సేంద్రియ సేద్యంతో చీనిలో సిరుల పంట

27 Oct, 2015 08:54 IST|Sakshi
సేంద్రియ సేద్యంతో చీనిలో సిరుల పంట

సేద్యం ఆయనకు చిన్న నాటి స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేసుకోవటం కోసం ప్రభుత్యోద్యోగాన్ని సైతం వదులుకుని.. రసాయన సేద్యంతో నిస్సారంగా మారిన భూమి తల్లికి సేంద్రియ వైద్యం చేశారు. లక్షలు ఖర్చుపెట్టి సాగు చేసిన చీనితోటనే కల్పతరువుగా మార్చుకొని సిరుల పంట పండించారు. ఆటుపోట్లను ఎదుర్కొనేందుకు సేంద్రియ సాగు రైతు చేతిలో సరైన వజ్రాయుధం అని నిరూపించారు.  
 
పాత పద్ధతుల్లోనే ప్రయత్నిస్తే ఫలితాలు అవే పునరావృతమవుతాయి. కొత్త ఫలితాలు కావాలంటే కొత్త దారులను వెతకాల్సిందే... అలా సరికొత్త దారుల్లో ప్రయత్నించి అద్భుత ఫలితాలు సాధించారు కడప జిల్లా, లింగాల మండల కేంద్రానికి చెందిన ఆదర్శ రైతు సారెడ్డి చంద్రశేఖరరెడ్డి. 2003లో ఆర్టీసీ కండక్టర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి 18 ఎకరాల భూమిని కొని ఎంతో ప్రయాస కోర్చి సాగు యోగ్యంగా తీర్చిదిద్దాడు. 2005లో ఎకరాకు 100 చొప్పున 1800 చీని మొక్కలను నాటాడు. 2011లో తోట కాపుకొచ్చేవరకు బోర్లు, మోటార్లు, డ్రిప్పుకు రూ. 20 లక్షలు ఖర్చు చేశారు. మొదటి ఏడాది ఎకరాకు మూడు టన్నుల దిగుబడి రాగా సాగు ఖర్చు రూ. 30 వేలు అయ్యింది. కానీ పంటను అమ్మితే సగం కూడా రాని పరిస్థితి. రసాయన ఎరువుల వాడకంతో ఖర్చు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. తర్వాతి రెండేళ్లు అదే పరిస్థితి. అప్పటి వరకు చేసిన ఖర్చు, శ్రమా వృథా అయ్యి ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవలసిన పరిస్థితి. దీన్ని తట్టుకొని నిలిచేందుకు ఆయన ఎంచుకున్న మార్గం సేంద్రియ సాగు.
 
 సేంద్రియం.. సంజీవని...
 వ్యవసాయ పత్రికలు చదవటం ఆయనకు సేంద్రియ సాగుపై ఆసక్తిని పెంచింది. డంపింగ్‌యార్డ్‌లోని వ్యర్థాలు పంటలకు సేంద్రియ ఎరువులుగా ఉపయోగపడతాయని గతంలో ఆయన చదివిన కథనం ఈ దిశగా ప్రయత్నించేందుకు ప్రేరేపించింది. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డుకు కూరగాయల మార్కెట్, షాపులు, ఇళ్ల నుంచి సేకరించిన వ్యర్థాలు, మురుగు కాల్వల్లోని మట్టి వచ్చేవి. అనుకున్నదే తడవుగా.. వెళ్లి పరిశీలించారు. డంపింగ్ యార్డులోని వ్యర్థాల్లో అధిక భాగం..బాగా కుళ్లి ఉండటం గుర్తించి చీని చెట్లకు సేంద్రియ ఎరువుగా వాడితే తిరుగుండదని భావించారు. వెంటనే మున్సిపాలిటీకి రూ. 2 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. 15 ట్రాక్టర్లు, ఒక జేసీబీ(ప్రొక్లయినర్)ను ఏర్పాటు చేసి 900 ట్రక్కుల వ్యర్థాలను పొలానికి తోలారు. దీనికి గాను కొనుగోలు, రవాణా, గాజుపెంకులు, ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు లేకుండా వేరు చేసిన కూలీల ఖర్చు కలుపుకొని మొత్తం ట్రక్కుకు రూ. వెయ్యి చొప్పున తొమ్మిది లక్షల ఖర్చు అయ్యింది. ఇరుగు పొరుగు రైతులు ఫలితం లేని పనని పెదవి విరిచినా ఆయన పట్టించుకోలేదు.
 
 ఆయన కష్టం ఫలించి ఆరు నెలలు గడిచే సరికి తెగుళ్లు తొలగిపోయి..చెట్లు బలం పుంజుకొని ఆరోగ్యంగా తయారయ్యాయి. పండ్లు మంచి రంగు, రుచి, పరిమాణం కలిగి ఉన్నాయి. రసాయనిక సేద్యం చేసే తోటల్లో శంఖు, వట్టి పుల్ల తెగుళ్లు ఆశించి చెట్లు పాలిపోయి,కొమ్మలు ఎండిపోతుండగా చంద్రశేఖర్ రెడ్డి తోటలో మాత్రం పాలిపోయిన చెట్ల ఆకులు తిరిగి రంగు సంతరించుకొని కళకళలాడుతున్నాయి. తన తోట చుట్టు పక్కల రసాయనిక సేద్యం చేస్తున్న రైతులు వారి తోటలను పూర్తిగా తొలగించవలసిన పరిస్థితి. అందుకే రసాయనిక ఎరువుల వాడకంతో కలిగే ఫలితం తాత్కాలికమేనంటారు చంద్రశేఖర్ రెడ్డి.
 
 రసాయనిక సేద్యం కన్నా రెట్టింపు దిగుబడులు..
 రసాయనిక సేద్యం చేసిన చీనితోటలు ఐదేళ్లు మాత్రమే మంచి దిగుబడులు ఇస్తున్నాయని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసిన తన తోట ఇంకో 15 ఏళ్ల వరకు మంచి దిగుబడులు ఇస్తుందని ఆయన ధీమాగా చెబుతున్నారు. ‘పెరిగిన గడ్డిని కోయించి చెట్టు మొదళ్లలో పరిచి మట్టికప్పాను. అది మంచి ఎరువుగా మారింది. మూడేళ్లక్రితం మున్సిపాలిటీ వ్యర్థాలను వేసిన తరువాత ఎలాంటి ఎరువులు వేయలేదు. ఇప్పటి వరకూ ఎలాంటి చీడపీడలు ఆశించలేదు. ప్రస్తుతం ఎకరాకు ఎనిమిది నుంచి పది టన్నుల దిగుబడి వస్తోంది. రసాయన పద్ధతుల్లో సాగు చేసిన మా పక్క తోటల్లో మాత్రం 5 టన్నుల దిగుబడే వస్తోంది’ అని ఆయన తెలిపారు. టన్ను రూ. 25 వేల వరకూ ధర లభిస్తోంది. ఏడాదికి పురుగు మందుల ఖర్చు రూ. 50 వేలు పోను రూ. 2 లక్షల నికరాదాయం లభిస్తోంది’ అని వివరించారు చంద్రశేఖర్ రెడ్డి.
 
 నీటి తడులకు ఇబ్బంది లేదు...
 పులివెందుల ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉండటంతో ముందుచూపుతో తోట సమీపంలోని గుట్టపైన రూ. 3.50 లక్షలతో 5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు చంద్రశేఖర రెడ్డి. మొత్తం 18 ఎకరాలకు డ్రిప్పు సౌకర్యం ఏర్పాటు చేశారు. కరెంటు ఉన్నంత సేపు బోరు నీటిని తోడి అందులో నిల్వ చేస్తారు. ట్యాంకు దగ్గిర ఉన్న వాల్వ్‌ను తిప్పితే చాలు డ్రిప్పు ద్వారా 24 గంటలు నీరు మొక్కలకు చేరుతుంది. దీనివల్ల సాగునీటి ఇబ్బంది తప్పింది.
 - ఇన్‌పుట్స్: ప్రభాకర్ రెడ్డి, కడప   
 
 సేంద్రియ వ్యవసాయంతో మేలు
ప్రస్తుతం ఒక్కో చీని చెట్టుకు క్వింటావరకు దిగుబడి వస్తోంది. ఈ ఏడాది 18 ఎకరాల్లో 150 టన్నుల దిగుబడి వచ్చింది. చీని తోటల్లో ఎకరాకు 7 టన్నులు వస్తే మంచి దిగుబడి వచ్చినట్టే. అలాంటిది ఎకరాకు పది టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను రూ. 36 వేలకు అమ్మాను. రూ. 43 లక్షల ఆదాయం వచ్చింది. నికరాదాయం రూ. 35 లక్షలు వచ్చింది. సేంద్రియ ఎరువుల ప్రభావం తెలియాలంటే ఏడాది సమయం పడుతుంది. కష్టమైనా సేంద్రియ వ్యవసాయంపై శ్రద్ధపెడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ ఏడాది నుంచి పూర్తిగా పాలేకర్ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను.
 - సారెడ్డి చంద్రశేఖర రెడ్డి (99499 76474),
 సేంద్రియ రైతు, లింగాల మండలం, కడప జిల్లా

మరిన్ని వార్తలు