పాత దుపట్టాతో పండు ఈగకు చెక్!

18 Oct, 2016 05:17 IST|Sakshi
పాత దుపట్టాతో పండు ఈగకు చెక్!

ఇంటి పంటలను ఆశించే చీడపీడల్లో కొన్ని వాటంతటవే తగ్గుముఖం పడతాయి. మరికొన్నింటిని వేపనూనె వంటి వృక్ష సంబంధ క్రిమినాశనులను, కషాయాలను పిచికారీ చేసి అదుపులో ఉంచవచ్చు. కానీ కొన్ని మొండి జాతి పురుగుల నిర్మూలన మాత్రం ఒక పట్టాన సాధ్యం కాదు. ఇటువంటి వాటిలో ముఖ్యమైనది పండు ఈగ (ఫ్రూట్‌ఫ్లై) . దీనివల్ల ఇంటిపంటల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది ఆశించిన పండ్లు, కాయలు లోపలే కుళ్లి చెట్టు నుంచి రాలిపోతాయి. ఉద్యాన పంటల్లో దీన్ని నిర్మూలించేందుకు ఫిరమోన్ అనే రసాయనాన్ని వాడతారు. కానీ ఇంటిపంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయటం వల్ల రసాయనాల పిచికారీ సాధ్యం కాదు.

అయితే పాత దుపట్టా సంచితో పండు ఈగకు చెక్ చెప్పవచ్చంటున్నారు సీనియర్ ఇంటిపంటల పెంపకందారు వనమామళి నళిని (nalinivmw@gmail.com). హైదరాబాద్ మెహదీపట్నంలోని తమ మేడపై గత ఐదేళ్ల నుంచి వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలను సాగు చేస్తున్నారు. పాత దుపట్టాను కత్తిరించి కుట్టిన చిన్న సంచిలో కాయలను చేర్చి మూతి కడితే చాలు.. పండీగ బారి నుంచి పంటను కాపాడుకోవచ్చుంటున్నారు. ఈ కవచాన్ని ఛేదించి పండు ఈగ కాయలను ఆశించలేదని నళిని చెపుతున్నారు. ఆలోచన బాగుంది.. కదా మరి ఆచరిద్దామా?  

 దుపట్టా సంచుల తయారీ ఇలా...
 1. దుపట్టా సంచిని కట్టిన పండ్లు..
 2. పాత దుపట్టాను సంచుల తయారీలో వాడాలి.
 3. సంచిలో ఉంచే కాయల సంఖ్య, పరిమాణాన్ని బట్టి సరిపడా సైజులో దుపట్టాను కత్తిరించుకొని కుట్లు వేసుకోవాలి. దుపట్టాను మూడువైపులా మూసి ఒక వైపు తెరచి ఉండేలా దారంతో కుట్టుకోవాలి.  
 4.    కాయల సంఖ్యను బట్టి అవసరమైనన్ని సంచులను తయారు చేసుకోవాలి.
 5. సంచి మూతి వైపు ఒక బొందును కలిపి కుట్టాలి
 6. దుపట్టా సంచులు సిద్ధం
 7. కాయలు సంచిలోకి వచ్చేలా మూతిని బొందుతో బిగించి కట్టాలి.  
 
 ఇంటిపంటల రక్షణలో కాంతిరేఖ
 లైట్ ట్రాప్‌ను వాడి చీడపీడల బారి నుంచి ఇంటి పంటలను కాపాడుకుంటున్నారు హైదరాబాద్‌లోని మెహదీపట్నంకు చెందిన  వనమామళి నళిని. వినూత్న పద్ధతులను అవలంభించి ఇంటిపంటలను సాగు చేయటంలో ఆవిడది అందెవేసిన చేయి. ఇటీవలే చీడపీడలను నివారించేందుకు ఆమె రూపొందించిన లైట్‌ట్రాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించి మంచి ఫలితాలు రాబట్టారు. వివిధ రకాల రసం పీల్చే పురుగులను దీని ద్వారా సులభంగా అరికట్టవచ్చు. దీనికోసం ముందుగా బకెట్ లేదా వెడల్పాటి పాత్రను సబ్బునీటితో నింపుకోవాలి. మనం ఇళ్లలో వాడుకునే కరెంట్ బల్బ్‌ను బకెట్‌పైన ఏర్పాటు చే సి కనెక్షన్ ఇవ్వాలి. ఈ బకెట్‌ను ఇంటిపంటల్లో మొక్కల మధ్య ఉంచి పొద్దుగుంకేముందు లైట్‌ను ఆన్ చేయాలి. లైట్ రాత్రిమొత్తం వెలుగుతూనే ఉండాలి. ఇంటిపంటలను ఆశించిన పురుగులను ఈ వెలుతురు ఆకర్షిస్తుంది. లైట్ దగ్గరకు వచ్చిన పురుగులు బకెట్‌లోని సబ్బునీళ్లలో పడి చనిపోతాయి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే వీటి సంఖ్య తగ్గి ఇంటిపంటలకు ఎలాంటి హాని ఉండదని న ళిని చెపుతున్నారు.

మరిన్ని వార్తలు