కేన్సర్ నుంచి రక్షణకు ప్రకృతి సేద్యం!

1 Aug, 2016 23:11 IST|Sakshi
కేన్సర్ నుంచి రక్షణకు ప్రకృతి సేద్యం!

రసాయనిక సేద్యానికి, అధిక ఆహార ధాన్యాల దిగుబడికి అనేక దశాబ్దాల క్రితం నుంచి పెట్టింది పేరు పంజాబ్ రాష్ట్రం. కానీ, వ్యవసాయంలో రసాయనాల వాడకం మితిమీరిపోయి.. తినే ఆహారం స్లోపాయిజన్‌గా మారిపోతే? అంతకన్నా ప్రమాదకర పరిస్థితి మరేమి ఉంటుంది? ధాన్యం, గోధుమ రాశులు పండించే పచ్చని పంట పొలాల సాక్షిగా కేన్సర్ మహమ్మారి రైతు కుటుంబాలకు కడుపుకోతను మిగుల్చుతుంటే.. కింకర్తవ్యమ్? ఈ ప్రశ్నలకు ప్రకృతి వ్యవసాయమే ఏకైక సమాధానమని అవతార్‌సింగ్ భావించారు. కన్న కొడుకు కేన్సర్ బారిన పడి మృతిచెందిన క్షణంలో రసాయన సేద్యానికి చెల్లు చీటీ ఇచ్చాడాయన. ప్రకృతి సేద్యానికి పచ్చ తివాచీ పరిచారు. కుటుంబం, సమాజం ఆరోగ్యం కోసం ఆ రైతు తీసుకున్న నిర్ణయం అన్నదాతలందరికీ స్ఫూర్తిదాయకం కావాలి.

* కేన్సర్‌తో కుమారుడి మరణం.. రసాయన సేద్యానికి స్వస్తి చెప్పిన పంజాబ్ రైతు
* ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం


అవతార్ సింగ్  స్వగ్రామం పంజాబ్ రాష్ట్రం భోగ్‌పూర్ సమీపంలోని చార్కే. పన్నెండెకరాల పొలంలో ప్రకృతి సేద్య విధానంలో వివిధ రకాల పంటలను  ఆయన సాగు చేస్తున్నారు. ఆయన కుటుంబం అంతా నాణ్యమైన రసాయనిక అవశేషాల్లేని పంట ఉత్పత్తులను వినియోగించడమే కాకుండా.. విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఖ్యాతి గడించారు. ఈ విజయానికి వెనుక విషాధ గాథ దాగి ఉంది.
 
చేదు జ్ఞాపకం.. తీపి ఫలాలు...

కానీ దశాబ్దం క్రితం.. పరిస్థితి నేటికి పూర్తి భిన్నం. రసాయన సేద్యం చేస్తుండటం వల్ల పంటలపై పురుగు మందులు విపరీతంగా పిచికారీ చేసేవారు. అవసరమైన పురుగు మందులన్నింటినీ టోకున ఒకేసారి కొనుగోలు చేసేవారు. 2006లో అమర్‌జిత్ సోదరుడు బ్లడ్ కేన్సర్‌తో చనిపోయారు. పంటలపై విపరీతమైన రసాయనిక పురుగు మందుల వాడకమే కొడుకు మరణానికి కారణమని ఆయన భావించారు.

రసాయన వ్యవసాయం వల్ల తదుపరి కూడా తమ కుటుంబంలో సభ్యుల ఆరోగ్యానికి ముప్పు వస్తుందేమోనని ఆయన ఆందోళన చెందారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని భావించారు. దీంతో రసాయనాల వాడకాన్ని వదలి ప్రకృతి సేద్యం చేపట్టారు. అప్పటి నుంచి కూరగాయలు, చెరకు, మొక్కజొన్న, పసుపు పంటలను ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు.
 
‘రసాయన సేద్య పద్ధతి మంచిది కాదనే విషయం తెలిసినా చాలా ఏళ్లు కొనసాగించాం. కొన్నాళ్లకు దాని దుష్పరిణామాలు అనుభవించాం. కుటుంబ సభ్యుల ప్రాణాలను బలిపెట్టాల్సిరావటంతో సాగు పద్ధతిని మార్చుకున్నాం’ అంటారు అవతార్ సింగ్ కొడుకు అమర్‌జిత్ సింగ్. తొలి రోజుల్లో అవగాహన కోసం ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ రాసిన పలు పుస్తకాలను అవతార్ సింగ్ చదివారు. అయితే, సాటి రైతులు మాత్రం ప్రకృతి సేద్యంలో దిగుబడులు సరిగ్గా రావని.. ఆకలితో పస్తులుండి చావటం ఖాయమని ఆయనను వారించే ప్రయత్నం చేశారు. అవతార్‌సింగ్ మాత్ర ం వారి మాటలను పట్టించుకోలేదు. యోగిలా తన పని తాను చేసుకుంటూ వెళ్లారు.
 
పంటకు పోషకాలను అందించేందుకు ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన జీవామృతాన్ని.. చీడపీడలు తెగుళ్లను నివారించేందుకు ఇంగువ, పటిక, పులిసిన మజ్జిగ, అల్లం వెల్లుల్లి కషాయాలను వాడుతున్నారు. క్రమంగా ప్రకృతి సేద్యంలో అవతార్‌సింగ్ మంచి పట్టు సాధించారు. ప్రకృతి సేద్యంలో పండించిన చెరకుతో తయారు చేసిన బెల్లాన్ని అమెరికా, ఇంగ్లాండ్ సహా పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆయన పండించిన బెల్లానికి విదేశాల్లోనూ మంచి గిరాకీ ఏర్పడింది. నాడు నవ్విన సాటి రైతులందరికీ నేడు అవతార్‌సింగ్ ఆదర్శప్రాయుడిగా మారారు.

ఆయన వేసిన బాటలో ప్రకృతి సేద్యం చేస్తున్న రైతులు ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నారు. రసాయన పురుగు మందుల వల్ల పంట పెరుగుదలకు దోహదం చేసే మిత్ర పురుగులు చనిపోయి దిగుబడులు తగ్గుతున్నాయి. దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. మిత్ర పురుగులు ఏవి, శత్రు పురుగులు ఏవి అనే విషయంలో అవగాహన లేకపోవటమే రైతుల ఇబ్బందులకు కారణమంటారు అమర్‌జిత్.
 
‘పంజాబ్ ప్రభుత్వం, వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ప్రకృతి సేద్యంపై శీతకన్నేశాయి. అయితే ప్రజలు మాత్రం ఆరోగ్యానికి మేలు చేస్తాయనే కారణంతో రసాయన అవశేషాల్లేని వ్యవసాయోత్పత్తులనే కొంటున్నారు. నేను కొనసాగించిన రసాయన సేద్యం వల్లే నా కొడుకు ప్రాణాలను బలిపెట్టాల్సి వచ్చింది. అప్పట్నుంచి ప్రకృతి సేద్యం ఆచరించటం మొదలుపెట్టాను.ప్రకృతి సేద్యం లాభార్జన కోసం మాత్రమే కాదు.. మనం ప్రేమించే వారి బాగు కోసం.. ఆరోగ్యం త ర్వాతే కదా మనకు ఏదైనా..?’ అంటారు అవతార్‌సింగ్.
- దండేల కృష్ణ, సాగుబడి డెస్క్

>
మరిన్ని వార్తలు