రైతన్న మేడెక్కిన ఇంటిపంట!

20 Sep, 2014 06:21 IST|Sakshi
రైతన్న మేడెక్కిన ఇంటిపంట!

ఒకటికి నాలుగు ఆహార పంటలు పండించుకునే రైతు కుటుంబాలకు ఇంట్లో వండుకు తినడానికి కూరగాయలు, ఆకుకూరలకు కొదవ ఉండదు. అయితే, బహుళ పంటలు పండించుకునే అలవాటు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. పొలంలో ఒకటో, రెండో పంటలను మాత్రమే(అది కూడా వాణిజ్య పంటలు) సాగు చేస్తూ.. పండీ పండగానే అక్కడికక్కడే అమ్మి అప్పులు తీర్చే పరిస్థితులొచ్చాక.. ఇక ఇంటి అవసరాలకు పొలం నుంచి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏడాది పొడవునా కొనుక్కొని తినాల్సిందే గదా! ఇప్పుడు చాలా రైతు కుటుంబాల దుస్థితి ఇదే. కూరగాయల ధరలు మండిపోతున్న దశలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తున్న దుర్గతిని అధిగమించేందుకు ఒక చిన్న రైతు కుటుంబం ముందడుగు వేసింది.
 
- 150 డ్రమ్ముల్లో సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగు
- 3 కుటుంబాలకు చేదోడు

మేడ మీద కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే అవసరం సెంటు పొలంలేని పట్నవాసులకే కాదు.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి గ్రామీణ రైతు కుటుంబాలకు కూడా ఎంతగానో ఉందని చాటి చెబుతున్నారు యువ రైతు అన్నారం రవీందర్ గౌడ్(35), మౌనిక దంపతులు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ వీరి స్వగ్రామం. ఎస్సెస్సీ వరకు చదివి వ్యవసాయంలో స్థిరపడిన రవీందర్‌కు ఇద్దరు సోదరులున్నారు. వారి కుటుంబాలూ అదే గ్రామంలోనే కాపురం ఉంటున్నారు. తలా రెండెకరాల పొలం ఉంది. తన రెండెకరాల్లో బోరు కింద వరి, పత్తి వంటి పంటలు పండిస్తున్న ఆయన బోరు మెకానిక్ షాపు కూడా నిర్వహిస్తూ.. సొంత పక్కా భవనంలో నివసిస్తున్నాడు.

ఈ ఏడాది వర్షం లేకపోవడంతో పత్తి వేయడం మానేసి.. రెండు కుంటల్లో వరి ఊడ్చాడు.  ఇంటి ముందున్న పాత తొట్టిలో పడి మొలిచిన టమాటా మొక్క చాలా కాయలు కాసింది. ఇది రెండేళ్ల నాటి ముచ్చట. ఇంటి అవసరాల కోసం రెండు మూడు రోజులకోసారి రూ.50-100లు పెట్టి కూరగాయలు, ఆకుకూరలు కొనేవారు. మనం కొనడం ఎందుకు? మేడ మీద కొన్ని కుండీలు పెట్టుకొని సొంతంగా పండించు కోవచ్చు కదా? అన్న ఆలోచన వచ్చింది. ఆ క్షణంలోనే రవీందర్ మదిలో ఇంటిపంటకు బీజం పడింది. గత ఏడాది వర్షాకాలం ప్రారంభంకాగానే పూర్తిస్థాయిలో మేడ మీద ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు రవీందర్ దంపతులు.
 
వారి మేడ మీద 150 చదరపు గజాల స్థలం ఉంది. వాడేసిన 50 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ములు 75 కొని తెచ్చాడు రవీందర్. ఒక్కో డ్రమ్మును సగానికి కోశాడు. 150 చిన్న డ్రమ్ములు సిద్ధమయ్యాయి. వాటికి అడుగున నీరు బయటకుపోవడానికి రెండు, మూడు చిల్లులు పెట్టాడు. మట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపి.. షాద్‌నగర్‌లోని నర్సరీ నుంచి తెచ్చిన నారు, విత్తనాలు వేశారు. టమాటా, వంగ, మిర్చి మొక్కలు నాటారు. చెట్టుచిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి గింజలు, తోటకూర, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరల గింజలు విత్తారు. ఒక్కో డ్రమ్ములో రెండు, మూడు చొప్పున వివిధ కూరగాయ మొక్కలు నాటాడు. పొలం కోసమని సబ్సిడీపై తెచ్చిన డ్రిప్ లేటరల్ పైపులు కొన్ని తెచ్చి ఏర్పాటు చేసి, మేడ మీదున్న నీటి ట్యాంకుకు అనుసంధానం చేశాడు.

వాల్వు తిప్పగానే మొక్కలన్నిటికీ డ్రిప్ ద్వారా నీరందే ఏర్పాటు చేయడంతో పని తగ్గిపోయింది. సహజ కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలన్న ఆసక్తితో సేంద్రియ ఎరువుతో సాగు ప్రారంభించిన రవీందర్.. ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు నెలకోసారో, రెండు సార్లో వేప నూనెను తన భార్య పిచికారీ చేస్తుంటుందని చెప్పాడు. రోజూ పెద్దలూ పిల్లలూ టై కిచెన్ గార్డెన్‌ను పరిశీలిస్తూ.. కలుపు మొక్కలు కనిపిస్తే తీసేస్తుంటారు. అంతే.. చూస్తుండగానే మొక్కలు రసాయనిక అవశేషాల్లేని, తాజా ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి.
 
ఆలుగడ్డలు తప్ప..
అప్పటి నుంచీ తమ కుటుంబంతోపాటు తన ఇద్దరు సోదరుల కుటుంబాలు కూడా ఆలుగడ్డల్లాంటివి తప్ప ఆకుకూరలు, కూరగాయలు కొనాల్సిన అవసరం రావడం లేదని రవీందర్ సంతోషంగా చెప్పాడు. కొద్ది నెలల క్రితం టమాటా కిలో రూ. 70లు అమ్మిన రోజుల్లో కూడా తమ మేడ మీద కోసినప్పుడల్లా నాలుగైదు కిలోల టమాటాలు వచ్చేవని చెప్పాడు. గత ఏడాది నాటిని మొక్కల్లో టమాటా కాపు అయిపోయింది. చెట్టు చిక్కుడు మొక్కలు కాపు అయిపోయిన తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు చిగుళ్లు వచ్చి కాపుకొచ్చాయి. టమాటా, వంగ మొక్కలు మళ్లీ నాటారు.

మేడ మీద మొక్కలుండడం వల్ల గత ఎండాకాలంలో ఇంట్లో ఉబ్బరం తక్కువగా ఉందని, చల్లగా ఉందని రవీందర్ తెలిపాడు. ఇంటిముంగల కూరగాయ మొక్కలు పెట్టుకోమని ఉద్యాన శాఖ వాళ్లు కిట్లు ఇచ్చినా గ్రామస్తులు పెద్దగా స్పందించని పరిస్థితు ల్లో రవీందర్ తన మేడ మీద భారీగా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పండించడం స్థానికం గా చర్చనీయాంశమైంది. అయితే, కొందరు వివ రాలు అడిగి తెలుసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ మొదలు పెట్టలేదని రవీందర్ చెప్పాడు. కొత్తదారి తొక్కేవాడెప్పుడూ ఒక్కడే కదా!
 - గుట్టల్ల బాలయ్య,  కొందుర్గు, మహబూబ్‌నగర్‌జిల్లా
 
రోజూ తాజా కూరగాయలు దొరుకుతున్నాయి.కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంటివద్దనే పెంచుకోవడం వల్ల రోజు తాజా కూరగాయలు దొరుకుతున్నాయి. ఖర్చూ పెద్దగా లేదు. ఆకుకూరలు, పూలమొక్కలను కూడా కుండీలలో పెంచుకుంటున్నాం.
 - అన్నారం మౌనిక, గృహిణి, శ్రీరంగాపూర్, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్
 
ఈ పంటయ్యాక మట్టి మార్చేస్తా!
ప్రస్తుత పంటయ్యేటప్పటికి మొక్కల వేళ్లు డ్రమ్ముల్లో మట్టి నిండా నిండిపోతాయి. పంట పూర్తయిన తర్వాత డ్రమ్ముల్లోని మట్టిని గుమ్మరించి..  కొత్త మట్టి + పశువుల ఎరువు కలిపి మళ్లీ నింపుతా. నిమ్మ, బత్తాయి మొక్కలు కూడా డ్రమ్ముల్లో వేద్దామనుకుంటున్నా..
 - అన్నారం రవీందర్ గౌడ్ (93945 22416), రైతు, శ్రీరంగాపూర్, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్
 
 
తక్కువ చోటుందా?
మేడ మీదనో, పెరట్లోనో ఎండ తగిలే చోటు ఒకటి, రెండు గజాలకు మించి లేదు.. అయినా, సేంద్రియ ఆకుకూరలు సాగు చేయాలనుంది! అప్పుడేం చేయాలి? ఇలాంటి ప్రశ్నలో నుంచి పుట్టిందే ఈ ఆలోచన! పుస్తకాల రాక్ మాదిరిగా ఇలా ఆకుకూరల మడి(వర్టికల్ గార్డెన్)ను పెట్టుకుంటే సరి!
 
ఇనుప రాక్ వంటి ఫ్రేమ్ చేయించి, దానికి అవసరం మేరకు షేడ్‌నెట్‌ను కుట్టి.. చిన్న ట్రేలలో ఆకుకూరలు పెంచుకోవచ్చు. మరీ ఎండ ఎక్కువ అవసరం అనుకున్న మొక్కలను పై అంతస్తులో వేసుకోవాలి. ఆకుకూరలను తరిగి సలాడ్‌‌సగా ఉపయోగించడం చాలా ఆరోగ్య దాయకం అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ సలాడ్స్‌లోకి అవసరమైన మైక్రో గ్రీన్స్‌ను కూడా ఈ పద్ధతిలో ఎంచక్కా పెంచుకోవచ్చు. ఆకుకూర లేకాకుండా కొన్ని పప్పు ధాన్యాలు, నూనెగింజల రకాలను కూడా వత్తుగా మొలకెత్తించి రెండు అంగుళాలు ఎదిగిన మొక్కలను సలాడ్‌‌సలో వినియోగిస్తున్నారు.
 
3,4 అంగుళాల లోతుండి, వెడల్పుగా ఉండే ట్రేలను ఎంపిక చేసుకొని ఉపయోగించవచ్చు. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు గానీ లేదా చివికిన పశువుల ఎరువు గానీ సమపాళ్లలోను, కొద్దిగా మట్టిని కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని  ట్రేలలో నింపి మైకోగ్రీన్‌‌స పెంచవచ్చు. అడపాదడపా జీవామతం, వర్మీవాష్, కంపోస్టు టీ, అమత్‌పానీ.. వీటిల్లో ఏది వీలైతే అది పిచికారీ చేసుకుంటే చాలు!  కావాల్సిన ఎత్తులో కావల్సినన్ని అరలతో బోల్టు ల బిగింపు ద్వారా సులభంగా  సిద్ధం చేసుకునే ఇనుప రాక్‌లు కూడా మార్కెట్‌లో ఉన్నాయి. ఇల్లు మారేటప్పుడైనా.. ఇప్పుడు అవసరం లేదనుకు న్పప్పుడైనా ఆ రాక్‌ల బోల్టులు విప్పేసి బస్తాలో కట్టేసి అటక మీద పెట్టేసుకునే వెసులుబాటు ఉంటుంది.

మరిన్ని వార్తలు