డ్రిప్పుతో వరి సాగు మేలు!

16 Oct, 2014 03:32 IST|Sakshi
డ్రిప్పుతో వరి సాగు మేలు!

‘చుక్కల’తో చక్కని పంట!
బిందు సేద్యం, బోదె పద్ధతిలో వరి సాగు సాధ్యమే
దిగుబడి సాధారణం కంటే ఎక్కువే
సాగు నీరు, విద్యుత్ ఆదా
పలు రాష్ట్రాల్లో విస్తృత స్థాయి పరిశోధనలు

 
ఖరీఫ్ కాలంలో వర్షం బాగా తగ్గి భూగర్భ జలాలు పరిమితంగా ఉన్నప్పుడు.. రబీలో దానికి తగ్గట్టుగా పంటలను, పంటల సాగు తీరును మార్చుకోవడం తెలివైన పని. సాగునీరు అధికంగా అవసరమయ్యే వరి పంటను నీటిని నిల్వగట్టే పద్ధతిలో కన్నా.. డ్రిప్పుతో సాగు చేయడం మంచిది. కంది వంటి పప్పుధాన్యపు పంటలను అంతరపంటగా వేసుకుంటే మరీ మంచిది.  
 
 ప్రపంచ జనాభాలో అత్యధికుల రోజువారీ ప్రధాన ఆహారం వరి అన్నం. వాతావరణ వైపరీత్యాల కారణంగా భూగర్భ జలాలు త్వరితంగా అడుగంటుతున్నాయి. ఈ ఏడు దేశంలోని అనేక ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కురిసిన మేర కూడా అదనులో కురిసినవి కావు. ఈ పరిస్థితుల్లో వరి పంట విస్తీర్ణం తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో వరిసాగును బురద దుక్కి చేసి సాగు చేయడం అలవాటు.
 
  పూర్వకాలంలో కొన్ని బెట్టను తట్టుకునే వరి వంగడాలను మెట్ట పంటగా సాగు చేసేవారు. ప్రస్తుతం వరి సాగు దమ్ముచేసి సాగు చేయడం ఆనవాయితీ. దీంతో 75 శాతం జల వనరులు వరి సాగుకే ఖర్చవుతున్నాయి. మన దేశంలో 150 గ్రాముల ధాన్యం పండించడానికి 1,000 లీటర్ల సాగు నీరు ఖర్చవుతోందని తమిళనాడు వాటర్ టెక్నాలజీ డెరైక్టర్ బీజే పాండ్యన్ వివరిస్తున్నారు. నీటి వనరులు కరువై, వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న ఈ నేపథ్యంలో వరి సాగుకు ప్రత్యామ్నాయ పద్ధతుల అన్వేషణ ప్రారంభమైంది.
 
 వాస్తవానికి వరి మొక్క నీటిలో పెరిగేది కాదు. నీరు నిల్వ లేని పరిస్థితుల్లోనూ మనగలగడమే కాకుండా బలంగా దుబ్బు కట్టే లక్షణం వరికి ఉంది. అయితే కలుపును అదుపు చేసేందుకే వరిలో నాటింది మొదలు వెన్ను వంచే వరకు 2 నుంచి 5 సెంటీమీటర్ల నీరు నిల్వగట్టడం అలవాటుగా మారింది. నీటి ఎద్దడి పరిస్థితుల్లో వరుస తడుల్లో నీటిని పారించి పంట చేతికి అందుకుంటున్న అనుభవం మన రైతు సోదరులకు ఉంది. ఈ పరిస్థితుల్లో వరిని ఆరుతడి పంటగానూ, వరిలో అంతర పంటలను సాగు చేయడానికి సంబంధించిన పలు ప్రయోగాలు ఆచరణలోకి వస్తున్నాయి.
 
 సగం సాగునీరు ఆదా
 వర్షాభావ పరిస్థితుల్లో కూడా వరి సాగుకు అనువైన పద్ధతులను అన్వేషించినప్పుడు బిందు సేద్య పద్ధతి మేలైనదిగా గుర్తించారు. తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోనూ పలువురు రైతులు వరి సాగు చేసి మేలైన దిగుబడులు సాధించారు. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనల్లో సాధారణ పద్ధతికంటే 50 శాతం తక్కువ నీటితో వరి సాగు చేయడం సాధ్యమేనని రుజువైంది. పైగా బిందు సేద్యం వలన గాలి బాగా తగిలి పైరు బలంగా దుబ్బుకడుతుంది. ఆరుతడితో పండించిన వరిలో హెక్టారు (సుమారు 2.5 ఎకరాలు) సాధారణ 5 నుంచి 6.5 టన్నుల దిగుబడి కంటే అధికంగా 7 టన్నుల వరకు దిగుబడి సాధించారు. దీనితో పాటు విద్యుత్ ఖర్చు 40 శాతం మేరకు తగ్గి, రైతుకు రూ. 6 వేల వరకు అధికాదాయం లభిస్తోందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులంటున్నారు.
 
 మెట్ట వరి(ఎరోబిక్) సాగంటే కలుపు సమస్య కళ్ల ముందు భూతంలా నిలబడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ఉభయ తారక మంత్రం ఒకటుంది. అదే దబోల్కర్ పద్ధతి. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ శ్రీపాద దబోల్కర్ పంటను సాగు చేసే ముందు భూసారం పెంచడానికి పచ్చిరొట్ట సాగును సూచించారు. అది కూడా కేవలం ఒక రకం కాకుండా వీలయినన్ని ఎక్కువ రకాలను పచ్చిరొట్టగా సాగు చేసి, భూమిలో కలియదున్నితే అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయని రుజువు చేశారు.
 
 దబోల్కర్ పద్ధతి
 అన్ని రకాల పంటలను సాగుచేసి పచ్చి రొట్టగా కలియదున్నడమే దబోల్కర్ పద్ధతి. చిరుధాన్యాలు (జొన్నలు, సజ్జలు, ఉదలు, కొర్రలు, సామలు), పప్పు దినుసులు (మినుములు, పెసలు, శనగలు, చిక్కుళ్లు), నూనెగింజలు (నువ్వులు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు, ఆముదాలు), పచ్చిరొట్ట విత్తనాలు (జీలుగ, జనుము, ఉలవలు, పిల్లిపెసర) విత్తనాలను ఎకరానికి ఆరేసి కిలోల చొప్పున, సుగంధ ద్రవ్యాలు (మెంతులు, ధనియాలు, ఆవాలు, వాము) కిలో, మొత్తం 26 కిలోలు తీసుకొని ఎకరా పొలంలో అలికి గొర్రుతో ఎదబెట్టాలి. తరువాత నీరు కట్టాలి. ఈ గింజలు పెరగడంతో పాటు నేలలో ఉన్న కలుపు మొక్కలు మొలుస్తాయి. 45 రోజులు పైరు పెరిగిన తరువాత భూమిలో కలియ దున్నుకోవాలి. దీని వలన భూమిలో సేంద్రియ కర్బనం, పోషకాలు పెరుగుతాయి. నేల సారవంతమౌతుంది. కలుపు సమస్య చాలా వరకు తీరుతుంది.
 
 పచ్చిరొట్ట పైరు కలియదున్నాక పొలం మీటరు ఎడంతో బోదెలు తోలుకోవాలి. ఈ బోదెలకు మధ్య భాగంలో డ్రిప్పు పైపును వేసుకోవాలి. తొలిరోజు నీరు పెట్టిన తరువాత బెడ్ మొత్తం తడిగా మారుతుంది. ఈ తడి బోదెపై వరుసకు - వరుసకు మధ్య అడుగు, మొక్కకు - మొక్కకు అర అడుగు దూరంతో వరి నాటేసుకోవాలి. అవకాశం ఉంటే పంట వ్యర్థాలతో మల్చింగ్(ఆచ్ఛాదన) చేసుకుంటే కలుపును పూర్తిగా అదుపు చేయవచ్చు. నేలలో తేమ కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. కలుపు తీత చేపట్టినప్పుడు డ్రిప్పు పైపులను తీసి నాగలితో దున్నుకోవచ్చు. గుంటక తోలుకోవచ్చు. మోటార్‌తో నడిచే మినీ వీడర్‌తో పని మరింత సులభమౌతుంది. వీడర్ తిప్పిన తరువాత మొక్కల వద్ద కలుపు చేతితో తీసుకోవాలి.
 
 వరిలో అంతరపంటగా పప్పుదినుసుల సాగు!
 మెట్ట వరి(ఎరోబిక్)లో కంది, పెసర, మినుము, సోయాబీన్‌ను అంతర పంటలుగా పండించుకోవచ్చు. పప్పుదినుసుల పంటలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరింపజేస్తాయి.  వీటిల్లో కంది అనుకూలం. ఖరీఫ్ అయినా రబీ అయినా కంది కాపు వేసవి ఆరంభానికే అందుతుంది. బోదెలు ఉత్తర-దక్షిణాలుగా చేసుకోవడం వలన ఉత్తరాయణం, దక్షిణాయనాల్లో సూర్యుడి ప్రయాణం భిన్న మార్గంలో ఉన్నా ఎండ నిండుగా పడుతుంది. ఇలం, ఫలం అన్నట్లు పప్పు దినుసుల సాగుతో వరికి నత్రజని అందడంతో పాటు అదనపు ఆదాయం అందుతుంది. వరిలో అంతర పంటగా కంది సాగుకు ఎల్‌ఆర్‌జీ-41, ఐసీపీఎల్ లక్ష్మి అనుకూలం. ఎండు తెగులున్న చోట మాత్రం ఎల్‌ఆర్‌జీ-41 అనుకూలం కాదు.
 
 ఎరువుల వినియోగం
 పచ్చిరొట్ట కలియ దున్నిన తరువాత వీలును బట్టి ఘనజీవామృతం వేసుకోవడం లేదా పంచగవ్య పిచికారీ చేసుకోవడం చేయాలి. పైరు నాటిన తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి వడకట్టిన జీవామృతం డ్రిప్పు ద్వారా అందించవచ్చు. లేదా 5 శాతం పంచగవ్యను పిచికారీ చేసుకోవచ్చు. జీవామృతం, పంచగవ్య వినియోగం వలన ఏదేని కారణంగా పంటకు నీరందించలేకపోయినా  బెట్టకు రాకుండా నిలదొక్కుకుంటుంది. పైరు బలంగా రావడమే కాక పొడవైన వెన్ను వేసి, గింజ బరువు పెరుగుతుంది.
 - జిట్టా బాల్‌రెడ్డి, సాగుబడి డెస్క్
 ఫొటోలు: మోర్ల అనిల్‌కుమార్

మరిన్ని వార్తలు