పాలీహౌస్‌లో పంట సిరి!

4 Jun, 2014 22:32 IST|Sakshi
పాలీహౌస్‌లో పంట సిరి!

 పుణే కేంద్రంగా విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం
 
 పావెకరం(25 సెంట్లు) పంట పొలం.  అంగుళం నీరు, గంట కరెంట్‌తో వ్యవసాయం సాగిస్తే... అబ్బో అయ్యగారి చేను కొయ్యా? మొయ్యా? అని నలుగురూ పగలబడి నవ్వుతారు. అయితే.. సరిగ్గా ఇవే వనరులతో ఏడాదికి రూ.8 లక్షలు కళ్లజూస్తున్నారు మహారాష్ట్ర రైతులు. ఆశ్చర్యంగా అనిపించినా.. అతిశయోక్తిగా భావించినా.. పుణే నగరం సమీపంలోని ిహింజేవాడి గ్రామం వెళ్లి చూడండి. నిజం కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.
 
 యువ రైతు దానేశ్వర్ బోడ్కే సారథ్యంలో లాభసాటిగా సమష్టి వ్యవసాయం
 స్థానిక వినియోగదారుల అవసరం మేరకే పంటల సాగు.. డోర్ డెలివరీ
 సొంత మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా పూలు, కూరగాయల అమ్మకం.. స్వయం సహాయక బృందాలకు భాగస్వామ్యం
 

 పుణే-ముంబై జాతీయ రహదారికి ఆవలివైపు విసిరేసినట్టుగా ఉండే హింజేవాడికి చెందిన దానే శ్వర్ బోడ్కే అనే యువరైతు మదిలో మెదిలిన ఆలోచన.. కార్యరూపం దాల్చి రైతుల ఇంట పంట సిరులు కురిపిస్తోంది. సరిగ్గా వెయ్యి గజాలు లేదా పావు ఎకరం స్థలంలోని పాలీహౌస్‌లలో పూలు, కూరగాయలు పండిస్తూ అధికాదాయం పొందుతున్నారు. పుణే ఐటీ హబ్ తలేగావ్‌కు చివరన ఉండే హింజేవాడి ఒకప్పుడు మారుమూల గ్రామం. సంప్రదాయ పద్ధతిలో జొన్న, మొక్కజొన్న, పత్తి, చెరకు తదితర పంటలను సాగు చేసేవారు. ఆరుగాలం శ్రమను సాలాఖరుకు లెక్కేసుకుంటే అప్పులు, వడ్డీలు పోను చేతిలో మిగిలేది హళ్లికి హళ్లి.. సున్నకు సున్న! ఐటీ కంపెనీలు వచ్చిన తరువాత ఈ ప్రాంత భూముల ధరకు రెక్కలొచ్చాయి. జీవితకాలంలో ఎన్నడూ కళ్లజూడని డబ్బు.. ఎకరం భూమి 40 లక్షల చొప్పున అడిగినవాడికి అడిగినట్లు అమ్ముకున్నారు. చేతిలో పడిన డబ్బు హారతి కర్పూరమయ్యాక యువకులు ఐటీ హబ్‌లో చిరుద్యోగులుగా మారారు. వీరికి భిన్నంగా దూరదృష్టితో కదిలాడు దానేశ్వర్ బోడ్కే. పాలీహౌస్ వ్యవసాయాన్ని ఉద్యమ స్థాయికి తీసుకెళ్లాడు.
 
 కష్టాలే రాటుదేల్చాయి!
 
     బోడ్కే తండ్రి 16 ఎకరాల రైతు. రూ. 20 వేల  అప్పు రూ. లక్షన్నరకు పెరిగి వ్యవసాయం తలకు చుట్టిన పాములా మారింది. కుటుంబాన్ని అప్పుల ఊబి నుంచి దాటే యడానికి బోడ్కే మొదట చిరుద్యోగాలు చేశాడు. ఇంటీ రియర్ డిజైనింగ్ కోర్సు చేశాక ఒక మోస్తరు ఆదాయం పొందే స్థాయికి చేరాడు. అయినా.. ఏదో వెలితి.. ఇంకా ఏదో చేయాలన్న తపన వెంటాడింది. ఆ దశలో తలెగావ్‌లోని ప్రభుత్వ ఉద్యాన కళాశాల పాలీహౌస్ వ్యవసాయంపై 2 రోజుల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వా నించింది. మరో ఆలోచన లేకుండా శిక్షణ పొందాడు. అయితే పాలీహౌస్‌లో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం ప్రారంభించడానికి ఆ 2 రోజుల శిక్షణ సరిపోదనిపించింది. ఉద్యాన కళాశాల ప్రొఫెసర్‌ను బతిమిలాడి సంవత్సరం పాటు వేతనం లేని శిక్షణా కార్మికుడిగా పనిలో చేరాడు. పాలీహౌస్ నిర్మాణం నుంచి నిర్వాహణ వరకు అన్ని పనులనూ ఆకళింపు చేసుకున్నాడు. అనుభవమైతే సాధించాడు కానీ.. దాన్ని ఆచరణలో పెట్టేందుకు తగినంత ఆర్థిక శక్తి లేదు. విసుగు, విరామం లేకుండా  నెలల తరబడి తిరిగి కెనరా బ్యాంక్ రుణం పొందాడు. కేవలం 5 గుంటల(20 సెంట్ల) స్థలంలో తొలి పాలీహౌస్ నిర్మించాడు బోడ్కే. కార్నిషియన్ పూలే సాగు చేసి ఏడాదిలోనే అప్పు తీర్చేశాడు. పుణే నగరంలో అప్పు డప్పుడే అభివృద్ధి చెందుతున్న ఆతిథ్య పరిశ్రమదారులు ఐస్‌బర్గ్ లెట్యూస్, బ్రకోలీ, కోలే, పార్స్‌లే, సలేరీ, లూలూరోసా, చెర్రీ టమాటా, చైనా క్యాబేజీ వంటి విదేశీ కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నట్లు గుర్తించాడు. తన పాలీ హౌస్‌లో సాగు చేసి సరఫరా చేయడంతో ఆదా యం బాగా పెరిగింది. బోడ్కే అంతటితో సంతృప్తి చెందలేదు.
 
 అభినవ్ ఫార్మర్స్ క్లబ్ అవతరణ
 
     రైతు పంటలు పండించడమే కాదు.. తన సరుకును ప్రణాళికాబద్ధంగా అమ్ముకుంటేనే తగిన ప్రతిఫలం ఉంటుందని భావించిన బోడ్కే.. నలుగురినీ కూడగట్టి రైతుల సంఘటిత శక్తిని చాటాడు. కొద్దిమంది పాలీహౌస్ సాగుదారులతో 2004లో ఏర్పాటైన అభినవ్ ఫార్మర్స్ క్లబ్‌లో సభ్యుల సంఖ్య 640కు పెరిగింది. 2008లో క్లబ్‌కు జాతీయ పురస్కారం లభించింది. బోడ్కే తన కార్యకలాపాలను హింజేవాడి నుంచి మహారాష్ట్ర అంతటికీ విస్తరింపజేశాడు. వెయ్యికి పైగా పాలీహౌస్‌లు ఏర్పాటు అయ్యాయి.
 
 వినియోగదారుల ఇళ్ల వద్దకే కూరగాయలు
 
 పాలీహౌస్‌ల సంఖ్య పెరిగిన తరువాత మార్కెట్‌లో ఒడిదుడుకులు మొదలయ్యాయి. పండించిన కూర గాయలను నేరుగా వినియోగదారుడి ఇంటి గుమ్మంలోకే చేర్చాలన్న ఆలోచన మొగ్గ తొడిగింది. రైతులు పండించిన కూరగాయలను ఒక చోటకు చేర్చి ప్యాకింగ్ చేసే పనిని స్వయం సహాయక బృందాలకు అప్పగించారు. దీంతో అభినవ్ ఫామ్స్‌కు అనుబంధంగా మహిళా సంఘం ఏర్పాటైంది. వినియోగదారుల అవసరాలకనుగుణంగా వారానికి సరిపడే 7 రకాల కూరగాయలు ప్యాక్ చేసి నేరుగా ఇంటికి చేర్చుతున్నారు. దానికి అనుగుణంగా వివిధ పంటలను సాగుచేస్తున్నారు. బోడ్కే ఆధ్వర్యంలోని అభినవ్ ఫార్మర్స్ క్లబ్ తన కార్యక్రమాలను గుజరాత్, మధ్య ప్రదేశ్‌లకూ విస్తరింపజేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతులకూ శిక్షణ అందిస్తోంది.     
 
 - జిట్టా బాల్ రెడ్డి, ‘సాక్షి’ సాగుబడి డెస్క్

 పశువుల ఎరువు..

వరిపొట్టు.. అమృత్‌పానీ!

 ఇదీ బోడ్కే పాలీహౌస్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి
 
 నియంత్రిత వాతావరణంలో పంటల సాగు కాబట్టి.. సాధారణ పాలీహౌస్‌లో సస్యరక్షణ మందుల వినియోగం ఎక్కువే. అయితే, ప్రజల్లో ఆరోగ్య స్పృహతో పాటు సేంద్రియ ఆహారానికి గిరాకీ పెరగడాన్ని బోడ్కే గుర్తించాడు. పాలీహౌస్‌ల లో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని రూపొందించారు. పాలీహౌస్‌లోని 10 గజాల స్థలంలో ఉత్తర, దక్షిణాల మధ్య దుక్కి దున్ని రోటవేటర్‌తో భూమిని సమంగా చేస్తారు. దీన్ని రెండు భాగాలుగా విభజిస్తారు. మధ్యలో 40 సెంటీమీటర్ల మేర దారి వదలిపెడతారు. సమంగా చేసిన నేల మీద చివికిన పశువుల ఎరువు ఒక వరుస, దాని మీద వరి పొట్టు మరో వరుస వేస్తారు. మూడో వరుసగా ఇసుక పోస్తారు. దీన్ని రోటవేటర్‌తో దున్ని ఒక్కో వైపు 25 చొప్పున బోదెలు చేసి కూరగాయ మొక్కలు నాటుతారు. మొక్కలకు రోజూ ఉదయం 7 గంటల నుంచి 20 నిమిషాలపాటు డ్రిప్ ద్వారా నీరందిస్తారు. తేనె, నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రాలతో తయారు చేసే ‘అమృత్‌పానీ’ అనే ద్రావణ ఎరువును వారానికి ఒకసారి పిచికారీ చేస్తారు. క్రిమిసంహారిణిగా 10,000 పీపీఎం వేప నూనె, ఆవు మూత్రంను నీటిలో 3 నుంచి 5 శాతం వరకు కలిపి పిచికారీ చేస్తారు.
 
 వ్యవసాయం లాభదాయకమే!
 

 రైతు ఎవరినీ దేన్నీ ఉచితంగా అడగకూడదు, దేన్నీ ఎవరికీ ఉచితంగా ఇవ్వకూడదు. వ్యవసాయోత్పత్తులకు  రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. వ్యవసాయం లాభదాయకమైనదే. యువతరం వ్యవసాయాన్ని వృత్తిగా చేపట్టాలి. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబాలు స్వయం సమృద్ధం కావాలి.
 
 - దానేశ్వర్ బోడ్కే, అభినవ్ ఫార్మర్స్ క్లబ్, పుణే

 చిరునామా:
 అభినవ్ ఫార్మర్స్ క్లబ్, ిహింజేవాడి గ్రామం,  ముల్సి తాలూకా, పుణె జిల్లా, మహారాష్ట్ర
 ఫోన్స్:  09422005389, 0808-7690912  
 email: abinavfarmersclub@gmail.com
 

మరిన్ని వార్తలు