నడ్డి విరిచే గొడ్డు చాకిరీకి స్వస్తి!

3 Aug, 2014 23:06 IST|Sakshi
నడ్డి విరిచే గొడ్డు చాకిరీకి స్వస్తి!

పత్తి సాగులో బండ చాకిరీకి ‘బ్రష్ ఈజీ’ పరికరంతో చెక్
రూ. 100-150 ఖర్చుతో రైతులే తయారు చేసుకోవచ్చు
పురుగుమందు పూత చాలా సులభం.. భారీగా కూలి ఖర్చు ఆదా

 
బీటీ పత్తి విత్తనాలతో శనగపచ్చ పురుగు బెడద నుంచి ఉపశమనం లభించినప్పటికీ.. రసంపీల్చే పురుగులు పత్తి రైతును పీల్చి పిప్పి చేస్తున్నాయి. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పురుగుల నివారణకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పురుగుమందులను పిచికారీ చేయడం వల్ల వాతావరణంకలుషితమవ్వడమే కాకుండా, పంటకు మేలుచేసే మిత్రపురుగులు కూడా నాశనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిచికారీకి ప్రత్యామ్నాయంగా లేత దశలో పత్తి మొక్క కాండానికి పురుగుమందును పూయడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పత్తి విత్తిన తర్వాత 20 రోజులకు, 40 రోజులకు, 60 రోజులకోసారి మొక్కల కాండానికి పురుగుమందును పూస్తే రసం పీల్చే పురుగుల బెడద నుంచి పంటను రక్షించుకోవచ్చని చెబుతున్నారు. ఈ మూడు దఫాల్లో పిచికారీకి ఎకరానికి 1.5 నుంచి 2 లీటర్ల వరకు మోనోక్రోటోఫాస్‌ను వాడుతుంటారు. మొక్కల కాండానికి మందు పూసే పద్ధతిలో అయితే మూడు దఫాలకు కలిపి పావు లీటరు మందు సరిపోతుంది.

పిచికారీ కన్నా ఈ పద్ధతి సత్ఫలితాలిచ్చినప్పటికీ, మొక్క మొక్కకూ వంగి మందు పూయాల్సి రావడం పెద్ద సమస్యగా మారింది. పని మందకొడిగా నడవడం వల్ల ఎకరంలో పంటకు ఒకసారి మందు పూతకు నలుగురు కూలీల అవసరముంటుంది. వంగి మందు పూయడం కష్టం కాబట్టి ఈ పనంటేనే కూలీలు రాని పరిస్థితి నెలకొంది.

2 గంటల్లోనే ఎకరం మొక్కలకు మందు పూత

ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌కు చెందిన కీటకశాస్త్ర నిపుణుడు, రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రాంతీయ సమన్వయకర్త డాక్టర్ పుల్లూరి రమేష్ సులువుగా పని జరిగేందుకు ఉపయోగపడే ‘బ్రష్ ఈజీ’ అనే పరికరాన్ని రూపొందించారు.  దీన్ని చేతబట్టుకొని, వంగనవసరం లేకుండానే, సులువుగా మొక్కకాండానికి రసాయనాన్ని పూయవచ్చు.  ఈ పరికరంతో ఒకే ఒక్క మనిషి గంటన్నర- రెండు గంటల్లోనే ఒక ఎకరంలో పత్తి మొక్కలకు సులభంగా మందు పూయవచ్చు. తద్వారా మందు పూత కూలి ఖర్చు భారీగా తగ్గుతుంది.   

పరికరం తయారీ సులభం!

‘బ్రష్ ఈజీ’ పరికరాన్ని రూ. 100-150ల ఖర్చుతోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. 1.9 సెం.మీ. వెడల్పు, 90 సెం.మీ. పొడవు ఉన్న పీవీసీ పైపును తీసుకోవాలి. పైపునకు ఒక వైపు చివరన చిన్న బెజ్జం ఉన్న మూతను బిగించాలి. దాని లోనికి దూదితో చేసిన వొత్తిని పెట్టాలి. రెండో వైపు నుంచి పైపులోనికి రసం పీల్చే పురుగులను నివారించే మోనోక్రొటోఫాస్ రసాయనిక పురుగుమందును 1:4 నిష్పత్తిలో నీటిలో కలిపి పోయాలి. తర్వాత పైపునకు మూతను బిగించాలి. దీన్ని చేతబట్టుకొని పత్తి పొలంలో సాళ్ల మధ్య నడుచుకుంటూ వెళ్తూ.. మొక్కల కాండానికి పైపు చివరన ఉన్న దూదివొత్తి ద్వారా స్రవించే పురుగులమందును పూస్తే సరిపోతుంది. కాండానికి ఒక చుక్క మందును పూసినా సరిపోతుందని డా. రమేష్ చెప్పారు. ఈ పరికరం వల్ల కూలీల ఖర్చు చాలా వరకు తగ్గడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్
 
 రైతులే తయారు చేసుకోవచ్చు!

బ్రష్ ఈజీ పరికరం వాడితే కూలీల కొరత సమస్య తీరుతుంది. పురుగుమందుల వృథా జరగదు. సాగు వ్యయం తగ్గుతుంది. పంటకు మేలు చేసే మిత్రపురుగులకు ఎలాంటి హానీ జరగదు. పురుగుల మందును మొక్కలకు పూసే పరికరాన్ని స్వల్ప ఖర్చుతో రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. ఈ పరికరాలు దుకాణాల్లోనూ అందుబాటులో ఉన్నాయి.  
 - డాక్టర్ పుల్లూరి రమేష్ (98497 54309),
      ప్రాంతీయ సమన్వయకర్త, రాష్ర్ట జీవవైవిధ్య మండలి

నడుము నొప్పి పీడ విరగడ!

నాకున్న ఐదెకరాల్లో పత్తిని సాగు చేస్తున్న. బ్రష్ ఈజీ పరికరంతో మొక్కల మొదళ్లకు పురుగుమందును పూస్తున్నం. కూలీలకు నడుము నొప్పి పీడ పోయింది. పురుగుమందుల ఖర్చూ తగ్గింది. తక్కువ సమయం లోనే పని పూర్తవుతున్నది.   
 
- కుర్మ లక్ష్మణ్ (99498 84642),  పత్తి రైతు, పొన్నారి, ఆదిలాబాద్ జిల్లా
 
 

>
మరిన్ని వార్తలు