రబీలో అధిక దిగుబడుల కోసం..

11 Nov, 2014 03:40 IST|Sakshi

 నేలలు.. పంటల ఎంపిక
 నేలలో నీటి నిల్వ శక్తి, భౌతిక, రసాయనిక స్థితిగతులు, పోషక పదార్థాల స్థాయి ఆధారంగా పంటలను ఎంపిక చేయాలి.

 నాణ్యమైన విత్తనం
 విత్తుకొద్ది పంట అనే సామెత మనందరికి తెలిసిందే. యథాబీజం తథా ఫలం.
 ఏ పంటలోనైనా ఆయా వంగడాల పూర్తి ఉత్పాదక సామర్థ్యాన్ని పొందాలంటే నాణ్యమైన విత్తనం ద్వారానే సాధ్యపడుతుంది.
 నాసికరమైన, కల్తీ విత్తనం ఎంత సారవంతమైన భూమిలో వేసినా, నీరు, ఎరువులు, కలుపు, క్రిమిసంహారక మందులు ఎన్ని వాడినా అధిక దిగుబడులు పొందడం అసాధ్యం. అందువల్ల అధిక దిగుబడులకు నాణ్యమైన విత్తనమే కీలక పెట్టుబడి.
 జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత కలిగిన విత్తనం వాడి, మంచి సేద్య పద్ధతులను పాటించినప్పుడు మాత్రమే అధిక దిగుబడులు సాధించవచ్చు.
 సరైన విత్తన ఎంపిక, నాణ్యమైన విత్తనం రైతు ఆదాయాన్ని పెంచుతుంది. అందువల్ల ధృవీకరించిన, గుర్తింపు పొందిన సంస్థల నుంచి విత్తనాలు కొనుగోలు చే సి, మొలక శాతం పరీక్ష చేసుకొని విత్తుకోవడం శ్రేయస్కరం.
 
విత్తన మోతాదు.. మొక్కల సాంద్రత

 సిఫారసు చేసిన మోతాదు కన్న విత్తనాన్ని అధికంగా లేదా తక్కువగా వాడినప్పుడు దిగుబడిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సిఫారసు చేసిన మోతాదును వాడి వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని సరిగ్గా పాటిస్తే మొక్కల సాంద్రత సరిగ్గా ఉండి.. నేల, నీరు, ఎరువుల వినియోగం సరిగ్గా జరిగి పూర్తిస్థాయి దిగుబడులను ఇస్తాయి.
 
విత్తన శుద్ధి
 వివిధ పైర్లలో రైతాంగం విస్మరిస్తున్న అంశం విత్తన శుద్ధి. తక్కువ ఖర్చుతో సులువుగా పైర్లను వివిధ చీడపీడలు, తెగుళ్ల నుంచి కొంతకాలం వరకు కాపాడేందుకు విత్తన శుద్ధి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు సిఫారసు చేసిన రసాయనిక మందులతో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి.
 
ఎరువుల యాజమాన్యం
 రైతుల భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదు కన్న ఎక్కువగా వాడరాదు. పోషక పదార్థాల స్థాయిలో ప్రతికూలమైన నిష్పత్తి ఏర్పడితే నేల స్థితిగతుల్లో మార్పులు రావడమే కాకుండా పైర్ల దిగుబడులు సన్నగిల్లుతాయి.
 రసాయనిక ఎరువుల్లో ఉండే వివిధ పోషకాలను మొక్కలు భూముల్లో ఉండే ఎలజైములు, సూక్ష్మజీవుల సహాయంతో గ్రహిస్తాయి. కాబట్టి రసాయనిక ఎరువులను పంటలు సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా రైతులు సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను, జీవన ఎరువులను తగినంతగా వేసి భూభౌతిక స్థితిని తద్వారా పంటకు అవసరమయ్యే సూక్ష్మజీవుల వృద్ధిని పెంచాలి.
 వివిధ పైర్లకు సిఫారసు చేసిన పోషకాల మోతాదును 75శాతం రసాయనిక ఎరువుల ద్వారా 25శాతం సేంద్రియ ఎరువుల ద్వారా అందించాలి.
 పైర్లకు వేసే ఎరువులను సరైన మోతాదులో, సరైన రూపంలో, సరైన సమయంలో, సరైన చోట వేస్తేనే అధిక దిగుబడులు సాధించవచ్చు.

 నీటి యాజమాన్యం
 నీటి లభ్యత ఆధారంగా పంటను ఎంపిక చేయాలి. నీటి లభ్యత సమృద్ధిగా లేని చోట ఆరుతడి పంటలు సాగుచేయాలి.
 {పస్తుత పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నీటి సమర్థ వినియోగం కోసం బిందు,తుంపర్ల విధానాన్ని వినియోగించాలి.
 సూక్ష్మనీటి సాగు పద్ధతుల వల్ల నీటి ఆదాతో పాటు, ఎరువుల సమర్థ వినియోగం, చీడ పీడల ఉధృతి తగ్గడంతో పాటు నాణ్యమైన దిగుబుడులు సాధించవచ్చు.
 వివిధ పైర్లలో కీలక దశల్లో  నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
 
కలుపు యాజమాన్యం
 పంట దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైనది కలుపు యాజమాన్యం.
 కలుపు మొక్కలు పైరు పాలు పెరిగి నీరు,ఎరువులను వినియోగించుకొని పంట దిగుబడులను తగ్గిస్తుంది.
 చేతితో కలుపు తీయడం వీలు కాని పక్షంలో సిఫారసు చేసిన రసాయనిక మందులతో సకాలంలో కలుపును నివారించుకున్నట్లైతే దిగుబడుల మీద ప్రభావం ఉండదు.
 
 సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం
 చీడపీడలను, తెగుళ్లను తొలి దశలోనే గుర్తించి అవసరం మేరకు రసాయనికి మందులను, భౌతిక, యాజమాన్య, జీవ నియంత్రణ పద్ధతులను అవలంబించి సస్యరక్షణ చర్యలను చేపట్టాలి.వాతవరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎప్పుడు ఒకే పంటను సాగుచేయకుండా, పంట మార్పిడి, మిశ్రమ పంటల సాగు విధానాన్ని  అవలంబిస్తూ అన్ని సాగు పద్ధతులు సక్రమంగా పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.
 
సలహాలు తీసుకోవాలి
సాగులో వివిధ సమస్యలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయశాఖ అధికారులు, పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక శాస్త్రవేత్తలతో పాటు వివిధ సంస్థల ఏర్పాటు ఏసిన కిసాన్ కాల్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు