పులిసిన ఆముదంతో పురుగులకు చెక్!

16 Oct, 2014 02:47 IST|Sakshi
పులిసిన ఆముదంతో పురుగులకు చెక్!

విత్తు నాటడం కాదు పంట ఇంటికి తెచ్చుకోవడం గొప్ప అంటారు పెద్దలు. కల్లంలో పంటను కాకులు, గద్దలు తన్నుకుపోకుండా కాపాడు కోవడం రైతుకు కష్టతరమే. ఈనగాసిన పంట నక్కల పాలయినట్లు మార్కెట్ మాయజాలం బారి నుంచి తప్పించుకోవడం రైతుకు ఎటూ అలవిగాని పనే అనేది ఏండ్ల తరబడి అనుభవంతో చూస్తున్నదే.
 
 అయితే విత్తనం వేసింది మొదలు సాకి సవరించే క్రమంలో కూడా పురుగూ పుట్ర దాడులు రైతు పుట్టి ముంచుతున్నాయి. కనీసం ఈ విపత్తుల నుంచైనా రైతు తనను, పంటను కాపాడుకోగలిగితే కారిన చెమట ఫలితం కండ్ల చూసుకొనే భాగ్యవంతుడవుతాడు. పంటను కాపాడుకోవడానికి కొన్ని సులభ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఆధునిక సేద్యం ఆచరణలోకి వచ్చిన తరువాత మన పూర్వీకులు తమ అనుభవసారాన్ని రంగరించి అందించిన ఈ పద్ధతులు మార్కెట్ మాయతెరల కారణంగా మరుగున పడి అంటరానివై పోయాయి. జ్ఞాపకాల దుమ్ముదులిపి ప్రాచీనులు అందించిన సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు అద్భుతంగా పనిచేస్తున్నాయని అనేక మంది రైతులు ఆచరణలో రుజువు చేస్తున్నారు.
 
 తన పొలంలో అందుబాటులో ఉండే వివిధ పదార్ధాలతో వివిధ కీటకాల సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పండ్ల తోటల్లో కాండం తొలిచే పురుగు, నల్లముట్టె పురుగు, లద్దె పురుగు వంటి వాటిని పెద్దగా ఖర్చు లేకుండా నివారించుకోవచ్చు. పులియ బెట్టిన ఆముదం పిండి ఇందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆముదం రసాన్ని తయారు చేసుకోవడం కూడా అతి సులభం.
 
 పులియ బెట్టిన ఆముదం రసం తయారు చేసుకునే విధానం:
 5 కిలోల ఆముదాలు తీసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని 5 లీటర్ల నీటిలో వేసి బాగా కలియపెట్టి ఒక కుండలో పోసి, నీడగా ఉన్న చోట 10 రోజుల పాటు కదల్చకుండా ఉంచాలి. 10 రోజుల్లో ఈ ద్రావణం బాగా పులిసి ఒక రకమైన దుర్వాసన వెదజల్లుతుంది. ఈ పులిసిన ద్రావణాన్ని 5 లీటర్ల నీరు పట్టే కుండలను తీసుకొని, కుండకు రెండు లీటర్ల ద్రావణం నింపుకోవాలి. ఈ కుండలను పొలంలో అక్కడక్కడ గొయ్యితీసి నేలకు సమానంగా పాతి పెట్టాలి. ఆ తర్వాత వీటిని సాధారణ నీటితో కుతికెల వరకు నింపాలి. ఎకరా పొలంలో ఐదు కుండలను పాతి పెడితే సరిపోతుంది.
 
 ఉపయోగించేది ఇలా:
 ఆముదం ద్రావణం నుంచి వెలువడే వాసన అన్ని రకాల రెక్కల పురుగులను, తెల్లదోమ, పచ్చదోమలను ఆకర్షిస్తుంది. లద్దెపురుగులు, నల్లముట్టె పురుగులు కూడా ఈ వాసనకు ఆకర్షితమై కుండలోని నీళ్లలో పడి చనిపోతాయి. వరి, చెరకు తోట్లల్లో గట్ల వెంట ఈ కడవలను పెట్టినట్లయితే ఎలుకలు పారిపోతాయి. ఈ వాసన ఉన్నంత కాలం ఆ ప్రాంతంలోకి ఎలుకలు తిరిగి రావు. పొలంలో అక్కడక్కడ ఎరపంటగా వేసిన ఆముదపు మొక్కల నుంచి సేకరించిన విత్తనాలను ఇందుకు వినియోగించుకోవచ్చు. మట్టి కుండలను కొనుగోలు చేసుకుంటే సరిపోతుంది.
 - సాగుబడి డెస్క్

>
మరిన్ని వార్తలు