ఫేస్‌బుక్‌లో చూసి ఇంటిపంటల సాగు

22 Feb, 2017 18:45 IST|Sakshi
ఫేస్‌బుక్‌లో చూసి ఇంటిపంటల సాగు
► సేంద్రియ పద్ధతుల్లో మేడపైనే కూరగాయలు, 
  పండ్ల మొక్కల సాగు
► వారంలో ఐదు రోజులకు 
 సరిపడా కూరగాయల దిగుబడి
వంద కుండీల్లో ఇంటిపంటల సాగు
► దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తూనే మొక్కల పెంపకానికి సమయం కేటాయింపు
 
 
సోషల్‌ మీడియా రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటిది. ఫేస్‌బుక్‌ విలువైన సమయాన్ని హరించివేస్తుందన్న అభిప్రాయం ఉంది. అయితే, ప్రత్యేక ప్రయోజనం కోసం ఫేస్‌బుక్‌ వాడితే.. ఆరోగ్యాన్ని ఇనుమడింపజేసే చక్కని అభిరుచి పెరుగుదలకు కూడా దోహదం చేస్తుందన్నది వాస్తవం. ఫేస్‌బుక్‌ ద్వారా మేడపై ఇంటిపంటల సాగు గురించి తెలుసుకొన్నారు ఆ దంపతులు. ఫేస్‌బుక్‌లో ఇంటిపంట గ్రూప్‌లో టెర్రస్‌పై సేంద్రియ సాగుకు అవసరమైన మెలకువలను ఒంటపట్టించుకున్నారు. గత మూడేళ్ల నుంచి శ్రద్ధగా తమ ఇంటిౖపైనే సేంద్రియ పంటలను సాగు చేసుకుంటున్నారు హైదరాబాద్‌ మౌలాలీలోని ఎంజే కాలనీకి చెందిన మేర్వాని ప్రసాద్‌ (94918 17964), యశోద దంపతులు. ఇద్దరూ ఎల్‌ఐసీ ఉద్యోగులే. పనిలో తలమునకలుగా ఉన్నా తీరిక చేసుకొని ఇంటిపంటలను సాగు చేస్తున్నారు. ఇష్టమైన పని ఏదైనా కష్టం కాదని చాటి చెపుతున్నారు.

వంద కుండీల్లో ఇంటిపంటల సాగు...
ఇంటిపంటల పెంపకం కోసం తమ ఇంటిపైనే వందకు పైగా కుండీలను ఏర్పాటు చేసుకున్నారు. నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్‌ డబ్బాలు, మట్టి, సిమెంటు కుండీలు, సిల్పాలిన్‌ బ్యాగులను కుండీలుగా వాడుతున్నారు.  తొలుత ఆకుకూరల సాగుతో ఇంటిపంటల పెంపకానికి శ్రీకారం చుట్టారు ప్రసాద్‌. నమ్మకం కుదరటంతో క్రమంగా కాయగూర మొక్కలు, తీగజాతి కూరగాయలు, పండ్ల మొక్కలకు ఇంటిపంటల సాగును విస్తరించారు. ప్రస్తుతం గోంగూర, తోటకూర, బచ్చలికూర వంటి పది రకాల ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, దొండ, చిక్కుడు, దొండ వంటి కాయగూరలు, కాకర, పొట్ల వంటి తీగజాతి కాయగూరలు, నిమ్మ, సపోటాతోపాటు ద్రాక్ష వంటి తీగజాతి పండ్ల మొక్కలను కూడా సాగు చేస్తున్నారు.

జీవామృతం, వేప నూనెల పిచికారీ..
రెండు పాళ్లు మట్టి, ఒక పాలు కోకోపిట్, ఒక పాలు వర్మికంపోస్టు, గుప్పెడు వేపపిండిని కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ఇంటిపంటల పెంపకంలో వాడుతున్నారు.  ఇంటిపంట గ్రూప్‌ సభ్యుల నుంచి సేకరించిన వి,  తాము స్వయంగా తయారు చేసుకున్న విత్తనాలను మాత్రమే ఇంటిపంటల సాగులో వాడుతున్నారు. మొక్కలకు పోషకాలను అందించేందుకు లీటరు నీటికి 200 మి. లీ. జీవామృతాన్ని కలిపి 15 రోజులకోసారి మొక్కలపై పిచికారీ చేస్తారు. పాదుల్లో పోస్తారు. లీటరు నీటికి 5 మి. లీ. వేపనూనెను కలిపి మొక్కలపై పిచికారీ చేసి చీడపీడలను నివారిస్తున్నారు. పంట కాలం పూర్తయ్యాక కుండీల్లోని మట్టిని తీసి రెండు రోజుల పాటు ఎండబెట్టి తరువాత పంట సాగులో వాడతారు. రోజు విడిచి రోజు మొక్కలకు నీరందిస్తారు.

వేసవి కాలం ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు షేడ్‌నెట్‌ను వాడుతున్నారు. తమ ఇంటికి వారంలో ఐదు రోజులకు సరిపడా సేంద్రియ కూరగాయలు పండించుకుంటున్నారు. తాము పండించిన కూరగాయలను బంధువులకు, ఇరుగు పొరుగుకు ఇచ్చి ఇంటిపంటల రుచి చూపుతున్నారు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చే తోటి ఉద్యోగులు, స్నేహితులు ప్రసాద్, యశోదల కృషిని మెచ్చుకుంటున్నారు. వీరి సలహాలతో కొందరు ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు.

అయితే చాలామంది ఆసక్తి ఉన్నా ఇంటిపంటల సాగుకు సమయం కేటాయించలేమని, ఖర్చు ఎక్కువవుతుందని భావించి వెనుకంజవేస్తున్నారని.. అలాంటివారు కొన్ని రోజుల పాటు ఇంటిపంటలను సాగు చేస్తే వ్యసనంగా మారుతుందని తరువాత మానాలనుకున్నా మానలేరని వారు చెపుతున్నారు. ఇంటిపంటల సాగులో శ్రమపడటం, మొక్కల మధ్య గడపటం వల్ల మానసిక ప్రశాంతత పొందుతున్నామని యశోద సంతోషం వ్యక్తం చే శారు.  సేంద్రియ కూరగాయల సాగు వల్ల ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామనే తృప్తి గొప్పదంటున్నారు ఆ ఆదర్శ దంపతులు.

– అబ్దుల్‌ రహమాన్, సాక్షి, గౌతంనగర్, హైదరాబాద్‌
>
మరిన్ని వార్తలు