రైతన్న ఇంట.. సిరుల పంట

15 Sep, 2014 02:24 IST|Sakshi

 కూరగాయల సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తోంది. తక్కువ పె ట్టుబడితో కచ్చితమైన లాభాలను తీసుకువస్తోంది. కావాల్సిందల్లా కష్టపడేతత్వం, మార్కెట్ చేసుకునే చాతుర్యం. మోతె గ్రామానికి చెందిన దాసరి గంగామణి, గంగారెడ్డి దంపతులు కూరగాయలు సాగు చేస్తూ వ్యవసాయం లాభసాటని నిరూపిస్తున్నారు.

 లింగంపేట : తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే కూరగాయలు చేతికి వస్తాయంటున్నారు యువరైతు గంగారెడ్డి. ఆయన కొన్నేళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో ఆయనకు భార్య గంగామణి చేదోడువాదోడుగా ఉంటున్నారు. కూరగాయల సాగుతో సుమారు రెండు నెలల వ్యవధిలో రూ. 50 వేల లాభం పొందానని ఆయన పేర్కొన్నారు.

కూరగాయల సాగు గురించి ఆయన మాటల్లోనే..
 ‘‘నేను కొన్నేళ్లుగా కూరగాయల సాగునే నమ్ముకున్నాను. నాకున్న 30 గుంటల వ్యవసాయ భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఈ ఖరీఫ్ సీజన్‌లో మూడు నెలల క్రితం భూమిని రెండుసార్లు బాగా లోతుగా దున్నించాను. మట్టి పొడిపొడిగా అయ్యేలా దున్నడం వల్ల మొక్కల వేర్లు భూమిలోనికి వెళతాయి. మొక్క బలంగా పెరుగుతుంది. దుక్కిలో పశువుల పేడ, కోళ్ల ఎరువు చల్లాను. రెండు నెలల క్రితం కాకర, బీర, వంకాయ హైబ్రిడ్ విత్తనాలను విత్తాను.

 పది వరుసలలో వంకాయ, ఆ తర్వాత రెండు వరుసలలో కాకరకాయ, మళ్లీ పది వరుసలలో వంకాయ, ఆ తర్వాత ఒక వరుసలలో బీరకాయ విత్తనాలు వేశాను. ఇలా పొలం అంతా చేశాను. బీర, కాకరకాయలు తీగజాతికి చెందినవి. అందువల్ల వీటి కోసం మధ్యమధ్యలో పొడవైన కర్రలను పాతాను. వారానికోసారి నీటి తడి అందించాను. వంకాయ మొక్కలు మీటరు ఎత్తు పెరిగాయి. బీర, కాకర కాయలు తీగలు పారాయి. నెల రోజులనుంచి పంట చేతికి వస్తోంది. కామారెడ్డి, గాంధారి, లింగంపేట మార్కెట్‌లతోపాటు వార సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాను.

 పెట్టుబడి వివరాలు
 భూమిని దున్నడానికి రూ. 2,500, విత్తనాలకు రూ. 1,500, ఎరువులకు రూ. 1,600, పురుగుల మందులకు రూ. 800, ఇతరత్రా రూ. 2 వేల వరకు ఖర్చయ్యాయి.

 దిగుబడులు..
 కాకర కాయలను విక్రయించగా రూ. 18 వేలు, బీరకాయలను విక్రయించగా రూ. 16 వేలు, వంకాయలను విక్రయించగా రూ. 24 వేల ఆదాయం వచ్చింది. బీర, కాకర కాయలు మరో పదిహేను రోజుల వరకు కాస్తాయి. వంకాయ ఇంకా నెల వరకు కాస్తుంది’’ అని గంగారెడ్డి వివరించారు. పెట్టుబడులుపోను ఇప్పటికి రూ. 50 వేలవరకు మిగిలాయని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు