ఒక్క సూది.. ఎంతో మేలు

25 Aug, 2014 02:32 IST|Sakshi

 కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో పాడి పరిశ్రమకు ఆదరణ పెరుగుతోంది. ఎన్నో కుటుంబాలు వ్యవసాయంతో పాటు పాడిని ఆధారం చేసుకుని రాణిస్తున్నాయి. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన రైతులు ప్రధానంగా పాడిపైనే ఆధారపడుతున్నారు. వీరంతా కొద్దిపాటి చొరవ తీసుకుంటే నాటు పశువుల నుంచి మేలు జాతి పశు సంపదను అభివృద్ధి చేసుకోవచ్చు.

 కేవలం రూ.40 లేదా రూ.80 ఖర్చుతో ఒంగోలు జాతి కోడె దూడలు,  ముర్రా జాతి పెయ్య దూడలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది కృత్రిమ గర్భధారణ సూదులతో సాధ్యమవుతుంది.  ఆవులు, బర్రెలకు ఎప్పుడు కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి. ఏయే ఆంబోతుల కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. తదితర విషయాలను జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ సహాయ సంచాలకులు డాక్టర్ హమీద్ పాషా తెలిపారు.

ఆ వివరాలు.. ఇక్కడి నుంచే సరఫరా..
 నంద్యాల, ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఘనీకృత వీర్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మేలు జాతి ఆంబోతుల వీర్యాన్ని సేకరిస్తున్నారు. వీటితో పాడి పశువులకు  కృత్రిమ గర్భధారణ సూదులు వేస్తారు. బనవాసిలో జెర్సీ కోడెలు, హెచ్‌ఎఫ్ కోడెల వీర్యాన్ని సేకరిస్తారు. నంద్యాలలో ముర్రాజాతి ఆంబోతులు, ఒంగోలు జాతి కోడెల వీర్యాన్ని సేకరిస్తారు. ఏటా పది లక్షల డోసులకు పైగా  సేకరించి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్నారు.

 సూది ఎప్పుడు వేయించాలి..
 నాటు బర్రెలు, నాటు ఆవులు సహజంగా మూడు సంవత్సరాల తర్వాత ఎదకు వస్తాయి. ఎదకు వచ్చినప్పుడు పశువులు అరవడం, తరచూ మూత్రం పోయడం జరుగుతుంటుంది. మేత తినదు. మానం నుంచి తీగ కారుతుంటుంది. ఈ ఎద లక్షణాలు బర్రెల్లో 36 గంటలు, ఆవుల్లో 24 గంటలు ఉంటాయి. జెర్సీ ఆవులు మాత్రం రెండేళ్ల ఎదకు వస్తాయి. ఎద లక్షణాలు కనిపించిన 12 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ సూదులు వేయించాలి. ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే ఉదయం వేయించాలి.

 ఇదీ బ్రీడింగ్ సమయం..
సహజంగా జూలై నుంచి సెప్టెంబర్ వరకు పశువుల్లో బ్రీడింగ్ సమయం. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈనుతుంటాయి.

ఎద సూది వేయించాక 45 నుంచి 60 రోజుల మధ్య చూడి నిర్ధారణ చేసుకోవాలి.

చూడి నిర్ధారణ అయ్యాక పశువుకు పోషకాహారం అందించాలి.

సాధారణంగా ఒక్కో గేదె 10 ఈతలు ఈనుతుంది. ఏడు ఈతల తర్వాత పాల సామర్థ్యం తగ్గిపోతుంది.

తెల్లజాతి పశువులు 270 రోజులకు, నల్లజాతి పశువులు 310 రోజులకు ఈనుతాయి.

మరిన్ని వార్తలు