కూలీల్లేకుండా పన్నెండెకరాల్లో పండ్ల సాగు!

22 Nov, 2016 03:34 IST|Sakshi
కూలీల్లేకుండా పన్నెండెకరాల్లో పండ్ల సాగు!

- జీవామృతం, దశపత్ర కషాయాలతోనే సాగు
- పనులన్నీ స్వయంగా రైతు సోదరులిద్దరే చేసుకుంటున్న వైనం
- ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలకన్నా తక్కువే!
-12 ఎకరాల పండ్ల తోట నుంచి ఏటా రూ. 3.25 లక్షల నికరాదాయం
 
 రసాయనిక ఎరువులు, పురుగుమందుల పేరిట వేలకు వేలు వెచ్చిస్తూ కూడా.. దిగుబడి లేక, ఆదాయం రాక కుంగిపోతున్న పండ్ల తోటల రైతులకు అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరుల ఉమ్మడి ప్రకృతి సేద్య ప్రస్థానం ఒక చక్కని పాఠం. తోటను అనుదినం కనిపెట్టుకొని ఉండి, స్వయంగా చెమటను చిందిస్తున్నారు. కూలీల అవసరం కూడా లేకుండా రైతు కుటుంబాలు అత్యంత తక్కువ ఖర్చుతో పండ్ల తోటను నిర్వహించడం ఎలాగో వీరు నిరూపిస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తూ.. మట్టిని నమ్ముకున్న రైతులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.  
 
 పన్నెండెకరాల పండ్ల తోటను నామమాత్రపు ఖర్చుతో సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కొరిపల్లి అప్పలస్వామి, నాగేశ్వరరావు సోదరులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం వెదురుపాక ఆయన స్వగ్రామం. వీరలంకపల్లి శివారు రామకృష్ణా గార్డెన్స్‌లో గత పదేళ్లుగా 12 ఎకరాలలో పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. అది తెల్ల గరప భూమి. రెండు బావులు, ఒక బోరు ఉన్నాయి. మొక్కలు నాటిన మొదట్లో నాలుగేళ్లు రసాయనిక సేద్య పద్ధతులను అనుసరించారు. 30 బస్తాల వరకు రసాయనిక ఎరువులు వేసేవారు. రూ. 50 వేల వరకు ఖర్చు చేసి రసాయనిక పురుగుల మందులు చల్లేవారు. అలా కొన్ని మొక్కలు చనిపోవటం, మొక్కల పెరుగుదల నిలిచిపోవటంతో నాలుగేళ్ల తర్వాత అప్పలస్వామి సోదరులు ప్రకృతి సేద్యం వైపు మళ్లారు. గోమూత్రం, పేడతో వ్యవసాయం చేయడం ఏమిటని చుట్టుపక్కల రైతులు వేళాకోళం చేశారు. అయినా వారు పట్టించుకోలేదు.

 తొలినాళ్లలో మామిడి, జీడిమామిడి మొక్కలు మాత్రమే ఉన్నాయి. క్రమేణా సపోటా, నారింజ, బత్తాయి, పంపర పనస, పనస, నిమ్మ, దానిమ్మ, జామ, నేరేడు, పైనాపిల్, కొబ్బరి, ఉసిరి, బాదం, సీతాఫలం, రామఫలం, దబ్బ, అంజూర,  డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం వంటి పలు పండ్ల జాతులను ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేస్తున్నారు. విత్తనాలు లేని నేరుడు, తేనె రుచిలో ఉండే కేరళ పనస, కూరల్లో వాడే సదా పనస.. పులుపు, పీచు ఎక్కువగా ఉండే పచ్చడి మామిడి  వంటి ప్రత్యేక రకాల పంటలను సైతం సాగు చేస్తున్నారు.

 ఏడాదికి ఎకరా సాగు ఖర్చు రూ. 2 వేలు!
 దాదాపు పన్నెండెకరాల పండ్ల తోటలను ఈ రోజుల్లో నామమాత్రపు ఖర్చుతో సాగు చేయటం అంటే మాటలు కాదు. రసాయన ప్రకృతి సేద్య పద్ధతుల్లో సుదీర్ఘ అనుభవాలతో రాటు తేలిన అప్పలస్వామి సోదరులు ప్రత్యేక పంథాను అనుసరించారు. ప్రకృతి సేద్యం ప్రారంభించినప్పటి నుంచి రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవామృతాన్ని చెట్లకు అందిస్తున్నారు.

 జీవామృతాన్ని అప్పలస్వామే స్వయంగా తయారు చేస్తారు. తన పొలంలో 200 లీటర్ల సామర్థ్యం గల ఆరు ప్లాస్టిక్ డ్రమ్ములను ఏర్పాటు చేసుకొని.. వాటిల్లో జీవామృతం తయారు చేసుకుంటారు. వారంలో ఆరు రోజులు రోజుకొక డ్రమ్ములోని జీవామృతాన్ని పండ్ల మొక్కలకు పోస్తారు. ఖాళీ అయిన డ్రమ్ములో తిరిగి కొత్తగా జీవామృతం కలుపుతూ ఉంటారు. ఏడాదిలో నికరంగా పది నెలల పాటు చెట్లకు జీవామృతం అందిస్తారు. డ్రమ్ము జీవామృతం తయారీకి పది కిలోల తమ నాటు ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రంతోపాటు కిలో బెల్లం, కిలో శనగపిండి వాడతారు. ఏడాదికి 3 క్వింటాళ్ల శనగపిండి అవసరమవుతుంది. రూ. 16,500 ఖర్చవుతుంది. కిలో నల్ల బెల్లం రూ. 15 చొప్పున ఆరు నెలలకు సరిపడా 180 కిలోల బెల్లానికి రూ. 2,500 వరకు ఖర్చవుతుంది. మరో ఆరు నెలలు బెల్లానికి బదులు తోటలో మిగల పండిన మామిడి, సపోటా పండ్లను జీవామృతం తయారీలో వాడతారు.

 రూ. 3 లక్షలకు పైగా నికరాదాయం...
 వీరి తోటలో సపోటా, కొబ్బరి, నిమ్మ, మామిడి చెట్ల నుంచి పండ్ల దిగుబడి వస్తోంది. సపోటా కాయ రూ. 5 చొప్పున అమ్ముతున్నారు. ఏడాదికి రూ. లక్ష ఆదాయం వస్తోంది. కొబ్బరిలో ఏడాదికి రూ. 50 వేల ఆదాయం వస్తోంది. ఎకరాకు 20 మామిడి చెట్లున్నాయి. రసాయన సేద్యంలో పండించిన కాయలు ఒక్కోటి రూ. 15 చొప్పున విక్రయిస్తుండగా ప్రకృతి సేద్యంలో పండించిన వాటిని కాయ రూ. 40 చొప్పున విక్రయిస్తున్నారు. ఏడాదికి రూ. 2 లక్షల ఆదాయం లభిస్తోంది. మొత్తం 12 ఎకరాల సాగుకు అయ్యే రూ. 25 వేల ఖర్చు పోను.. రూ. 3.25 లక్షల నికరాదాయాన్ని అప్పలస్వామి ఆర్జిస్తున్నారు.

 ప్రయాస లేని మార్కెటింగ్..
 ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన నాణ్యమైన పండ్లు కావడంతో స్థానికంగానే వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. ఇవి రుచి బావుండటం, కాయలు పెద్దగా ఉండటంతోపాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. పండ్ల నాణ్యతను గుర్తించిన వినియోగదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అడపాదడపా హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.  

 అయితే, నిమ్మకాయలను మాత్రం మార్కెట్లో మామూలు కాయలతో పాటే సాధారణ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని అప్పలస్వామి తెలిపారు. నిమ్మకాయలు ఇతర పండ్లలా విడిగా రుచి చూసేవి కాకపోవటంతో.. ఆర్గానిక్ అన్నా ప్రత్యేకంగా కొనేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని ఆయన చెప్పారు.

 ఆ క్షేత్రం.. ప్రయోగాలకు ఆలవాలం..
 మామిడి మొక్కలు గుప్పెడు లావు వూరే వరకు కర్రతో ఊతం ఏర్పాటు చేశారు. మామిడి చెట్టుకు కొమ్మలు అస్తవ్యస్తంగా పెరగనిస్తే.. చెట్టు కాండం లావు వూరదు. దీన్ని నివారించేందుకు ఐదడుగుల మేర ఎలాంటి కొమ్మలు ఉంచరు. యాభై ఏళ్లు పెరిగిన మామిడి చెట్టును అమ్ముకుంటే.. కలప ద్వారానే రైతుకు రూ. లక్ష ఆదాయం వస్తుందని అప్పలస్వామి చెప్పారు.

 ఈ తోటలో 20 ఏళ్ల పనస చెట్టుకు నాలుగేళ్ల నుంచి కాపు పూర్తిగా నిలిచిపోయింది. చెట్టును నరికివేయాలనుకున్న పరిస్థితుల్లో స్నేహితుడి సూచన మేరకు.. ఇసుక నింపిన 5 బస్తాలను చెట్టు కొమ్మలపై ఉంచారు. దాంతో కాపు వచ్చి 13 కాయలు కాశాయి. ఈ ఏడాది దీనిపై మరింత పరిశోధన చేయనున్నట్టు ఆయన తెలిపారు.

 తోటలో ప్రత్యేకంగా పెంచిన గిరిపుష్పం (గ్లైరీసీడియా) చెట్ల కొమ్మలను నరికి చెట్ల పాదుల్లో ఆచ్ఛాదనగా వేస్తారు. దీనివల్ల పాదుల్లో తేమ నిల్వ ఉంటుంది. నత్రజని తదితర పోషకాలతో కూడిన ఆకులు భూమిలో కలిసిపోయి భూసారాన్ని పెంపొందిస్తాయి.

 తన ఆవులు, గిత్తలను రోజుకో చెట్టుకు చొప్పున కట్టేసి ఉంచుతారు. వాటి పేడ, మూత్రం పాదుల్లో పడి చెట్లకు మంచి ఎరువుగా ఉపయోగపడుతున్నది. ఈ పద్ధతిని అనుసరిస్తున్నందు వల్ల పండ్ల చెట్లకు ప్రత్యేకంగా ఘన జీవామృతం తయారు చేసి వేయాల్సిన అవసరం లేదని అప్పలస్వామి చెప్పారు.

 సూక్ష్మజీవుల కోసం శాస్త్రీయ సంగీతం..!
 భూమికీ ప్రాణం ఉంటుంది. సుఖం, దుఃఖం, సంతోషం, బాధ వంటి భావోద్వేగాలుంటాయన్నది అప్పలస్వామి ప్రగాఢ నమ్మకం. పొలంలో మైక్ ఏర్పాటు చేసి ప్రవచనాలు, భగవద్గీత, శాస్త్రీయ సంగీతాన్ని  వినిపిస్తున్నారు. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు చైతన్యవంతమై భూమిలో జీవం తొణికిసలాడుతుందని ఆయన అంటారు. తద్వారా పంట దిగుబడులు కూడా పెరుగుతున్నాయంటారు అప్పలస్వామి. చినజీయర్‌స్వామి, ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వ సలహాదారు పి.విజయ్‌కుమార్, అప్పలస్వామి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి అభినందించారు. ప్రకృతి వ్యవసాయంపై నెల్లూరు, తిరుపతికి చెందిన రైతులకు ఈ తోటలో శిక్షణ ఇవ్వడం విశేషం.
 - లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, కాకినాడ ఇన్‌పుట్స్: కోన శ్రీనివాస్, సాక్షి, గోకవరం, తూ. గో. జిల్లా
 
 అతి తక్కువ ఖర్చు ఇలా సాధ్యం..
 ఏడాదికి పదిసార్లు జీవామృతం, దశపత్ర కషాయాలను పిచికారీ చేస్తారు. విడతకు 5 లీటర్ల చొప్పున ఏడాదికి 50 లీటర్ల పెట్రోలుకు గాను రూ. 3,500 ఖర్చవుతుంది. శనగపిండి, బెల్లం, పెట్రోల్ అన్నింటికీ కలిపి పన్నెండెకరాల పండ్ల తోటకు ఏడాదికి రూ. 22,500 ఖర్చవుతుంది. అంటే ఏడాది సాగు ఖర్చు ఎకరాకు రూ. 2 వేల క న్నా తక్కువేనన్నమాట! ఒక మనిషి రోజుకొక టీ తాగడానికి ఏడాదికి హీన పక్షం రూ. 2 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో సాగు వ్యయాన్ని ఒడుపుగా తగ్గిస్తూ పన్నెండెకరాల్లో పండ్ల తోటలను అప్పలస్వామి సోదరులు పొందికగా సాగు చేస్తుండడం విశేషం. మొక్కల వయసును బట్టి చెట్టుకు 5-10 లీటర్ల చొప్పున జీవామృతం పోస్తారు. ఇలా 12 ఎకరాల తోటలోని మొక్కలన్నింటికి ఒక విడత జీవామృతం పోయటానికి నెల సమయం పడుతుంది. రసాయన సేద్యంలో ఎంత లేదన్నా ఎకరాకు ఎరువులు, పురుగుమందులకు  ఏడాదికి రూ. 10 వేలకు తక్కువ ఖర్చు కాదు. జీవామృతం తయారీకి అవసరమైన గట్టు మన్ను, ఆవు పేడ, మూత్రం పొలంలోనే లభిస్తాయి. 50 కిలోల బెల్లం, శనగ పిండిని కొనుగోలు చేస్తారు. నాణ్యమైన శనగ పిండి కోసం శనగపప్పును కొని మర పట్టిస్తారు.

 విడతకు ఎకరాకు చీడపీడల నివారణకు 200 లీటర్ల జీవామృతం, 10 లీటర్ల గో మూత్రం, 5 లీటర్ల దశపత్ర కషాయం కలిపి... చెట్లు మొత్తం తడిచేలా పిచికారీ చేస్తారు. చెట్లు పూత, కాత మీదున్నప్పుడు 15 రోజులకోసారి పిచికారీ చేస్తారు. మిగిలిన రోజుల్లో మాత్రం చీడపీడలు, తెగుళ్లు ఆశించినప్పుడు మాత్రమే పిచికారీ చేస్తారు.
 
 తోటలో ఏ పనైనా స్వయంగానే..
 జీవామృతం మొక్కలకు బకెట్లతో స్వయంగా అప్పలస్వామే పోస్తారు. పిచికారీ కూడా స్వయంగా తానే చేస్తారు. పొలానికి నీరు పారగట్టటం, కాయలు కోయటం, కషాయాల తయారీ వంటి పనులను తమ్ముడు నాగేశ్వరరావుతో కలిసి స్వయంగా చేసుకుంటారు. కూలీలను పెట్టరు. మరీ అవసరమైతే ఇంటి ఆడోళ్లు పనుల్లో సహాయ పడతారని అప్పలస్వామి తెలిపారు. ఉచిత విద్యుత్ కావటంతో కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు. పొలాన్ని దున్నాల్సిన అవసరం లేదు. పెరిగిన గడ్డిని ఎప్పటికప్పుడు ఆవులు మేసేస్తుంటాయి. దీంతో దుక్కికి అయ్యే ట్రాక్టర్ / అరకల ఖర్చు తప్పింది.
 
 పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంలో పండ్ల దిగుబడి, రుచి పెరిగింది!
 రసాయన సేద్యంలో కన్నా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేపట్టాకే దిగుబడితో పాటు కాయల రుచి పెరిగింది. ఖర్చు పెద్దగా లేదు. రసాయన వ్యవసాయంలో వచ్చే  పంట ఉత్పత్తులతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఆసుపత్రులు, వైద్యులు డబ్బుగడిస్తున్నారు. ప్రకృతి సేద్యాన్ని ఆచరిస్తే రైతు కుటుంబాలకు, ప్రజలకు హాస్పిటళ్ల గుమ్మం తొక్కే అవసరం ఉండదు. రసాయనాలతో పండించిన ఆహారం తిన్న మనిషిలాగే చెట్లకు కూడా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వల్ల జబ్బు చేస్తుంది. కానీ, చెట్లు చెప్పలేవు.. మనిషి చెపుతాడు.. అంతే తేడా!
 - కొరుపల్లి అప్పలస్వామి (96661 50374) ప్రకృతి వ్యవసాయదారుడు,  వెదురుపాక, గోకవరం మండలం, తూ.గో. జిల్లా

మరిన్ని వార్తలు