దేశీ విత్తనం.. ఆరోగ్యం.. ఆదాయం!

12 Sep, 2017 03:24 IST|Sakshi
దేశీ విత్తనం.. ఆరోగ్యం.. ఆదాయం!

రసాయన సేద్యం చేసేటప్పుడు అప్పుల కోసం తిరిగి తిరిగి అనునిత్యం అనుభవించిన వేదనను అధిగమించి ప్రకృతి సేద్యంలో దేశీ వరి వంగడాల సాగు ద్వారా ప్రశాంత జీవనానికి బాటలు వేసుకున్న ఆ యువ రైతు బైరపాగ రాజు. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ ఆయన స్వగ్రామం. పదో తరగతి వరకు చదివి 2004లో కుటుంబ సేద్యం చేపట్టాడు.  బలం వీర్యవృద్ధికి దోహదం చేసే మాప్లా సాంబ, సాధారణ ప్రసవం కోసం కూల్కర్‌ రకం, పలు ఔషధ విలువలున్న మైసూర్‌ మల్లిగ వంటి వందలాది దేశీ వరి రకాలను ఆయన సాగు చేస్తున్నాడు.

ఈ ఏడాది మార్చిలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆశ్రమంలో జరిగిన పాలేకర్‌ శిబిరంలోనే రాజు తొలిసారి శిక్షణ పొందాడు. అనేక సంవత్సరాలుగా సాక్షి ‘సాగుబడి’ పేజీలో పెట్టుబడిలేని ప్రకృతి సేద్యంపై వచ్చే కథనాలను ఆసక్తిగా చదివి ఆకళింపు చేసుకుంటున్నాడు. ఆ కథనాల స్ఫూర్తితో 2014 ఖరీఫ్‌లో తొలిసారిగా ప్రకృతి సేద్య విధానంలో 25 సెంట్లలో ఆర్‌ఎన్‌ఆర్‌ –15048 రకం వరిని ప్రయోగాత్మకంగా సాగుచేశాడు. ఖరీఫ్‌లో ఆరు, రబీలో 8 బస్తాల దిగుబడి వచ్చింది. 2015 ఖరీఫ్‌లో అరెకరంలో 12 బస్తాల దిగుబడి వచ్చింది.

దీంతో రాజుకు ప్రకృతి సేద్యంపై గురి కుదిరింది. 2016లో ‘సాగుబడి’ పేజీలో వార్తను చూసి హైదరాబాద్‌ రామకృష్ణ మఠంలో ‘సేవ్‌’ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన దేశీ విత్తన పంపిణీ కార్యక్రమానికి  హాజరై 70 రకాల దేశీ విత్తనాలను రాజు తెచ్చుకున్నాడు. ఖరీఫ్‌లో రెండెకరాల్లో సాగు చేశాడు. నారుమడిని భాగాలుగా చేసి ఒక్కో భాగంలో ఒక్కో రకం విత్తనాన్ని పోసుకున్నారు. అట్టముక్కలపై రకాల పేర్లు రాసి సూచికలు ఏర్పాటు చేశారు. తొలుత బీజామృతంతో విత్తన శుద్ధి చేశారు. రెండుసార్లు నీటి ద్వారా జీవామృతం అందించారు. నాటుకునే ముందు నారును కట్టలుగా కట్టి బీజామృతంలో ముంచి శుద్ధి చేశారు.

దమ్ములో ఎకరాకు 100 కిలోల ఘన జీవామృతం వేశారు. మడికి 4 రకాల చొప్పున నాట్లు వేశారు. రకానికి రకానికి మధ్యన 3 అడుగుల ఎడం కాలిబాటలు వదిలారు. నాట్లు వేసిన 10, 35, 65, 100 రోజుల దశలో ఎకరాకు 200 లీటర్ల చొప్పున జీవామృతాన్ని నీటి ద్వారా అందించారు. చీడపీడల నివారణకు అగ్నిఅస్త్రం చల్లారు. దేశీ విత్తనాలకు ఎలాంటి తెగుళ్లు ఆశించలేదు. నాట్లు,కోత దశలో కొంచెం శ్రమ పెరిగింది. ఎకరాకు 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది.

విత్తన వరి మడుల మధ్య దూరం వదిలేయడం వల్ల కొంత భూమి వృథా అయ్యిందని, అందువల్ల ఎక్కువ రకాల విత్తనోత్పత్తి చేసినప్పుడు దిగుబడి తక్కువగా ఉంటుందని రాజు చెప్పారు. విత్తనాలను కిలో రూ. 50 చొప్పున రైతులకు విక్రయించారు. అయినా, సాగు ఖర్చు తక్కువ కాబట్టి, ఎకరాకు రూ. 20 వేల నికరాదాయం లభించింది. ప్రకృతిసేద్యంలో నేల గుల్లబారటం వల్ల కలుపు సులభంగా చేతికొస్తుంది. శ్రమతో పాటు కూలి ఖర్చు సగం తగ్గింది. పొలంలో సాలీళ్లు, ఆరుద్ర పురుగులు, సీతాకోక చిలుకలు, తేనెటీగలతో పాటు పలు రకాల మిత్ర పురుగులు, వానపాముల సంఖ్య పెరిగింది.

మైసూర్‌ మల్లిగ, కాలాబట్టిపై ప్రత్యేక శ్రద్ధ
ఈ ఖరీఫ్‌లో ఒక ఎకరంలో మైసూర్‌ మల్లిగ (సన్నరకం), మరో ఎకరంలో కాలాబట్టి (దొడ్డు రకం.. నల్ల బియ్యం) రకాలను.. మరో ఎకరంలో బాసుమతి, కులాకర్, మాపిళ్లై సాంబ, ఇల్లప్‌సాంబ, కె5, నవార రకాలను రాజు సాగు చేస్తున్నాడు. కాలాబట్టి నాటిన 40 రోజుల్లో మనిషి ఎత్తున ఎదిగింది. మైసూర్‌ మల్లిగ 40 బస్తాల ధాన్యం దిగుబడితో మంచి ఆదాయమూ వస్తుందని రాజు ఆశిస్తున్నారు. మహిళలకు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలకు రోజువారీ తినడానికి ఈ రకం బాగుంటుంది.

కాలాబట్టి దొడ్డు రకం నల్లబియ్యం రకం. పాయసం వండుకోవడానికి ఇది శ్రేష్టమైనది.  తన కుటుంబ సభ్యులు పిండి (రసాయనిక ఎరువులు) వేయకపోతే లాభం ఎక్కువ రాదని అంటున్నారని, ప్రకృతి వ్యవసాయంలోనే ఈ ఏడాది మంచి దిగుబడితోపాటు అధిక నికరాదాయం సాధించి వారికి కూడా పూర్తిస్థాయి సంతృప్తి కలిగించగలనన్న భరోసా ఇటీవలి వర్షాల వల్ల కలిగిందని రాజు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహంతో కూరగాయలను సైతం సాగు చేసేందుకు రాజు సిద్ధమవుతున్నారు.

ఆరోగ్యవంతమైన సమాజం కోసం..
ప్రత్యేక ఔషధ గుణాలకు తాతల కాలం నాటి దేశీ వరి వంగడాలు పెట్టింది పేరు. పోషక విలువలు పుష్కలంగా కలిగి ఉండటంతోపాటు వీటిని సేవ్‌ సంస్థ విజయరామ్, శివప్రసాద రాజుల ప్రోత్సాహంతో శ్రద్ధగా సాగు చేస్తున్నా. రైతులకు విత్తనాలు, ప్రజలకు బియ్యం అందిస్తున్నా. ఆరోగ్యవంతమైన సమాజం కోసమే ప్రకృతి సేద్యం చేస్తున్నా. హేళన చేసిన వారే మెచ్చుకుంటున్నారు.

– బైరపాగ రాజు (81868 86807), గుమ్మకొండ, నాగర్‌ కర్నూల్‌
– చింతకింది లింగం, సాక్షి,  తిమ్మాజీపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లా

Read latest Vanta-panta News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్రేజీ ఫుడ్డు.. బందరు లడ్డు

మహబూబ్‌నగర్‌కు మాయావతి

ఎన్నికల ప్రచారంలో టిఫిన్‌ రెడీ!

ఇవీ సెక్షన్లు.. తప్పదు యాక్షన్‌! 

దుంపతెంచిన కలుపు మందులు

సినిమా

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌

అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

కరోనా క్రైసిస్‌: శివాని, శివాత్మిక ఉదారత

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

పెద్ద మనసు చాటుకున్న నయనతార

వైరస్‌ గురించి ముందే ఊహించా