పశుసంపద తగ్గుదలతో అల్ప దిగుబడులు

27 Oct, 2015 09:04 IST|Sakshi
పశుసంపద తగ్గుదలతో అల్ప దిగుబడులు

నేలలలో సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాల కొరత ఏర్పడటం వల్ల ఐరోపాలోని పలు దేశాల్లో ప్రధాన పంటల సాగులో 1990 నుంచి దిగుబడుల్లో పెరుగుదల నమోదవలేదని శాస్త్రవేత్తల తాజా విశ్లేషణ తేల్చింది. భూమికి సేంద్రియ ఎరువులను అందించే పశుసంపద 1980నుంచి ఐరోపాలో క్రమేపీ తగ్గిపోతోంది. దీని ప్రభావంతో పంట దిగుబడులు, సాగుయోగ్యమైన భూములు తగ్గిపోతున్నాయి.
 
 జర్మనీకి చెందిన మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్‌ఎఓ) నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. మధ్య, ఉత్తర ఐరోపాలో గత 20 ఏళ్లుగా విస్తృతంగా సాగవుతోన్న బార్లీ, గోధుమ వంటి చిరుధాన్యపు పంటలను పరిశోధన కోసం ఎంచుకున్నారు. గత ఇరవయ్యేళ్లుగా ఈ పంటల దిగుబడుల్లో పెరుగుదల లేదని తేలింది. సైన్స్ ఆఫ్‌ది టోటల్ ఎన్విరాన్‌మెంట్ పత్రికలో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. నేలలో ఉండే సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాలపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. వీటిని నేలకు అందించే కారకాలు ముఖ్యంగా పశుసంపద తగ్గిపోవటం వల్ల పంట దిగుబడులకు అత్యంత అవసరమైన జీవనద్రవ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పంట దిగుబడులపై ఇది పెను ప్రభావం చూపుతుంది.
 
  దీంతోపాటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల సేంద్రియ పదార్థం సరఫరా నిలిచిపోయి.. అధిక స్థాయిలో జీవనద్రవ్యం నశించిపోవటం వంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి. రసాయనిక ఎరువులను తక్కువగా వినియోగించటం, పప్పుజాతి పంటలను అధికంగా సాగుచేయటం, పంటమార్పిడి పద్ధతిని పాటించటం ద్వారానే ఈ సమస్యను అధిగమించగలమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
 
 సేంద్రియ పదార్థం అందకుంటే దీర్ఘకాలంలో నేల జీవనద్రవ్యాన్ని కోల్పోతుంది. ‘ఇది ఇలానే కొనసాగితే భూగర్భ నీటి నిల్వలు, నేల భూసారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త వియోస్మియర్ చెప్పారు.పంట దిగుబడులకు సంజీవనిలా పనిచేసే జీవనద్ర వ్యాన్ని కాపాడుకోవటం అవసరమని దీనికోసం సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేయటం, పంటమార్పిడిని పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతోపాటు అటవీ వనాల పెంపకం, పంట వ్యర్థాలను పొలంలోనే సేంద్రియ ఎరువులుగా మార్చే ప్రక్రియలను చేపట్టటం ద్వారా జీవనద్రవ్యాన్ని నష్టపోకుండా నివారించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు