కరెంటు సమస్యను అధిగమించిన నలుగురు రైతులు

19 Nov, 2014 23:57 IST|Sakshi

షాబాద్: పంటల సాగులో కరెంటు పాత్ర ఎనలేనిది. ప్రస్తుత తరుణంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. కానీ ఆ నలుగురు రైతులకు మాత్రం ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వారు ప్రభుత్వం అందజేసే కరెంట్‌పై ఆధారపడి వ్యవసాయం చేయడంలేదు. సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేస్తూ పంటలు పండిస్తున్నారు. మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 వివరాలు.. షాబాద్ మండలం మన్‌మర్రికి చెందిన రైతులు భిక్షపతి, లక్ష్మయ్య, రాంచంద్రయ్య, యాదయ్య. వీరికి ప్రభుత్వం 2012లో ఇందిర జలప్రభ పథకం కింద సోలార్ పరికరాలను అందజేసింది. రూ.6 లక్షల విలువైన ఈ పరికరాలను ప్రభుత్వం వందశాతం రాయితీపై అంద జేసింది. దీంతో వారు అప్పటినుంచి సౌరశక్తితో విద్యుదుత్పత్తి చేస్తూ బోరుబావుల ద్వారా తలా రెండు ఎకరాల్లో పత్తి, వరి, కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. ఎండాకాలంలో 24 గంటలపాటూ కరెంట్ ఉత్పత్తి అవుతోంది.

 దీంతో వారు విద్యుత్ సమస్యను అధిగమించి పంటల సాగులో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయా రైతులను ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని మిగతా రైతులు సౌరశక్తిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు సోలార్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.  సోలార్ ద్వారా రానున్న వేసవిలో విద్యుత్ కోతలను అధిగమించవచ్చని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.  
 
ప్రభుత్వ సబ్సిడీ
 విద్యుత్ కోతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలను కల్పిస్తోంది. రైతులకు సబ్సిడీపై సోలార్ సిస్టమ్‌ను పంపిణీ చేస్తోంది. వాటర్‌షెడ్ పథకంతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీలను అందిస్తూ సౌరశక్తి విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

  విద్యుత్ కోతల సమస్యకు సౌరశక్తితో చెక్ పెట్టవచ్చంటున్నారు. రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. మన్‌మర్రి గ్రామంలో సౌరశక్తిని ఉపయోగించే నలుగురు రైతులను చూసి మిగతావారు కూడా సోలార్ సిస్టమ్ కోసం వ్యవసాయ శాఖకు దరఖాస్తులు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు