గొనదలచిన యువతీ యువకులు, రైతులు, ఇతరులు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. వివరాలకు.. రాజు- 95028 55858, సందీప్- 87909 75313లను సంప్రదించవచ్చు.  www.pallesrujana.org/ చూడొచ్చు.

  

 2017నవంబర్‌లో అంతర్జాతీయ సేంద్రియ మహాసభ

 సేంద్రియ సేద్యంపై అంతర్జాతీయ (19వ) మహాసభ- 2017కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది నవంబర్ 9-11 తేదీల్లో నోయిడాలో ఈ మహాసభ జరుగుతుంది.  అనేక దేశాలకు చెందిన సేంద్రియ రైతులు,  శాస్త్రవేత్తలతోపాటు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు పాల్గొంటాయి. సేంద్రియ రైతులు తమ వినూత్న ఆవిష్కరణల గురించి ప్రతినిధులకు వివరించవచ్చు. శాస్త్రవేత్తలు 2016 సెప్టెంబర్ 30లోగా పరిశోధనా పత్రాలను సమర్పించవచ్చు. 2016 అక్టోబర్ 1 నుంచి ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకోవచ్చు. వివరాలకు www.owc.ifoam.bio చూడండి.

  

 18న జీవన ఎరువుల తయారీపై శిక్షణ

సేంద్రియ వ్యవసాయంలో వినియోగించే జీవన ఎరువు మైకోరైజా, పంటలపై తెగుళ్ల నివారణకు ఉపయోగించే ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్‌లను రైతులు తమ ఇంటి వద్ద తయారు చేసుకునే పద్ధతులపై ఈ నెల 18న గుంటూరు జిల్లా కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. విశ్రాంత వ్యవసాయాధికారి కొసరాజు తిరుమలరావు, సేంద్రియ రైతు నొక్కు అశోక్‌కుమార్ రైతులకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన రైతులు 0863- 2286255, 83744 22599 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవచ్చు.

మరిన్ని వార్తలు