పూలుంటే తేనె ‘పంటే’!

6 Oct, 2014 02:59 IST|Sakshi

 ‘తేనెటీగల పెంపకంలో అతిముఖ్యమైనది ఆహారం. అంటే పుష్పించే కాలం. మామిడి, జీడి మామిడి తదితర తోటలు డిసెంబర్ నెలలో పూత మొదలై ఫిబ్రవరి నెల సగం వరకు పిందె కట్టుతాయి. వివిధ రకాల పూల మొక్కలు, కుంకుడు, కంది వంటివి కూడా చలికాలంలో పుష్పిస్తాయి. కావున తేనెటీగల పెంపకం ఈ కాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉన్న చిన్నతరహా పరిశ్రమ ఇది. దీనికి విశాలమైన స్థలంతో పనిలేదు. చదువులాంటి అర్హతలు అక్కర్లేదు. సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, గృహిణులు, వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగ యువత... ఎవరైనా ఈ పరిశ్రమను నిర్వహించుకోవచ్చు. తేనెటీగలు పెంచే ముందు వాటి స్వభావాన్ని అర్థం చేసుకోగలిగితే చాలు. పెంపకం పద్ధతులను ఆకళింపు చేసుకుంటే చాలు. తొలి దశలో శిక్షణ తప్పని సరి.’ తేనెటీగల పెంపకం గురించి సూర్యనారాయణ ఇంకా ఏమంటున్నారో ఆయన మాటల్లోనే...
 
పూలే ప్రధానం
 తేనెటీగలు పెంచాలనుకునే ప్రాంతంలో పుష్పసంపద కీలక పాత్ర పోషిస్తుంది. వివిధ రుతువులు, నెలల్లో పుష్పించే మొక్కల సమాచారాన్ని సేకరించాలి. వీటి పుష్పీకరణ వ్యవధిని కూడా గమనించాలి. పుష్ప సాంద్రత కూడా చాలా ప్రధానం. పూలు అధికంగా ఉండే సీజన్‌లోనే తేనెటీగలను పెంచాలి.
తేనెటీగల పెంపకానికి కావలసిన సామగ్రిలో తేనెటీగల పెట్టే, హైవ్‌స్టాండ్ ముఖ్యమైనవి.
 తేనెటీగల పెట్టెగా టేకుతో చేసిన గూడు ఉపయోగించాలి.
     

హైవ్ స్టాండ్: తేనెటీగల గూళ్లను నేలమట్టం కంటే కొంత ఎత్తులో ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. తేనెటీగలను చీమలు, చెద పురుగులు, కీటకాల నుంచి రక్షించేందుకు ఇది దోహదపడుతుంది. నేలలోని తేమ గూళ్లను తాకకుండా ఉండేందుకు అడుగున ఉన్న గూడుకు సైతం గాలి వెలుతురు సోకేం దుకూ ఈస్టాండ్లు సౌకర్యవంతంగా ఉంటాయి.

   ఐదు ఎకరాల మామిడి తోట ఉన్న రైతు 20-25 బాక్సులు తోట అంతటా అమర్చితే మూడు నుంచి ఐదునెలల కాలంలో సుమారు 25 లీటర్ల తేనె ఉత్పత్తి చేసుకోవచ్చు. దీని ద్వారా సుమారు రూ. 18,000 నుంచి రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఈ ఆదాయం మామిడి, జీడి మామిడి పంటలకు అదనం. తేనెటీగల వలన పరపరాగ సంపర్కం జరిగి మామిడి, ఇతర పంటల్లో పిందెకట్టు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

>
మరిన్ని వార్తలు