పురుగు మందులు మోతాదుకు మించొద్దు

24 Aug, 2014 20:46 IST|Sakshi
పురుగు మందులు మోతాదుకు మించొద్దు

-    బీటీ పంటలకు 90 రోజుల వరకు మందుకొట్టొద్దు
 -    పత్తి పంట చేతికొచ్చేలోపు నాలుగుసార్లు స్ప్రే చేస్తే చాలు
 -    వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు

 
 జోగిపేట: జిల్లాలో ప్రధాన పంటల్లో ఒకటిగా పత్తి సాగవుతోంది. ఈ పంట చేతికొచ్చేలోపు నాలుగు సార్లు పురుగుల మందులు పిచికారీ చేస్తే చాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో పురుగుల మందులు వాడితే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అవగాహన లోపంతో రైతు లు అధిక మోతాదులో పురుగు మందులు వాడుతున్నారు. పత్తి పంట గూడ (పూత) దశకు కూడా రా కుండానే.. విత్తిన 45 రోజుల్లో రెండు సార్లు పురుగుల మందులు స్ప్రే చేసేశారు.
 
  పత్తిలో పురుగు మందుల వాడకంపై జోగిపేట డివిజన్ ఏడీఏ శ్రీలత అం దించిన సలహాలు, సూచనలు.. ప్రస్తుతం పత్తి పం టలు కొన్ని చోట్ల గూడలు.. మరికొన్ని చోట్ల ఆరు నుంచి ఎనిమిది ఆకులు వచ్చే దశలో ఉన్నాయి. రైతులు ప్రస్తుతం విత్తుతున్న విత్తనాలు (బీటీ) బయోటెక్నాలజీకి సంబంధించినవే. అందువల్ల విత్తిన 90 రోజుల వరకు పురుగులు ఆశించే అవకాశం లేదు. ఈ 90 రోజుల్లోపు ఆకు ముడత రాకుం డా కాన్ఫిడార్ లాంటి మందును ఒకటికి రెండు సార్లు వాడితే సరిపోతుంది. కానీ ఇప్పటికే రైతులు తమకు తోచిన మందులు తెచ్చి రెండు సార్లు పిచికారీ చేశారు. మరోవైపు నీటిలో కలపాల్సిన మందు మోతాదు కూడా ఎక్కువగా ఉంటుంది.
 
 నష్టాలు...
 - అధిక మోతాదుతో పాటు ఎక్కువ సార్లు పురుగుల మందు పిచికారీ చేయడం వల్ల ఆకులు ముడత పడడంతో పాటు పంట దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉంది.
 - ఎక్కువసార్లు మందులు వాడడం వల్ల ఖర్చు బాగా పెరిగి పెట్టుబడులు అధికమవుతాయి.
 - నేలలో తగినంత తేమ లేనప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ మందులు పిచికారీ చేయొద్దు.
  -    వర్షాలు పడక 15 రోజులు దాటితే యూరియాను నీటిలో కలిపి పత్తి పంటపై స్ప్రే చేస్తే ఫలితం ఉంటుంది.
 - లీటరు నీటికి 5 నుంచి 10 గ్రాముల యూరియాను నీటిలో కరిగించి స్ప్రే చేయడం ద్వారా ఆకులకు ముడత రాకుండా ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల కొంత వరకైనా తట్టుకుంటుంది.
 - పంటపై అక్కడక్కడ పచ్చదోమ ఆశించినట్లు తెలుస్తోంది. నివారణకు ఎస్పేట్  వాడాలి.
 - వర్షాలు కురవని సమయంలో యూరియా, డీఏపీ, పొటాష్  మందులు వేయొద్దు.
 -  మొక్క  మొదళ్ల వద్ద కొంచెం మట్టిని మందు వేసి మట్టితో కప్పితే మంచి ఫలితం ఉంటుంది.
 - శ్రీలత, ఏడీఏ, జోగిపేట
 ఫోన్: 8886614280

 
 ఉచితంగా వర్మీ యూనిట్లు
వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి.. భూ సారం పెంచుకునే విధంగా రైతులను సేంద్రియ ఎరువుల తయారీ వైపు మళ్లించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా మండలంలో ఉత్సాహవంతులైన రైతులు సొంతంగా షెడ్ ఏర్పాటు చేసుకుంటే వ్యవసాయ శాఖ తరఫున వర్మీకంపోస్ట్ కవర్‌తో పాటు ఉచితంగా వానపాములతో కూడిన వర్మీ యూనిట్లను ఇవ్వనున్నట్లు ఏఈఓ శ్రీదేవి తెలిపారు. కంగ్టి మండలానికి 15 యూనిట్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల రైతులకు వర్మీ కంపోస్ట్ ఏర్పాటు విధానంపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు ఆదర్శ రైతు జార సంగారెడ్డి, సెల్: 9492677867ని సంప్రదించాలన్నారు.  
 - తడ్కల్

మరిన్ని వార్తలు