వంగ బంగారమే

30 Oct, 2014 03:28 IST|Sakshi
వంగ బంగారమే

* సీతాఫలం, కలబంద, వేపాకుల కషాయంతో పురుగులు పరారీ
* సింథటిక్ రసాయనాల అవసరం లేదు
* ప్రకృతి సేద్య పద్ధతిలో పూర్తిగా విషరహితమైన పంట
* సేంద్రియ ఎరువుతో దీటైన దిగుబడి

 
ఎప్పుడో ఏళ్లనాటి మాట. ఒక ఊరిలో ఇద్దరు అత్తాకోడళ్లు.. అత్తగారు కాకిని తోలిన ఎంగిలి చేయిని కూడా కోడలి ముందు విదిల్చేది కాదట. అంత వేధించి వేపుకు తింటున్నా.. కోడలు కొడిగడుతున్న ప్రాణాలు కండ్లలో పెట్టుకొని కాపాడుకుంటూ బతుకెళ్లదీస్తున్నది. ఇంతలో అత్తగారికి కాలం మూడింది. మహిషవాహనుడి పరివారం వచ్చి అమ్మా.. ఇక్కడి నీ పెత్తనానికి సెలవిచ్చి మాతో తరలిరా అని ఆదేశించారట. మంచం మీద వాలి యమభటుల ఆదేశాలందుకొని అలాగే కనుమూసుకొందట. కోడలు నాడి పట్టుకు చూసి అత్త పుటుక్కుమందని గ్రహించేసింది.

ఎన్నాళ్ల నుంచో అన్నపానీయాలకు మొహం వాచి పోయి ఉందేమో... అప్పటికే అత్తవారు వండి ఉట్టి మీద పెట్టిన వంకాయ కూర కుండను దించి కంచంలో వేడి అన్నం పెట్టుకొని వంకాయ ముక్కలు అంచుకు ఇంత నెయ్యి వేసుకొని కొసిరి కొసిరి కొరుకుతూ... అత్తో.. అత్తా.. వంకాయ తొడిమి వేయించి తింటున్న లేవమ్మ లే.. నీకింత పెడతమ్మా లేవమ్మ లే.. అంటూ రాని దుఃఖంతో కాకి శోక రాగం అందుకుందట. అప్పటికే యమభటుల వారెంట ఊరుదాటి వెళ్లిన ఆ తల్లి వంకాయ తొడిమ వేపుడు మాట వినగానే భటులవారిని నాలుగు భజాయించి పోండేహె.. వంగతోట ఒడిసిన తరువాత వచ్చి కనపడండి. అప్పటి వరకూ సచ్చినా వచ్చేది లేదు అని దబాయించేసి.. మంచం మీద లేచి కూర్చొని కోడలిని కోటొక్కతిట్లు తిట్టడం మొదలు పెట్టిందట. ఇది కథ. వంకాయ ప్రశస్తిని చెప్పే ఇలాంటి కథలు పుంఖాను పుంఖాలు.
 
 వంకాయ అంటే నోరూరని వారెవరూ ఉండరనేది అతిశయోక్తి కాదు. ఇంత ప్రశస్తి పొందిన వంకాయను పండించడం కూడా అంతే గగనం. మనుషులకే కాదు చీడపీడలకు కూడా వంగ తోట ప్రీతి పాత్రమే. అందుకే మొక్క ఆరాకుల దశకు ఎదిగింది మొదలు వివిధ రకాల పురుగులు దాడి మొదలు పెడతాయి. ఇందులో మొదటిది కాండం తొలిచే పురుగు, తరువాత దశలో వచ్చేది కాయతొలిచే పురుగు. చీడపీడల ఉధృతిని గమనించే పెద్దలు వంగ పండించినోడు ఏ పంట సాగుకూ వెనుకాడడన్నారు.

వంగ మీద చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకో గలిగినవాడు ఏ పంట యాజమాన్యమైనా చేయగలడన్నది పెద్దల మాట. అయితే ఆధునిక వ్యవసాయపద్ధతిలో వంగ పంట తీయాలంటే తోటను నిత్యం పురుగుమందుల్లో జలకాలాడించాల్సిందే. మిరప తరువాత అతి ఎక్కువగా పురుగు మందుల వాడకం వంగ తోటలోనే అన్నది అతిశయోక్తి కాదు. పురుగు మందు చల్లిన మరుసటి రోజే కాయలు కోసి మార్కెట్‌కు తరలించాల్సిన పరిస్థితి. ఎంతో ఇష్టంగా వంకాయను ఆరగించే వినియోగదారుడు దానిలో ఇంకిపోయిన విషాన్ని కూడా భుజిస్తున్న పరిస్థితి. విషరహితమైన వంకాయలు తినాలంటే ప్రకృతి సేద్య విధానమొక్కటే మార్గం. అందుకే ప్రకృతి సేద్య విధానంలో వంగ తోట సస్యరక్షణ నిర్వహణను తెలుసుకుందాం. ఇది ఉష్ణమండలపు కూరగాయ. విటమిన్ ఎ, బి పుష్కలంగా లభించే వంకాయను మధుమేహ రోగులూ తినొచ్చు.
 
 సాగు విధానం: వంగసాగుకు దుక్కి చేసేముందే దుక్కిలో పశువుల ఎరువు, కోడి పెంట సమపాళ్లలో వేసుకొని దుక్కి చేసుకోవాలి. వంగ మొక్కలు నాటుకోవడంతో పాటు చుట్టూ ఎరపంటగా ఆముదం వేసుకోవాలి. ఇది క్రిమికీటకాలను ఆకర్షించడం వలన ప్రధాన పంటకు రక్షణలభిస్తుంది. అంతర పంటగా వంగతోటలో ఉల్లి, వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగుల బెడద తగ్గుతుంది. అంతర పంటగా సోయకూర  వేసుకోవడం మంచిది. ఇది కూడా కాండం తొలిచే పురుగు, కాయతొలిచే పురుగులను దరి చేరనీయదు. మొక్క 50 రోజుల వయసు వచ్చే నాటికి ఎకరాకు 40 కిలోల వేపగింజల చెక్క వేస్తే దిగుబడి పెరుగుతుంది.
 
 తామర పురుగుల నివారణకు 4 కిలోల వేపగింజల పొడి, 4 కిలోల సన్నగా తరిగిన  కలబందను 100 లీటర్ల నీటిలో 10 రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ ద్రావణాన్ని వడకట్టుకొని పిచికారీ చేస్తేతామరపురుగు, ఇతర రసం పీల్చే పురుగుల బెడద ఉండదు. పసుపు పొడి, బూడిద సమపాళ్లలో కలిపి ఉదయం వేళల్లో ఆకుల మీద చల్లితే పచ్చదోమ, తెల్లదోమ దరి చేరవు. వంగ తోటకున్న మరో బెడద పిండినల్లి. దీన్ని సున్నం చల్లి నివారించవచ్చు. మొక్క మొదలుకు వేప చెక్క వేస్తే.. వేరు, కాండం  కుళ్లును నివారిస్తుంది. కాండం తొలిచే పురుగు, పెంకు పురుగు, కంపు నల్లిని నివారించడానికి సీతాఫలం, వేపపిండి కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ముద్దగా నూరిన కిలో సీతాఫలం ఆకులు, కిలో వేప చెక్క, 2.5 లీటర్ల ఆవుమూత్రంలో ఒక రోజంతా నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడకట్టి పిచికారీ చేస్తే కాండం తొలిచే పురుగులతో పాటు అన్ని రకాల కీటకాలు పోతాయి. ప్రకృతి సేద్య విధానం అనుసరిస్తున్న రైతులు అనేక మంది ఈ విధంగా వంగ సాగు సాధ్యమేనని విజయవంతంగా చాటుతున్నారు.  
  - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్

మరిన్ని వార్తలు