దూడ పుట్టాక ముర్రుపాలు తాపే సమయం

25 Sep, 2014 03:06 IST|Sakshi

సమీకృత దాణా అంటే..
 పశువులకు కావాల్సిన అన్ని పోషకాలను సరైన మోతాదులో సమకూర్చేలా అన్ని దాణా దినుసులను పొడి చేసి మిశ్రమంగా తయారు చేస్తే దాన్ని సంపూర్ణ సమీకృత దాణా అంటారు. ఇందుకు పత్తి క ట్టె, కంది కట్టె, మొక్కజొన్న చొప్ప, కండెలు, ఉలవ చొప్ప, వేరువనగ పొట్టు, పొద్దుతిరుగుడు మొక్కలు, పూలు, చింత గింజలు, చెరకు ఆకులు, పిప్పి మొదలైన ఎండు పంటలను, మొక్కజొన్న, జొన్న గింజలు, తవుడు, గానుగ చెక్క, ఎముకల పొడి, యూరియా లాంటి దాణా దినుసులను ఉపయోగించవచ్చు.

 దూడ పుట్టాక ముర్రుపాలు తాపే సమయం
 దూడ తల్లి గర్భంలో ఉండగానే జాగ్రత్త పాటించి తల్లికి సరైన పోషకాలు అందించాలి. తల్లికి డ్త్రె పీరియడ్(వట్టిపోయే కాలం)లో పూర్తి విశ్రాంతి ఇచ్చి సరైన మేత, పోషకాలు అందించాలి. దూడ పుట్టిన మూడు గంటల్లోపే ముర్రుపాలు తాగించాలి. దీని వల్ల దూడల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దూడ పుట్టిన 7-10 రోజులకు మొదటి సారి, నెలకు ఒక సారి చొప్పున 6 నెలల వరకు నట్టల నివారణ మందు తాగించాలి. దూడలకు శుభ్రమైన పాలు, గడ్డి పరిసరాల్లో ఏర్పాటు చేయాలి. దూడలకు ప్రత్యేక దాణా తయారు చేయించి తినిపించాలి. నిర్ణీత కాల వ్యవధిలో టీకాలను ముందు జాగ్రత్తగా వేయిస్తే ప్రమాదకర వ్యాధులను అరికట్టి, దూడల మరణాల శాతం తగ్గించవచ్చు.

 మొదటి ఈత వయస్సు
 పశువుల్లో మొదటి ఈత వయసును నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించడం కోసం.. దూడ దశ నుంచే శాస్త్రీయ పద్ధతులు పాటించి పోషించాలి. మూడు నెలల వయసు వరకు శరీర బరువులో 1/10 వ వంతు పాలు తాపిస్తూ, తర్యాత సమీకృత దూడల దాణా ఇస్తూ పచ్చిగడ్డి, ఎండుగడ్డి తగు మోతాదులో అందిస్తూ లవణ మిశ్రమాలు అందించాలి. దీనివల్ల త్వరగా బరువు పెరిగి, సరైన సమయంలో ఎదకు వచ్చి, తక్కువ వయసులోనే దూడకు జన్మనిస్తుంది.

 రెండు ఈతల మధ్య వ్యవధి
 పాడిపశువుల్లో ఈతకు.. ఈతకు మధ్య ఇప్పుడున్న రెండేళ్ల వ్యవధిని అత్యల్పంగా ఏడాదికి సులువుగా తగ్గించవచ్చు. సాధారణంగా పశువుల జీవనానికి, పాలు ఇవ్వడానికి మేత, దాణా ఇస్తారు. పాడిపశువు ఒకసారి ఈనిన తర్వాత 2 నెలల్లో తిరిగి కట్టి చూడి మోయాలంటే ఆ పశువు పునరుత్పత్తి కోసం అదనంగా దాణా ఇవ్వాలి. లవణ మిశ్రమాలను సకాలంలో ఇస్తే పశువు ఎదకు వచ్చి 2 నెలల్లో చూడి కడుతుంది.

దూడకు జన్మనిచ్చిన ఏడాదికే మళ్లీ ఈనుతుంది. దీని కోసం ప్రతి పశువు ఈనిన 45 రోజుల నుంచి 60 రోజుల్లోపు తప్పక చూడి కట్టించే ఏర్పాటు చేయాలి. పాడి రైతులు.. పశువు ఈనిన, చూడి కట్టిన వివరాలను నమోదు చేయాలి. మూడు నెలలైనా చూడి నిలవకపోతే వెంటనే చికిత్స చే యించాలి. ఈతకు.. ఈతకు మధ్య వ్యవధిని ఏడాదికి తగ్గిస్తే ఒక పశువు నుంచి అత్యధికంగా 6 ఈతల్లో పాలను, దూడలను పొందే అవకాశం ఉంది.

 రోజూ పొందే పాలు
 ప్రతి పశువుకు చాఫ్ చేసిన(ముక్కలు చేసే గడ్డి) పచ్చి/ఎండు గడ్డిని సమపాళ్లలో ఇవ్వాలి. 2 లీటర్ల పాలు ఇచ్చే గేదెకు కిలో సమీకృత దాణా, 2.5 లీటర్ల పాలు ఇచ్చే ఆవుకు 1 కిలో దాణాతో పాటు సాధారణ జీవనానికి  అదనంగా మరో కిలో సమీకృత దాణా ఇస్తే ప్రతి పశువు నుంచి దాని పూర్తి సామర్థ్యం మేర పాలను పొందవచ్చు.

 దాణాతో పాటు పరిశుభ్రమైన నీటిని తగినంత అందుబాటులో ఉంచి యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటి స్తే జాతి పాడి పశువు నుంచి ప్రస్తుతం రోజూ పొందుతున్న 3 లీటర్ల పాలను 8 లీటర్లకు పెంచవచ్చు. యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, పాడి పశువు చూడితో ఉన్నపుడు పోషణలో జాగ్రత్తలు తీసుకుంటే ఆ పశువు ఈనిన తర్వాత ఇంకా ఎక్కువ పాలు ఇస్తుంది. పరిశుభ్రమైన పాల ఉత్పత్తిని పాటిస్తే ప్రస్తుతం ఒక ఈతకు పొందుతున్న 1,000 లీటర్ల పాలను 2,500 లీటర్లకు పెంచుకోవచ్చు. అంటే ఆరు ఈతల్లో 15,000 లీటర్ల పాలు పొందవచ్చు.

మరిన్ని వార్తలు